ధర్మపురి క్షేత్రంలో కార్తీక భక్తుల సందడి
ABN, Publish Date - Nov 25 , 2024 | 01:03 AM
ధర్మపురి క్షేత్రంలో ఆదివారం కార్తీక భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం సందర్భంగా క్షేత్రానికి భారీగా భక్తులు తరలి వచ్చారు.
నదిలో దీపాలు వదిలిన మహిళలు
భక్తి శ్రద్దలతో స్వామి వారికి పూజలు
ధర్మపురి, నవంబరు 24 ( ఆంధ్రజ్యోతి ): ధర్మపురి క్షేత్రంలో ఆదివారం కార్తీక భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం సందర్భంగా క్షేత్రానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. స్థానిక శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి, అనుబంధ శ్రీ రామలింగేశ్వ స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. గోదావరి నదిలో భక్తులు కార్తీక స్నానాలు ఆచరించారు. గోదావరి పౌరోహితులచే సంకల్పాది పూజలు చేయించుకున్నారు. నరసింహుని ఆలయంలో భక్తులు అభిషేకాది పూజలు, కుంకుమార్చన, స్వామి వారల నిత్య కళ్యాణం జరిపించి పూజలు చేశారు. ఆలయం ఆవరణలో గల ఉసిరిక చెట్టు చుట్టు ప్రదక్షిణాలు చేసి, లక్ష వత్తులు వెలిగించి, కార్తీక దామోదరుడిని పూజించారు. గోదావరి పౌరోహితులకు, బ్రాహ్మణులకు, అర్చకులకు దీప దానం చేసుకున్నారు. యమ ధర్మరాజు ఆలయం వద్ద గండ దీపంలో నూనె పోసి భక్తి శ్రద్దలతో పూజలు జరిపారు. అందంగా పూలతో అలంకరించిన స్వామి వారలకు ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, అర్చకులు, నిత్య పూజలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాలు భక్తిగీతాలతో ప్రతి ధ్వనించాయి. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, సిబ్బంది భక్తులకు తగు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, ఉపప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు సీహెచ్ రమణాచార్యా, నంబి నరసింహమూర్తి, అభిషేక్ పౌరోహితులు బొజ్జ సంతోష్‌కుమార్, సంపత్‌కుమార్, రాజగోపాల్, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
=============================================================================
23 రోజు ఘనంగా గోదావరి హారతి
కార్తీక మాసం పురస్కరించుకుని ధర్మపురి వద్ద గోదావరి హారతి 23 వ రోజు ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం ఆరంభం నుండి లోక క్షేమార్థం, విశ్య శాంతి కోసం జరిగే కార్యక్రమంలో భాగంగా ఆలయ వేదపండితులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు, మహిళలు మంగళ వాయిద్యాలు వెంటరాగా గోదావరి నది వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు దేశం సుభిక్షంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ విశేష పూజలు జరిపారు. గంటల తరబడి రాత్రి వరకు నదీ మాతకు హారతి ఇచ్చి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి వేళలో మహిళలు దొప్పలో దీపాలు వెలిగించి గోదావరి నదిలో వదిలి పుణ్యప్రాప్తి పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, వేదపండితులు పాలెపు ప్రవీణ్‌కుమార్‌శర్మ, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, ఆలయ అభిషేక్ పౌరోహితులు బొజ్జ సంతోష్‌కుమార్, సంపత్‌కుమార్, రాజగోపాల్, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 25 , 2024 | 01:03 AM