Dharani : ధరణి సమస్యలపై 15 రోజుల్లో తొలి నివేదిక
ABN, Publish Date - Jan 18 , 2024 | 04:34 AM
ధరణిపై ప్రభుత్వం వేసిన కమిటీ 15 రోజుల్లో తొలి నివేదికను ఇవ్వనుంది.
సచివాలయంలో ధరణి కమిటీ రెండో భేటీ
దరఖాస్తుల పరిష్కారం తేలిగ్గా, లావాదేవీలు
సులభతరంగా అయ్యేందుకు సూచనలు
35 సమస్యల గుర్తింపు.. 22న మరో భేటీ
ఆ రోజునుంచీ నేరుగా సూచనల స్వీకరణ
అందుకోసం టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు
ఫీజు లేకుండా ధరణి సమస్యలపై ఫిర్యాదు!
చట్టంలోనూ మార్పుల దిశగా కసరత్తు
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ధరణిపై ప్రభుత్వం వేసిన కమిటీ 15 రోజుల్లో తొలి నివేదికను ఇవ్వనుంది. ధరణిలో ఉన్న సమస్యలను తొలగించేలా, మాడ్యూల్స్‌లో ఉన్న దరఖాస్తులు తేలికగా పరిష్కారం అయ్యేలా, ఽధరణిలో ఇకపై ఏ లావాదేవీ అయినా సులభతరంగా మారేలా ఆ నివేదికలు పలు సిఫారసులు చేయనున్నట్టు సమాచారం. అదే సమయంలో ధరణి చట్టంలో చేయాల్సిన మార్పులపైనా కమిటీ సిఫారసులు చేయనుంది. ధరణిపై ప్రభుత్వం నియమించిన కమిటీ మలి సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. కమిటీ కన్వీనర్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిత్తల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు ఎం.సునీల్ కుమార్, మాజీ సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్, ఎం.కోదండరెడ్డి, మధుసూదన్‌తో పాటు సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ వి.లచ్చిరెడ్డి పాల్గొన్నారు. ధరణి పోర్టల్‌లో, భూ సమస్యల పరిష్కారం లో ఉన్న 35 రకాల సమస్యలను గుర్తించిన కమిటీ.. వాటి పరిష్కారం కోసం, అత్యంత యూజర్ ఫ్రెండ్లీగా వ్యవస్థ ఉండేందుకోసం ఏం చేయాలన్న దానిపై మేధావులు, విద్యావంతులు, రైతులు, వివిధ రంగాల వారితో మా ట్లాడాలని, ఈ మేరకు 22న (వచ్చే సోమవారం) మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.
సీసీఎల్‌ఏ కార్యాలయంలో ధరణి పోర్టల్‌కు సంబంధించి చేయాల్సిన మార్పులు, చేర్పులు.. ఫిర్యాదుల పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతులపై సలహాలు, సూచనలను అదే రోజు నుంచి స్వీకరిస్తారు. కేవలం ధరణి పోర్టల్ గురించి మాత్రమే కాక.. భూచట్టాలకు, వాటి మెరుగుదలకు, భూరికార్డుల నిర్వహణకు సంబంధించి కూడా సలహాలు, సూచనలు అందించవచ్చని కమిటీ సభ్యు లు తెలిపారు. నేరుగా సలహాలు, సూచనలు ఇవ్వలేనివారికి వీలుగా ఒక టోల్‌ఫ్రీ నంబరు ఉండాలని నిర్ణయించారు. వచ్చే సమావేశం రోజునే ఈ టోల్‌ఫ్రీ నంబరును కూడా ప్రకటించి అందుబాటులోకి తీసుకొస్తారు. సులువుగా, సరళంగా భూసమస్యల పరిష్కారం ప్రజలకు అత్యంత సులువుగా, సరళంగా ఉండే విధంగా మార్పులు చేసే అంశంపైన.. తక్కువ సమయంలో ఎక్కువ సేవలు అందించేలా ధరణిని ప్రక్షాళన చేయడంపైన.. ఈ భేటీలో కమి టీ చర్చించింది. ప్రస్తుతం ధరణిలో దరఖాస్తు లు చేసుకునే తీరు, వాటి పరిష్కార ప్రక్రియ వివిధ స్థాయుల్లో ఉండటం ఇబ్బందిగా మారింది. ఉదాహరణకు ఓ రైతు సర్వే నంబర్ మిస్సింగ్ అయితే దానిని పరిష్కరించుకునేందుకు ధరణిలోని టీఎం-33లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు కలెక్టర్ లాగిన్‌కు వెళ్తుంది.
కలెక్టర్ ఆ దరఖాస్తును ఓపెన్ చేసి సంబంధిత తహశీల్దారుకు పంపిస్తారు. తహశీల్దారు ఆ సమస్య పరిష్కారానికి సంబంధించిన నివేదికలు అప్‌లోడ్ చేసి ఆర్డీవో లాగిన్‌కు పంపిస్తారు. అక్కడి నుంచి అడిషనల్ కలెక్టర్‌కు వెళ్తోంది. అదనపు కలెక్టర్ ఓకే చేసిన తరువాత ఆ దరఖాస్తు కలెక్టర్ లాగిన్‌కు చేరుతుంది. అప్పు డు కలెక్టర్ ఆ నివేదికలన్నీ పరిశీలించి.. తన పేరుతో ప్రొసీడింగ్ ఆర్డర్ తయారు చేసి ఆ నివేదికను సీసీఎల్‌ఏ లాగిన్‌లోకి సబ్‌మిట్ చేస్తారు. సీసీఎల్‌ఏ తన లాగిన్‌లోకి వచ్చిన ఆ దరఖాస్తులను ఓపెన్ చేసి అందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లూ డౌన్‌లోడ్ చేసి కమిటీకి పరిశీలనకు పంపిస్తారు. కమిటీ పరిశీలించి ఓకే చేసిన తరువాత సీసీఎల్‌ఏ ఫైనల్‌గా అప్రూవ్ చేస్తారు. అప్పుడు టీఎం-33లో బాధితుడు చేసుకున్న దరఖాస్తుకు మోక్షం లభిస్తుంది. ఇంత ప్రాసెస్ కాకుండా తక్కువ సమయంలో, తక్కువ దశల్లో సమస్యను పరిష్కరించాలని.. బాధితులు అనేకమార్లు కార్యాలయాల చుట్టూ తిరుగకుండా చాలా సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కరించే విధంగా ధరణి పోర్టల్‌ను పునర్ నిర్మాణం చేయాలని ధరణి కమిటీ భావిస్తోంది.
తప్పులున్నా సరిచేసి..
ప్రస్తుత విధానం ప్రకారం.. అర్జీదారు తెలియకగానీ, పొరపాటునగానీ దరఖాస్తు చేయాల్సిన మాడ్యూల్స్‌లో కాకుండా మరో మాడ్యూల్‌లో దరఖాస్తు చేస్తే సంబంధిత అధికారి దాన్ని తిరస్కరిస్తున్నారు. అలా కాకుండా సమస్య పరిష్కారానికి అనుకూలమైన మాడ్యూల్‌లోకి దరఖాస్తును మార్చుకోవడం, లేదా ఆటోమేటిక్‌గా సిస్టమే దాన్ని మార్చే సులభతరమైన వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ధరణి కమిటీ సభ్యులు భావిస్తున్నారు. దరఖాస్తుల ఫీజులను తగ్గించాలా లేక రద్దుచేయాలా.. 2020 రెవెన్యూ చట్టానికి మార్పులేమైనా చేయాలా? అనే దిశగా కూడా కమిటీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టం 2020, అందులోని ధరణి పోర్టల్ ప్రకారం ఏ మాడ్యుల్ కింద చేసిన దరఖాస్తు అయినా జిల్లా కలెక్టర్, ఆ తర్వాత సీసీఎల్‌ఏ స్థాయిలోనే పరిష్కారం అవుతున్నాయి. అలాకాకుండా సమస్యలను తహసీల్దార్ల స్థాయిలోనే పరిష్కరించేలా వ్యవస్థలో మార్పులను క మిటీ సూచించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీఎం-33 మాడ్యూల్‌లోని ఫిర్యాదులను ప్రస్తుతం సీసీఎల్‌ఏ స్థాయిలో మాత్రమే పరిష్కరించే వీలుంది. అలా కాకుండా కలెక్టర్ స్థాయిలోనే వాటిని పరిష్కరించే వీలుంటే బాగుంటుందని సిఫారసు చేయనుంది. అలాగే.. తహసీల్దార్ల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలకు అప్పిలేట్ అథారిటీగా కలెక్టర్‌ను.. కలెక్టర్ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలకు అప్పిలేట్ అథారిటీగా సీసీఎల్‌ఏను పెట్టాలనే యోచన ఉంది. దానివల్ల ప్రతి దరఖాస్తూ కలెక్టర్, సీసీఎల్‌ఏ వద్దకు రావాల్సిన అవస రం ఉండదని, ప్రజలకు క్షేత్రస్థాయిలోనే సులభంగా పనులు జరిగిపోతాయనే భావన కమిటీ సభ్యుల్లో వ్యక్తమైందని స మాచారం. క్షేత్రస్థాయిలో అర్జీలు, దరఖాస్తుల పరిష్కారంలో ఏవైనా అవకతవకలుంటే.. అప్పిలేట్ అథారిటీగా కలెక్టర్లు, సీసీఎల్‌ఏ ఉంటారని, ఇది అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందనే అభిప్రాయంతో ఉన్నారు.
అధ్యయనం, విశ్లేషణ పూర్తి..
ధరణి పోర్టల్ పనితీరు, స్పీడ్, వర్క్‌లోడ్‌పై కమిటీ అధ్యయనం పూర్తయ్యింది. ఇప్పటి దాకా దాఖలైన దరఖాస్తుల సంఖ్య, వాటిలో ఆమోదించినవి? తిరస్కరించినవి ఎన్ని? వాటికి కారణాలేమిటి అనే అంశాలపై కమిటీ లోతైన విశ్లేషణ చేసింది. కమిటీ సభ్యులు కోరిన సమాచారాన్ని సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్ అందించారు. పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ధరణి పనితీరును ఆయన సభ్యులకు వివరించారు. ధరణి పోర్టల్ టెక్నికల్ టీమ్.. దాని పనితీరు గురించి సభ్యులకు వెల్లడించారు. అప్లికేషన్ పెట్టుకోవడం మొదలు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరికి ఫైల్ ఎలా సర్క్యులేట్ అవుతుంది.. ఆ తర్వాత తహశీల్దార్ల రిపోర్ట్, కలెక్టర్ల అప్రూవల్స్, సీసీఎల్‌ఎ క్లియరెన్స్ వరకు ఎలా సాగుతుందో ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ స్టడీ ద్వారా సభ్యులు పలు లోపాలను గుర్తించారు. వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోనున్నారు. మూడో సమావేశం అనంతరం కమిటీ జాబ్ చార్ట్ సిద్ధం చేసుకోనున్నారు.మేధావులు, నిపుణులు, ప్రజా సంఘాల ప్ర తినిధుల సూచనలు కూడా తీసుకోనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రస్తుతానికి ధరణి పోర్టల్ ప్రక్షాళన వరకు పరిమితమై.. దాన్ని పూర్తిస్థాయిలో భూమాతగా మార్చేందుకు, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన టెక్నాలజీతో తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు.
Updated Date - Jan 18 , 2024 | 04:34 AM