కాంగ్రెస్ చేతికి ఖమ్మం డీసీసీబీ, డీసీఎంఎస్!
ABN, Publish Date - Jan 29 , 2024 | 03:50 AM
రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులు ‘హస్త’గతం కాబోతున్నాయి.
రెండు చైర్మన్ పదవుల ‘హస్త’గతానికి వ్యూహాత్మకంగా తుమ్మల అడుగులు
ఖమ్మం, జనవరి 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులు ‘హస్త’గతం కాబోతున్నాయి. ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌పై ఉన్న అసంతృప్తిని, గత డీసీఎంఎస్ చైర్మన్ కారు రుణం చెల్లించకపోవడతో డిఫాల్టర్‌గా ఉండడాన్ని గమనించి... తుమ్మల మంత్రి పదవి చేపట్టగానే వ్యూహాత్మకంగా సహకార రంగానికి చెందిన ఈ రెండు పదవులను కాంగ్రెస్ పరం చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా వ్యూహం రచించారు. బీఆర్‌ఎస్ నేత రాయల శేషగిరిరావు కారు రుణ బకాయి చెల్లించకుండా డిఫాల్టర్‌గా ఉండడంతో ఆయనపై ఫిర్యాదులు వచ్చి విచారణ జరిగింది. ఆయన తల్లాడ మండలం గంగదేవిపాడు సొసైటీ డైరెక్టర్, చైర్మన్ పదవులతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ పదవి కూడా కోల్పోయారు. ఆయన స్థానంలో డీసీఎంఎస్ వైస్‌చైర్మన్‌గా ఉన్న కొత్వాల శ్రీనివాసరావును నియమించారు. గతంలో బీఆర్‌ఎ్‌సలో ఉన్న కొత్వాల అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రె్‌సలో చేరారు. దీంతో ఇప్పుడు ఆయనకు కాలం కలిసివచ్చింది. నోటిఫికేషన్ ద్వారా పూర్తిస్థాయి చైర్మన్‌గా కూడా ఆయనను ఎన్నుకునే అవకాశం ఉంది. ఇక బీఆర్‌ఎ్‌సలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అనుచరుడిగా ఉన్న డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య విషయంలోనూ వ్యూహాత్మకంగా అవిశ్వాస అస్త్రం ప్రయోగించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం సొసైటీలో కూరాకులపై డైరెక్టర్లలో తీవ్ర వ్యతిరేకత ఉండడం అవిశ్వాసానికి దారి తీసింది. మొత్తం 13 మంది డైరెక్టర్లలో 11 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. అయితే కూరాకుల హైకోర్టుకు వెళ్లడం, కోర్టు ఆదేశాలతో ఓటింగ్ ఫలితాన్ని ఈ నెల 30 వరకు ప్రకటించకుండా ఆపారు. ఓటింగ్ వివరాలను కోర్టుకు నివేదించారు. అవిశ్వాసానికి అనుకూలంగా 11 మంది డైరెక్టర్లు ఓటు వేయడంతో కూరాకుల పదవి కోల్పోయే అవకాశం ఉంది. దీంతో డీసీసీబీ చైర్మన్ పదవి కూడా త్వరలో కాంగ్రెస్ పరం కాబోతోంది. వైస్‌చైర్మన్‌గా ఉన్న దొండపాటి వెంకటేశ్వరరావుకు తాత్కాలికంగా బాధ్యతలు ఇచ్చినా ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి కాంగ్రె్‌సకు చెందిన డైరెక్టర్లలో ఒకర్ని ఎన్నిక చేసే అవకాశం ఉంది.
Updated Date - Jan 29 , 2024 | 07:10 AM