కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతుల్లేవ్!
ABN, Publish Date - Apr 02 , 2024 | 04:23 AM
రాష్ట్రంలో ఈ ఏడాది కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు కావడం లేదు. జాతీయ వైద్య కమిషన్ కొత్త కళాశాలలకు అనుమతులను నిలిపివేసింది. నూతన వైద్య కళాశాలల్లో తరగతులు
ఎల్‌వోపీ నిలిపివేసిన ఎన్‌ఎంసీ
ఈసారి తనిఖీలుకూడా చేయని వైనం
కర్ణాటక వేసిన కేసు కారణంగానే..
రాష్ట్రంలో 8 కాలేజీల పరిస్థితి ఏంటో?
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు కావడం లేదు. జాతీయ వైద్య కమిషన్ కొత్త కళాశాలలకు అనుమతులను నిలిపివేసింది. నూతన వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభించుకునేందుకు అవసరమైన లెటర్ ఆఫ్ పర్మిషన్(ఎల్‌వోపీ) కూడా ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల తరఫున కాలేజీల కోసం ఎన్‌ఎంసీకి 142 దరఖాస్తులు అందాయి. తెలంగాణ నుంచి 8 కళాశాలల ఏర్పాటు కోసం గత సర్కారు దరఖాస్తు చేసింది. వాస్తవానికి ఇప్పటికే కొత్త కాలేజీల్లో ఎన్‌ఎంసీ తనిఖీలు పూర్తి చేయాల్సి ఉంది.ఇంతవరకు తనిఖీలకే రాలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్క మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కూడా అనుమతి లభించలేదు. నూతన వైద్య కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ గత ఆగస్టులో ఎన్‌ఎంసీ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త (2023) డాక్యుమెంట్ ప్రకారమే నూతన వైద్య కళాశాలలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. దీని ప్రకారం కొత్తగా కాలేజీ ఏర్పాటు చేయాలంటే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యకు అనుగుణంగా నాలుగున్నరేళ్లకు సరిపడా మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచుకోవాలి. ఉదాహరణకు 50 ఎంబీబీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే కాలేజీలో రోజువారీ ఓపీ 400, మేజర్ ఓటీ 4, అధ్యాపకులు 59 మంది ఉండాలి. వీరికి అదనంగా ట్యూటర్స్ 15 మంది, సీనియర్ రెసిడెంట్స్ 23 మంది ఉండాలి. అలాగే కచ్చితంగా 21 విభాగాలతో పాటు అనుబంధ బోధనాస్పత్రిలో 320 పడకలుండాలి. నాలుగున్నరేళ్లకు సరిపడా అధ్యాపకులు, భవనాలు, ఇతర సౌకర్యాలన్నీ ముందే ఏర్పాటు చేసుకోవాలని డాక్యుమెంట్‌లో స్పష్టం చేసింది. ఇప్పటిదాకా 2020 డాక్యుమెంట్ ప్రకారం కొత్తగా కాలేజీ ఏర్పాటు చేయాలనుకుంటే ఆ ఏడాదికి సరిపడా మౌలిక సదుపాయాలను కల్పించుకుంటే సరిపోయేది. ఎంబీబీఎస్ కోర్సు నాలుగున్నరేళ్లు పూర్తయ్యేనాటికి భవనాలు, ఇతర సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంచుకోవాలని ఉండేది. దాన్ని పక్కనపెట్టి 2023 డాక్యుమెంట్ ప్రకారమే కొత్త కాలేజీలను మంజూరు చేస్తామని ఎన్‌ఎంసీ చెప్పడంతో పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్‌ఎంసీ కొత్త మెడికల్ కాలేజీల కోసం గత ఆగస్టులో దరఖాస్తులు స్వీకరించి, వాటి పరిశీలన కూడా పూర్తి చేసింది. అయితే ఎన్‌ఎంసీ తీసుకొచ్చిన ఎంఎ్‌సఆర్-2023 డాక్యుమెంట్‌పై కర్ణాటక ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఒకేసారి నాలుగున్నరేళ్లకు సరిపడా అధ్యాపకులు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనను సవాల్ చేసింది. పాత డాక్యుమెంట్ ప్రకారమే అనుమతులు ఇవ్వాలని కోరింది. దీంతో ఎన్‌ఎంసీ డాక్యుమెంట్‌పై కోర్టు స్టే విధించింది.
మన కాలేజీల పరిస్థితి ఏంటో..
గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు కోసం గత ప్రభుత్వం 2023 ఆగస్టులో దరఖాస్తు చేసింది. తొలుత వీటిని 100 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున ఏర్పాటు చేయాలనుకున్నా.. చివరి నిమిషంలో 50 సీట్ల కోసం దరఖాస్తు చేశారు. ప్రస్తుతం ఈ కాలేజీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
Updated Date - Apr 02 , 2024 | 04:23 AM