మెట్రో ఫేజ్-2లో మార్పులు
ABN, Publish Date - Jan 03 , 2024 | 03:20 AM
హైదరాబాద్ మహానగర రవాణాలో అత్యంత కీలకమైన మెట్రో ప్రాజెక్టుల విస్తరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత వచ్చింది.
ఇన్నర్ రింగ్ రోడ్డుపై రాజేంద్రనగర్ వరకు మెట్రో
కొత్తగా ఏర్పాటయ్యే హైకోర్టుకు రవాణా సౌకర్యం
నాగోలు-ఎల్బీనగర్-చాంద్రాయణగుట్ట మీదుగా ప్లాన్
అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ సూచన
మియాపూర్ స్టేషన్-పటాన్‌చెరు, రాయదుర్గం-
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎల్బీనగర్-హయత్‌నగర్ వరకు
ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
ఎంజీబీఎస్- ఎయిర్‌పోర్టుకు మరో మార్గం
చాంద్రాయణగుట్ట -ఎయిర్‌పోర్టు లింక్‌కు మైలార్‌దేవ్‌పల్లి పీ7 రోడ్డును పరిశీలించాలి
మరో మూడు పొడిగింపులకూ అనుమతి
రాయదుర్గం - ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు
ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు
76 కిలోమీటర్ల మేర కొత్తగా మెట్రో
అధికారులతో సమీక్షలో సీఎం నిర్ణయాలు
హైదరాబాద్ సిటీ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహానగర రవాణాలో అత్యంత కీలకమైన మెట్రో ప్రాజెక్టుల విస్తరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత వచ్చింది. అత్యంత వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో రెండో దశకు పలు మార్పులు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఓఆర్‌ఆర్ మీదుగా ఎయిర్‌పోర్టు మెట్రోకు బదులుగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు మెట్రోను ఖరారు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డుపై నాగోలు నుంచి ఎల్బీనగర్ వరకు గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రోను ఏకంగా చాంద్రాయణగుట్ట, ఆరాంగఢ్ మీదుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వరకు పొడిగించారు. హైదరాబాద్ తూర్పు ప్రాంత ప్రజలు చాంద్రాయణగుట్ట జంక్షన్ వద్ద రైలుమారి విమానాశ్రయానికి వెళ్లిపోవచ్చు. వీటికి తోడు గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మియాపూర్-పటాన్‌చెరు, ఎల్‌బీ నగర్- హయత్‌నగర్ పొడిగింపులను చేపట్టడానికి రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హెచ్‌ఎండీఏ కమిషనర్ దాన కిశోర్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, సీఎంఓ కార్యదర్శి షానవాజ్ ఖాసీం, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. నగరంలో ఇప్పటికే 69 కిలోమీటర్ల పొడవున మెట్రో ఉండగా, కొత్తగా రెండో దశలో ప్రతిపాదించినవి 76 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. కాగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండో దశలో 67.5 కి.మీ ప్రతిపాదించింది.
రాయదుర్గం-శంషాబాద్ కారిడార్‌కు బ్రేక్!
మెట్రో రెండో దశలో భాగంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాయదుర్గం రహేజా మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,250 కోట్ల అంచనాతో 31 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ మార్గంతో పెద్దగా ప్రయోజనం ఉండదని, ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ గత నెల 13న జరిగిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి సమీక్ష నిర్వహించారు. రాయదుర్గం-శంషాబాద్ కారిడార్‌ను పూర్తిగా రద్దు చేసి, పాతబస్తీ నుంచే ఎయిర్‌పోర్టు మెట్రోను వేసేందుకు నిర్ణయించారు.
ప్రభుత్వ భూములను గుర్తించాలి
ఇటు ఎంజీబీఎస్ నుంచి అటు ఎల్బీనగర్ నుంచి పాతబస్తీ మీదుగా సవరించిన మార్గాల అలైన్‌మెంట్ కోసం ట్రాఫిక్ అధ్యయనాలు, డీపీఆర్‌లను త్వరగా పూర్తి చేయాలని రేవంత్ హైదరాబాద్ మెట్రో ఎండీని ఆదేశించారు. చాంద్రాయణగుట్ట దగ్గర జంక్షన్ ఖరారు అయినప్పటికీ ఎయిర్‌పోర్టు కోసం మైలార్‌దేవ్‌పల్లి వద్ద వేసిన విశాలమైన పీ7 రోడ్డు మధ్యలో ఏకంగా 40 అడుగుల మీడియన్ ఉందని, దాన్ని ఆధారంగా చేసుకొని లక్ష్మీగూడ-జల్‌పల్లి-మామిడిపల్లి మీదుగా తక్కువ ఖర్చుతో నేల మీదనే వెళ్లే విధంగా మెట్రో వేసే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. దాంతో దాన్ని కూడా పరిశీలనలో చేర్చారు. అంతేకాకుండా ఈ రవాణా మార్గంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఇలా చేయడం ద్వారా ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు ఖర్చు తగ్గడంతో పాటు పాతబస్తీ, దాని పరిసరాలను అభివృద్ధి చేయవచ్చని సూచించారు. కొత్త అలైన్‌మెంట్‌తో నగరంలోని పలు ప్రాంతాలకు తేలిగ్గా ఎయిర్‌పోర్టు ప్రయాణం సాధ్యమవుతుందని, దూరం, ఖర్చు తగ్గుతుందని చెప్పారు.
పాతబస్తీలో ప్రతికూల ప్రభావం పడొద్దు
ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఎల్ అండ్ టీ నిర్మించాల్సి ఉన్న 5.5 కిలోమీటర్లను పూర్తి చేసేందుకు తీసుకునే చర్యల్లో అక్కడ ప్రజల్లో ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తగా ఉండాలని రేవంత్ అధికారులకు స్పష్టం చేశారు. దారుల్‌షిఫా నుంచి ఫలక్‌నుమా జంక్షన్ వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. ఎంజీబీఎస్ స్టేషన్ దాటిన తర్వాత సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషేర్‌గంజ్, జంగంమెట్, ఫలక్‌నుమా స్టేషన్లు రానున్నాయి. ఈ 5.5 కిలోమీటర్ల స్ట్రెచ్‌లో 21 మసీదులు, 12 హిందూ దేవాలయాలు, 12 అషూర్‌ఖానాలు, 33 దర్గాలు, 7 సమాధి యార్డులు, 6 చిల్లాలతోపాటు చిన్నాచితక అంతా కలిసి మొత్తంగా దాదాపు 103 మతపరమైన, సున్నితమైన నిర్మాణాలు అడ్డుగా ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి
వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర అవసరాలను తీర్చేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓఆర్‌ఆర్ చుట్టూ ఇప్పటిదాకా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను గ్రోత్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. శ్రీశైలం హైవేపై ఎయిర్‌పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రో రైలు కనెక్టివిటీని కూడా ప్లాన్ చేయాలన్నారు. ఇక్కడ ఫార్మాసిటీ కోసం భూములను సేకరించడం జరిగిందని, తద్వారా ఇక్కడ మెట్రో కనెక్టివిటీ అవసరమని చెప్పారు. జేబీఎస్ మెట్రోస్టేషన్ నుంచి శామీర్‌పేట్ వరకు, కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రో రైలు మూడో దశ విస్తరణ జరగాలని ఆయన ఆక్షాంకించారు. వీటికి సంబంధించి ప్రణాళికలను త్వరగా సిద్ధం చేసి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరికి సమర్పించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో ఎండీలను ఆదేశించారు.
Updated Date - Jan 03 , 2024 | 03:20 AM