ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

4న పెద్దపల్లిలో సీఎం సభ

ABN, Publish Date - Nov 25 , 2024 | 01:14 AM

ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా డిసెంబరు 4వ తేదీన పెద్దపల్లిలో యువతతో విజయోత్సవ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

- యువతతో విజయోత్సవ సభ

- గ్రూపు 4 అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత

- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా డిసెంబరు 4వ తేదీన పెద్దపల్లిలో యువతతో విజయోత్సవ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది కాలంలో సాధించిన విజయాల గురించి ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నెల 20న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో విజయోత్సవ సభ నిర్వహించారు. కరీంనగర్‌ పట్టణంలోనూ ఒక సభను నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, అక్కడ కాకుండా పెద్దపల్లిలో యువతతో సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సభ సంద్భంగా గ్రూపు-4లో ఉద్యోగాలు సాధించిన దాదాపు తొమ్మిదివేల మందికి నియాకపత్రాలను అందజేయనున్నారు. సభ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లిలో నిర్వహించిన సభకు రాహుల్‌గాంధితో కలిసి రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి పాల్గొనే విజయోత్సవ సభను నూతన కలెక్టరేట్‌ కార్యాలయానికి ఎదురుగా గల గతంలో కేసీఆర్‌ సభ నిర్వహించిన స్థలంలోనే నిర్వహించాలని మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌, అధికారులు నిర్ణయించారు. ఒకటి, రెండు రోజుల్లో మంత్రి సహ ఎమ్మెల్యేలు, అధికారులు స్థల పరిశీలన చేయనున్నారు. ఈ సభకు 50 వేల మందికి పైగా జనాలను తరలించాలని మంత్రి, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ సభ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సభా ప్రాంగణంలోనే సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మానేరుపై ఓదెల మండలం రూపునారాయణపేట వద్ద నిర్మించనున్న వంతెన నిర్మాణానికి 80 కోట్లు మంజూరైన విషయం తెలిసిందే. ఈ వంతెన పనులకు, న్యూఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లకు, రాఘవాపూర్‌ వద్ద 81 కోట్ల రూపాయలతో నిర్మించనున్న జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణానికి, తదితర పనులకు శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పెద్దపల్లిలో ఆర్టీసీ బస్‌ డిపోకు బస్టాండ్‌ వద్ద స్థలం కేటాయించారు. ఈ స్థలం తీసుకునేందుకు ఆర్టీసీ అధికారులు ఇంకా ముందుకు రాలేదు. సభకు ముందు ఆ ప్రక్రియ పూర్తి చేయించి డిపో మంజూరు చేయించి పనులకు సీఎంతో శంకుస్థాపన చేయించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు భావిస్తున్నారు. పెద్దపల్లి బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి ఇంకా నిధులు మంజూరు కాలేదు. దీనికి సంబంధించిన ఫైల్‌ సీఎంవోలో ఉంది. నిధులు మంజూరు చేయించేందుకు ఎమ్మెల్యే సీఎంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. సభకు ముందే నిధులు మంజూరైతే మాత్రం సీఎం రేవంత్‌రెడ్డితో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయించే అవకాశాలున్నాయి. ఇవేగాకుండా మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కూడా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ సభ ద్వారా రాష్ట్రంలో గల యువతకు సీఎం దిశానిర్ధేశం చేయనున్నారు. అలాగే సీఎం రాకతో జిల్లాకు వరాల జల్లు కురిసే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Nov 25 , 2024 | 01:14 AM