అప్పులు మిగిల్చిన పత్తి
ABN, Publish Date - Jan 29 , 2024 | 11:08 PM
పత్తి రైతులు నిండా మునిగారు. ఈ యేడు కూడా నష్టాల ఊబిలోనే చిక్కుకున్నారు. పూత, కాత సమయాల్లో సరైన వానల్లేక పత్తి చేలు ఎండిపోయాయి. దిగుబడి 20శాతానికి పైగా తగ్గడంతో కనీసం పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రాకుండా పోయాయని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు సరైన ధర కూడా రాలేదని చెబుతున్నారు. పంట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరాకు రూ.31వేల పెట్టుబడి
పంట అమ్మితే రైతుకొచ్చింది రూ.20వేలు
వర్షాభావంతో భారీగా పడిపోయిన దిగుబడి
పత్తి రైతులు నిండా మునిగారు. ఈ యేడు కూడా నష్టాల ఊబిలోనే చిక్కుకున్నారు. పూత, కాత సమయాల్లో సరైన వానల్లేక పత్తి చేలు ఎండిపోయాయి. దిగుబడి 20శాతానికి పైగా తగ్గడంతో కనీసం పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రాకుండా పోయాయని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు సరైన ధర కూడా రాలేదని చెబుతున్నారు. పంట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాచారం, జనవరి 29 : ఈ ఏడాది వానాకాలంలో వర్షాభావంతో అనుకున్న మేర పంట దిగుబడి రాక పత్తి రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. పెట్టుబడి అయినా చేతికందలేదు. ఎకరం విస్తీర్ణంలో రెండు, మూడు క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. సాధారణంగా ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. అయితే, ఇప్పుడు మూడు, నాలుగు క్వింటాలకు మించి రావడం లేదు. నామమాత్రపు దిగుబడితో తాము అప్పుల్లో కూరుకుపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత, కాత సమయాల్లో వానల్లేక ఒక్కో చెట్టుకు మూడు నాలుగు కాయలే వచ్చాయని రైతులు చెబుతున్నారు. అప్పులు తీర్చేందుకు పొలం అమ్ముకునే పరిస్థితి వచ్చిందని మేడిపల్లికి చెందిన రైతులు బీరప్ప, మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో చెట్టుకు 25 నుంచి 35 కాయలు వస్తేనే ఆశించిన దిగుబడి వస్తుందని.. కానీ ఈ సారి పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. దీపావళి నుంచి నెల పాటు నాలుగైదు సార్లు పత్తి ఏరే వారిమని, అలాంటిది ఈ సారి ఒక్కసారి ఏరగానే పత్తిమొక్కలు ఎండిపోయాయని రైతులు వాపోయారు. ప్రధానంగా అక్టోబరు, నవంబరు నెలల్లో ఒక్క వాన కూడా కురవకపోవడంతో మొక్కలకు నీరందక ఎండిపోయాయని, దీంతో దిగుబడి 20శాతానికి పడిపోయిందని రైతులు వివరించారు. ఒక పక్క దిగుబడి లేకపోగా ధర కూడా అనుకున్నంత పెట్టలేదని రైతులన్నారు. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.6,900 మాత్రమే చెల్లించారని చెప్పారు.
లాభం దేవుడెరుగు.. పెట్టుబడైనా రాలేదు!
అన్ని ఖర్చులూ కలుపుకుంటే ఎకరం పత్తి సాగుకు రూ.31వేల వరకు వ్యయమవుతుంది. ఈ సారి వచ్చిన దిగుబడి అమ్మగా రైతులకు 20వేలకు మించి రాలేదు. దీన్నిబట్టి ప్రతీ ఎకరానికి రూ.11వేల మేర రైతులు నష్టపోయారు. అదీ పెట్టుబడే. లాభాన్ని కలుపుకుంటే మరో 30వేలు అదనపు నష్టం! ఎకరంలో 12 నుంచి 15 క్వింటాళ్ల పత్తి వస్తేనే పెట్టుబడి పోను ఎంతోకొంత మిగులుతుందని మహిళా రైతు రాములమ్మ తెలిపారు. ఈ సారి నాలుగైదు క్వింటాళ్ల కంటే ఎక్కువ పండలేదని చెప్పారు. కనీసం ఆరుసార్లు పత్తి ఏరే వారమని, వర్షాలు పడక ఒక్కసారి ఏరగానే మొక్కలు ఎండిపోయాయని పత్తి రైతులు చెప్పారు. క్వింటాల్‌కు రూ.పది నుంచి రూ.15వేల ధర ఉంటే పంట ఖర్చులు పోను రెక్కల కష్టమైనా మిగిలేదని, కానీ వ్యాపారులు క్వింటాలుకు రూ.6,900 కంటే ఎక్కువ పెట్టలేదని మేడిపల్లికి చెందిన రైతు కలకొండ బీరప్ప చెప్పాడు. ఇదిలా ఉంటే భూ యజమానులతో మాట్లాడుకున్న మేరకు వారికి కౌలు చెల్లించామని, తమకు దిగుబడి మాత్రం రాలేదని కౌలు రైతులు వాపోతున్నారు. సొంత భూమి ఉన్న వారికంటే రెట్టింపు అప్పుల్లో తాము కూరుకుపోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్ల బంగారం పంట తమను నట్టేట ముంచిందని, ప్రభుత్వమే ఎకరానికి రూ.పదివేల చొప్పునైనా పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
అప్పులెలా తీర్చాలో తెలియడం లేదు
పత్తి సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. ఎకరానికి రూ.30వేలకు మించి పెట్టుబడి పెట్టాం. క్వింటాల్ పత్తికి రూ.6,900 వచ్చింది. ఈ సారి ఎకరానికి నాలుగు క్వింటాళ్లకు మించి పండలేదు. కనీస ధర రూ.10వేలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతులకు కొంత మేలు జరిగేది. ఈ సారి కరువు వల్లే పత్తి రైతులం నష్టపోయాం. ప్రభుత్వం మాకు కరువు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
- కొంగరి కృష్ణయ్య, రైతు, చౌదరిపల్లి
Updated Date - Jan 29 , 2024 | 11:08 PM