కిడ్నాపర్ అనుకొని కూలీని వెంబడించి..
ABN, Publish Date - Mar 21 , 2024 | 12:02 AM
రోడ్డు పనికి వచ్చిన కూలీని కిడ్నాపర్‌గా అనుమానించిన గ్రామస్థులు అతన్ని వెంబడించగా పోలీసులు అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
భయంతో పరుగెత్తి హల్‌చల్ చేసిన కూలీ
మోత్కూరు, మార్చి 20: రోడ్డు పనికి వచ్చిన కూలీని కిడ్నాపర్‌గా అనుమానించిన గ్రామస్థులు అతన్ని వెంబడించగా పోలీసులు అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజీపురంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అనాజిపురం వద్ద వలిగొండ-తొర్రూరు జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. సికింద్రాబాదు రైల్వే సేషన్‌లో బిక్షమెత్తుకుంటున్న ఒడిస్సా రాష్ట్రానికి చెందిన సహదేవ్ అనే వ్యక్తిని రోడ్డు లేబర్ కాంట్రాక్టర్ జయకృష్ణ నిర్మాణ పనులు చేసేందుకు కూలీగా తీసుకువచ్చాడు. వారం రోజులుగా అనాజిపురంలో రోడ్డు పనిచేస్తున్న సహదేవ్ గ్రామంలోని బుడిగ జంగాల కాలనీకి వెళ్లగా కొత్త వ్యక్తి కావడంతో కుక్క మొరిగింది. దీంతో కాలనీవాసులు ప్రశ్నించగా అతనికి తెలుగు రాక, కాలనీవాసులు అడిగేది అతనికి అర్థం కాకపోవడంతో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే కిడ్నాపర్‌గా అనుమానించిన కాలనీవాసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. తనను కొడతారేమోనన్న భయంతో సహదేవ్ పరుగెత్తడంతో కాలనీవాసులు, గ్రామస్థులు వెంబడించారు. పరుగెత్తుతూనే తనను వెంబడిస్తున్న ప్రజలను బెదిరిస్తూ ఓ ప్రజాప్రతినిధి గెస్ట్‌హౌస్ ఆవరణలోకి వెళ్లి గేటు మూసి లోపల గడియ వేసుకున్నాడు. తోట పనికి ఉపయోగించేందుకే అక్కడ ఉంచిన కర్ర, కత్తి, ఇనుపరాడ్‌తో ప్రజలను బెదిరించాడు. సమాచారం తెలిసిన పోలీసులు ప్రహరీ గోడపైనుంచి ఆవరణలోకి దిగి సహదేవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విషయం తెలుసుకున్న రోడ్డు లేబర్ కాంట్రాక్టర్ అక్కడికి చేరుకుని కూలి పనుల నిమిత్తం తానే తీసుకువచ్చినట్లు వివరించటంతో అతనితోపాటు పంపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ భాష తెలియక పోవడంవల్లే ఇదంతా జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో కిడ్నాపర్లెవరూ సంచరించడం లేదని, కిడ్నాపర్లు తిరుగుతున్నారన్న వదంతులను నమ్మవద్దన్నారు. అలాంటిదేమైనా ఉంటే తామే ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.
Updated Date - Mar 21 , 2024 | 12:02 AM