సాగర్ పనులకు సీఆర్‌పీఎఫ్ బ్రేక్
ABN, Publish Date - Jan 27 , 2024 | 05:10 AM
నాగార్జునసాగర్ మరమ్మతు పనులకు సీఆర్‌పీఎఫ్ బ్రేక్ వేసింది.
కేఆర్‌ఎంబీ సమ్మతి లేకుండా అనుమతించబోమని ఆంక్షలు
మరమ్మతులపై ఆంక్షలు ఏమిటని అధికారుల మండిపాటు..
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ మరమ్మతు పనులకు సీఆర్‌పీఎఫ్ బ్రేక్ వేసింది. ఏ పనులు చేయాలన్నా విధిగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) అనుమతి తీసుకోవాల్సిందేనని, అప్పుడే కట్టపై అనుమతిస్తామని సీఆర్‌పీఎఫ్ యంత్రాంగం తెలంగాణ అధికారులకు తేల్చిచెబుతోంది. ప్రస్తుతం సాగర్‌లో ఆపరేషన్ అండ్ మె యింటెనెన్స్‌కు సంబంధించిన పనులు జరగాల్సి ఉం ది. ఇవన్నీ కూడా వర్షాకాలానికి ముందు చేపట్టాల్సినవి. డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారమే ఈ పనులు జరగాలి. అయితే కీలకమైన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులను సీఆర్‌పీఎఫ్ అడ్డుకోవడం.. దానికి కృష్ణా బోర్డు వంతపాడటం విమర్శలకు తావిస్తోంది. గతేడాది నవంబరు 29న సాగర్ డ్యామ్ ఏపీ వైపు ఆ రాష్ట్ర యంత్రాంగం భారీగా పోలీసులతో కలిసి, స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. దీనిపై పలు దఫాలుగా కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర హోంశాఖ తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశమైంది. తాజాగా ఈనెల 17వ తేదీన జరిగిన సమావేశంలో కృష్ణాబోర్డు అనుమతి లేకుండా తెలుగు రాష్ట్రాల అధికారులను సాగర్ కట్టపైకి అనుమతించొద్దని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సీఆర్‌పీఎఫ్ ప్రస్తుతం కఠినంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ తెలంగాణ తాత్కాలిక నిర్వహణలో ఉండగా.. శ్రీశైలం ఏపీ నిర్వహణలో ఉంది. శ్రీశైలం మరమ్మతుల వ్యవహారంలో తెలంగాణ జోక్యం చేసుకోవడం లేదు. అయితే నాగార్జునసాగర్ స్పిల్‌వే ఓగీతోపాటు కుడికాలువ గేట్ల వద్దకు వెళ్లే దారిలో రోడ్డు వేయాల్సి ఉంది. అంతేకాకుండా వర్షాకాలానికి ముందు డ్యామ్‌పై చేపట్టాల్సిన పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా పనులన్నీ చేపట్టడానికి ఇదే కీలక సమయం. వాస్తవానికి నీటి విడుదలతో ముడిపడి ఉన్న పనులనే సీఆర్‌పీఎఫ్ అడ్డుకోవాల్సి ఉండగా.. రొటీన్‌గా జరగాల్సిన పనులను కూడా అడ్డుకుంటే, రానున్న వర్షాకాలంలో పలు సమస్యలు వస్తాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా వరద వస్తే... ఆ వరదల సమయంలో గేట్లు పనిచేయకపోతే, దానివల్ల ఉత్పన్నమయ్యే సమస్యలకు కేంద్రం, బోర్డు మాత్రమే బాధ్యత వహించాలని అధికారులు మండిపడుతున్నారు. అయితే ఆయా పనులు చేపట్టడానికి అనుమతి కోరుతూ లేఖ రాస్తే ఆమోదం తెలుపుతామని కృష్ణా బోర్డు చెబుతుండగా... ప్రాజెక్టును నిబంధనల ప్రకారం అప్పగించకుండా ఏ విధంగా పెత్తనం చేస్తున్నారని తెలంగాణ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Updated Date - Jan 27 , 2024 | 05:10 AM