వంతెన నిర్మాణానికి బ్రేక్
ABN, Publish Date - Mar 23 , 2024 | 10:13 PM
మంచిర్యాల-పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన అంతర్జిల్లా వంతెనకు బ్రేకులు పడ్డాయి. ప్రతిపాదిత స్థలం వంతెన నిర్మాణానికి ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదని, బ్రిడ్జిని రద్దు చేస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రకటించారు. దీంతో అర్థాంతరంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోనున్నాయి.
మంచిర్యాల, మార్చి 23 (ఆంద్రజ్యోతి): మంచిర్యాల-పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన అంతర్జిల్లా వంతెనకు బ్రేకులు పడ్డాయి. ప్రతిపాదిత స్థలం వంతెన నిర్మాణానికి ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదని, బ్రిడ్జిని రద్దు చేస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రకటించారు. దీంతో అర్థాంతరంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోనున్నాయి.
దూరం తగ్గనుండటంతో....
మంచిర్యాల-అంతర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మిస్తే ప్రయాణికులకు దూరం తగ్గి, సమయం కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదించారు. మంచిర్యాల వద్ద వంతెన నిర్మాణం చేపడితే రెండు జిల్లాల మధ్య కనీసం 40 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం కరీంనగర్, హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే గోదావరిఖని మీదుగా వెళ్లాల్సి ఉం టుంది. మంచిర్యాల-శ్రీరాంపూర్-గోదావరిఖని వరకు వెళ్లేందుకు ట్రాఫిక్ కారణంగా అధిక సమయం వెచ్చించాల్సి వస్తోంది. వంతెన నిర్మాణం జరిగితే మంచిర్యాల నుంచి గోదావరి మీదుగా నేరుగా బసంత్‌నగర్ కరీంనగర్, హైదరాబాద్‌లకు చేరుకునే వెసలుబాటు ఉంది.
రూ.164 కోట్లతో పరిపాలన అనుమతులు
గోదావరిపై వంతెన నిర్మాణానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.164 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూర య్యాయి. గోదావరిపై వంతెన నిర్మాణం చేపట్టాలనే మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు విజ్ఞప్తి మేరకు 2018లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం శ్రీరాంపూర్ బహిరంగ సభకు హాజరైన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో వంతెన నిర్మాణానికి మోక్షం కలుగగా, మొదట రూ.125 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. అనంతరం అంచనా వ్యయాన్ని రూ. 164 కోట్లకు పెంచారు. ఆర్‌ఆండ్‌బీ అధికారులు సర్వే జరిపి, సాయిల్ టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. పనులు టెండరింగ్ దశలో ఉండగా అర్థాంతరంగా నిలిచిపోయాయి.
స్థలం ఆమోదయోగ్యం కాదని...
మంచిర్యాల వద్ద గోదావరి వంతెన నిర్మించతలపెట్టిన స్థలం ఆమోదయోగ్యం కాదనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు బ్రిడ్జిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొంత ఆలస్యమైనా... రెండు జిల్లాల నడుమ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతిపాదిత స్థలంలో వంతెన నిర్మిస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు. కాలేజ్‌రోడ్డు ఆధారంగా వంతెన నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేశారని, ఆ రోడ్డు వెడల్పు 75 అడుగులు మించ దని, వంతెన నిర్మాణం పూర్తయితే ఇరుకు రోడ్డు కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, పైగా హై లెవల్ వంతెన కావడంతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు రోడ్డు ఎత్తు పెంచాల్సిన అవసరం ఏర్పడుతుందని పేర్కొ న్నారు. అందుకే ప్రతిపాదిత స్థలంలో వంతెన నిర్మాణం వద్దంటున్నానని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన స్థలంలో కాకుండా హాజీపూర్ మండలం ముల్కల్ల-వేంపల్లి గ్రామాల మధ్య నిర్మించే యోచనలో ఉన్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వంతెన నిర్మాణం చేపట్టాలి...
రెండు జిల్లాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు గోదావరిపై హై లెవల్ వంతెన నిర్మాణం అనివార్యమని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే, ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టి, త్వరగా వంతెన నిర్మాణం జరిగేటట్లు చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Mar 23 , 2024 | 10:13 PM