ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: 37,870 కోట్లు.. రాష్ట్రానికి పెట్టుబడుల వరద

ABN, Publish Date - Jan 18 , 2024 | 04:40 AM

కొత్త పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అదరగొడుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌) జరుగుతున్న స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం భారీ పెట్టుబడులు సాధిస్తోంది.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీల సంసిద్ధత

దావోస్‌లో ఒకేరోజు రికార్డు స్థాయి ఒప్పందాలు

అదానీ గ్రూప్‌ పెట్టుబడి రూ.12,400 కోట్లు

9వేల కోట్లతో జిందాల్‌ పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు

రూ.8వేల కోట్లతో ‘గోదీ’ లిథియం గిగా ఫ్యాక్టరీ

రూ.5200 కోట్లతో వెబ్‌వెర్క్స్‌ డేటా సెంటర్‌

రూ.2 వేల కోట్లతో ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ విస్తరణ

రూ.వెయ్యి కోట్లతో గోద్రెజ్‌ కెమికల్‌ ప్లాంట్‌

270కోట్లతో ఖమ్మంలో పామాయిల్‌ సీడ్‌ గార్డెన్‌

హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కొత్త పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అదరగొడుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌) జరుగుతున్న స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం భారీ పెట్టుబడులు సాధిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. బుధవారం ఒకేరోజు రికార్డు స్థాయిలో రూ.37,870 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో ఒక్క అదానీ గ్రూప్‌ వాటానే రూ.12,400 కోట్లుగా ఉంది. విద్యుత్తు, డేటా సెంటర్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, సిమెంట్‌ తయారీ పరిశ్రమ రంగాల్లో అదానీ గ్రూప్‌ ఈ పెట్టుబడులు పెట్టనుంది. దీనికి సంబంధించి బుధవారం అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే జల విద్యుత్తు రంగంలో జిందాల్‌ (జేఎ్‌సడబ్ల్యూ) సంస్థ 9 వేల కోట్లతో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించగా, రూ.8 వేల కోట్లతో గోదీ ఇండియా సంస్థ లిథియం గిగా ఫ్యాక్టరీ, రూ.5200 కోట్లతో వెబ్‌వెర్క్స్‌ డేటా సెంటర్‌ నిర్మించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజాగా ఒప్పందం కుదుర్చుకున్న మొత్తం పెట్టుబడులతో రాష్ట్రంలో 30 వేల మందికి పైగా యువతకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

అదానీ గ్రూప్‌ భారీ పెట్టుబడులు..

తెలంగాణలో భారీ పెట్టుబడులకు అదానీ గ్రూప్‌ ముందుకొచ్చింది. దావో్‌సలోని ప్రపంచ ఆర్థిక సదస్సులో మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ సీఈవో ఆశిష్‌ రాజ్‌వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. దీనికి రూ.5 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇక చందనవెల్లిలో అదానీ కొనెక్స్‌ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు రూ.5వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. కాగా, అంబుజా సిమెంట్స్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలో రూ.1400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 6 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది.

అదానీ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పార్క్‌లో కౌంటర్‌ డ్రోన్‌ సిస్టమ్స్‌, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలకు అదానీ గ్రూప్‌ రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అదానీ గ్రూప్‌ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి.. గౌతమ్‌ అదానీకి హామీ ఇచ్చారు. కాగా, తెలంగాణలో పెట్టుబడిదారులకు కొత్త ప్రభుత్వం స్నేహపూర్వక వాతావరణం కల్పించిందని గౌతమ్‌ అదానీ అన్నారు. కొత్త పారిశ్రామిక విధానం మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ఉందని, తమకు అందించిన ప్రోత్సాహంతో తెలంగాణలో వేగంగా వృద్ధి చెందుతామని చెప్పారు. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపైనా గౌతమ్‌ అదానీతో సీఎం చర్చించారు. తెలంగాణలో తమ పెట్టుబడులతోపాటు స్కిల్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు అదానీ తన సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే ఇంటిగ్రేటెడ్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ స్కిల్లింగ్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అదానీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

8 వేల కోట్లతో బ్యాటరీ సెల్‌ తయారీ కేంద్రం

గోదీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తెలంగాణలో గిగాస్కేల్‌ బ్యాటరీ సెల్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఇందుకు సంబంధించి రూ.8 వేల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్‌లో గంటకు 12.5 గిగావాట్ల సామర్థ్యముండే బ్యాటరీ సెల్‌ తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గోదీ ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్‌ గోదీ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశలో 6వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ముందుగా 2.5గిగావాట్ల కెపాసిటీ సెల్‌ అసెంబ్లింగ్‌ లైన్‌ తయారు చేసి, రెండో దశలో 10గిగావాట్లకు విస్తరిస్తారు.

తెలంగాణలో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు..

జేఎ్‌సడబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎ్‌సడబ్ల్యూ నియో ఎనర్జీ.. తెలంగాణలో రూ.9 వేల కోట్ల పెట్టుబడితో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, నియో ఎనర్జీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దావో్‌సలో జేఎ్‌సడబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమై చర్చలు జరిపారు. ఈ కొత్త ప్రాజెక్టు 1,500 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని, భవిష్యత్తు ప్రాజెక్టులపై జిందాల్‌ గ్రూప్‌నకు సహకరించడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సజ్జన్‌ జిందాల్‌తో చెప్పారు. ప్రభుత్వం అందించిన సహకారానికి జిందాల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మంలో అతిపెద్ద ఆయిల్‌పామ్‌ సీడ్‌ గార్డెన్‌..

గోద్రెజ్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాదిర్‌ గోద్రెజ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. చర్చల సందర్భంగా వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా తెలంగాణలో గోద్రెజ్‌ గ్రూప్‌ అడుగుజాడలను బలోపేతం చేసేందుకు నాదిర్‌ గోద్రెజ్‌ ఆసక్తి వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో మొదటి దశలో రూ.270 కోట్లతో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. గోద్రెజ్‌ గ్రూప్‌ ఇటీవలే మలేసియా ఆయిల్‌ పామ్‌ దిగ్గజం సిమ్‌ డార్బీతో జాయింట్‌ వెంచర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా గోద్రెజ్‌.. భారతదేశంలోని మొట్టమొదటి వాణిజ్య ఆయిల్‌ పామ్‌ సీడ్‌ గార్డెన్‌ను ఖమ్మంలో ఏర్పాటు చేయనుంది. ఏటా 7మిలియన్‌ పామాయిల్‌ మొక్కలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మిలియన్‌ ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్‌ ప్లాంటేషన్‌కు మద్దతు ఇస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే 1000 కోట్ల కెమికల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని గోద్రెజ్‌ చైర్మన్‌ ప్రకటించారు.

ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఒప్పందం..

ఆసియాలో డ్రగ్‌ డిస్కవరీ, డెవల్‌పమెంట్‌ సేవలకు కేంద్రంగా హైదరాబాద్‌ స్థానాన్ని సుస్థిరం చేస్తూ ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ రూ.2 వేల కోట్ల కొత్త పెట్టుబడితో విస్తరణ చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్‌ మన్ని కంటిపూడి.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశమైన తర్వాత ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోని మల్లాపూర్‌లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి విస్తరణ చేస్తామని కంపెనీ తెలిపింది. కాగా, ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం టాటా సన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, విప్రో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక అనుకూల విధానాలను వివరించారు. సీఎం విజ్ఞప్తిపై వారు సానుకూలంగా స్పందించారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. త్వరలో పెట్టుబడుల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 07:09 AM

Advertising
Advertising