ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

33 అడుగుల రోడ్డు.. 35 వేల అద్దె!

ABN, Publish Date - Mar 18 , 2024 | 05:17 AM

ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన రక్షకభటులే బరితెగిస్తే.. కబ్జాలకు పాల్పడితే.. జనం ఎవరితో చెప్పుకోవాలి? సివిల్‌ వివాదాల్లో తలదూర్చబోమని..

రోడ్డును కలిపేసి షెడ్‌ వేసేశారు.. దర్జాగా కబ్జా చేసి, లీజుకిచ్చిన మాజీ డీఎస్పీ

సైబరాబాద్‌ కమిషనరేట్‌ ఎదురుగా డైమండ్‌ హిల్స్‌ లేఅవుట్‌లో ఆక్రమణ

కోర్టు వివాదాల్లో ఉండడంతో ఖాళీగా ప్లాట్లు

ఎకరం పార్కు భూమిపై కన్నేసిన మాజీ డీజీపీ!

ప్రధాన రోడ్డుకు ఆనుకొని అక్రమంగా 18 కమర్షియల్‌ భవనాల నిర్మాణం

ఐఏఎస్‌ అధికారి ఆదేశాలనూ పట్టించుకోని జీహెచ్‌ఎంసీ ప్లానింగ్‌ అధికారులు

మరో ధారావిగా మారుతున్న డైమండ్‌ హిల్స్‌!!

(ఆంధ్రజ్యోతి నిఘా విభాగం): ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన రక్షకభటులే బరితెగిస్తే.. కబ్జాలకు పాల్పడితే.. జనం ఎవరితో చెప్పుకోవాలి? సివిల్‌ వివాదాల్లో తలదూర్చబోమని.. తమది ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అని రాష్ట్ర పోలీసు శాఖ చెబుతుండగా.. కొందరు పోలీసులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు! ‘సాంప్రదాయనీ.. సుప్పినీ.. సుద్దపూసనీ..’ అనే పేరడీ పాట తరహాలో ప్రవర్తిస్తున్నారు. మాజీలుగా మారగానే ముసుగు తొలగిస్తున్నారు! వారికున్న పరిచయాలను, పలుకుబడిని ఉపయోగించుకొని దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు!! స్వాహా చేసిన భూములను లీజుకిస్తూ పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ ఎదురుగా ఖరీదైన భూములున్న కాలనీలో ఓ మాజీ డీఎస్పీ 33 అడుగుల రోడ్డునే మాయం చేయగా.. తానేమీ తక్కువ కాదంటూ ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేసిన వ్యక్తి ఏకంగా కాలనీ పార్కు స్థలాన్నే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 38 ఏళ్లుగా వివాదంలో ఉన్న లేఅవుట్‌లో స్థలాలకు అనుమతులిచ్చే హక్కు ఏ ప్రభుత్వ విభాగానికీ లేకపోవడంతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న మాజీ పోలీసు అధికారులు ఇష్టానుసారంగా కబ్జాలకు తెరలేపారు.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని గచ్చిబౌలి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 50, 51, 52, 53/పీల్లో 59 ఎకరాల 24 గుంటల భూమి ఉండగా 1986లోనే అప్పటి పంచాయతీ అనుమతులతో లేఅవుట్‌ చేశారు. ఇందులో 534 వరకు ప్లాట్లు ఉండగా లేఅవుట్‌లో రోడ్లన్నీ కనీసం 30 నుంచి 50 అడుగుల మేర ఉండేవిధంగా ప్లాన్‌ చేశారు. హైదరాబాద్‌-ముంబై పాత రోడ్డులో సైబరాబాద్‌ కమిషనరేట్‌ ఎదురుగానే ఈ లేఅవుట్‌ ఉంటుంది. మధ్యతరగతి ప్రజలు కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్ముతో 38 ఏళ్ల క్రితమే ప్లాట్లు కొనుక్కున్నారు. ఇంతలోనే కొందరు గచ్చిబౌలి గ్రామస్థులు ఆ భూమిపై తమకు హక్కులు ఉన్నాయంటూ కోర్టును ఆశ్రయించారు. లేఅవుట్‌లోని ప్లాట్ల యజమానులంతా ‘డైమండ్‌ హిల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’ను ఏర్పాటు చేసుకున్నారు. 2001లో హుడా అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే భూ వివాదం ఉండడంతో లేఅవుట్‌కు అనుమతులు రాలేదు. అయితే లేఅవుట్‌లోని సర్వేనంబరు 50లో ఉన్న 17 ఎకరాల స్థలంపై కోర్టు వివాదం ముగిసిపోయింది. అందులోని ప్లాట్ల యజమానులు జీహెచ్‌ఎంసీ అనుమతులతో భారీ భవనాలు నిర్మించుకున్నారు. ప్రత్యేకంగా జనార్దన్‌ కాలనీగా ఏర్పడడంతో తాగునీరు, విద్యుత్తు.. ఇలా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. మిగతా సర్వే నంబర్లలోని 36 ఎకరాల వివాదం కోర్టులో కొనసాగుతూనే ఉంది. ఆ భూమిలో 350 వరకు ప్లాట్లు ఉన్నాయి.

రోడ్డు మాయం చేసిన మాజీ డీఎస్పీ

పదేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కూడా ప్లాట్లను కొనుగోలు చేసినవారికే హక్కు కల్పించగా, గచ్చిబౌలి గ్రామస్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో డైమండ్‌ హిల్స్‌ కాలనీలో 38 ఏళ్ల నాటి పంచాయతీ అనుమతుల లేఅవుట్‌ ప్రకారమే ప్లాట్లున్నాయి. అప్పట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు హద్దులు పెట్టుకొని, ప్రహరీలు నిర్మించుకొని ఉన్నారు. ఆయా ప్లాట్లలో నిర్మాణాల కోసం జీహెచ్‌ఎంసీకి వెళితే అనుమతులు నిలిపివేశారు. ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని 38 ఏళ్లుగా ప్లాట్ల యజమానులు ఎదురుచూస్తుండగా, కొందరు మాత్రం గజం రూ.3 లక్షలు పలికే ఈ ప్రాంతంలో రూ.20-30 వేలకే అమ్మేసుకున్నారు. ప్రధానంగా సైబరాబాద్‌ కమిషనరేట్‌కు ఎదురుగా పాతముంబై రోడ్డును ఆనుకొని ఉన్న ప్లాట్ల యజమానులు విక్రయించారు. మరికొందరు లీజుకు ఇచ్చారు. డైమండ్‌ హిల్స్‌లో పాతముంబై రోడ్డును ఆనుకొని ఉన్న 270ఏ ప్లాట్‌ విస్తీర్ణం 400 గజాలు, దాని వెనక భాగంలోని 270 ప్లాట్‌ విస్తీర్ణం 463 గజాలు. ఈ రెండు ప్లాట్లను ఆనుకొని పడమర వైపు 33 అడుగుల రోడ్డు ఉంది. అయితే డీఎస్పీ హోదాలో ఉన్నప్పుడు ఆ రెండు ప్లాట్లను కొనుగోలు చేసిన పోలీసు అధికారి.. ఆ తర్వాత ఏసీబీకి కూడా చిక్కారు. తన రెండు ప్లాట్లతో పాటు పడమర వైపునున్న 33 అడుగుల రోడ్డును సైతం ఓ గ్రానైట్‌, మార్బుల్‌ షాప్‌ కోసం లీజుకు ఇచ్చారు. 170 అడుగుల పొడవు, 33 అడుగుల వెడల్పు ఉండే రోడ్డులోనే షెడ్లు వేసేసి వ్యాపారం చేస్తున్నారు. అక్కడ రోడ్డుపై కూడా షెడ్డు వేసేసి మాజీ డీఎస్పీ.. నెలకు రూ.35 వేలు అద్దె తీసుకోవడం విశేషం.

పార్కుపై కన్నేసిన మాజీ డీజీపీ!

డైమండ్‌ హిల్స్‌ కాలనీలో పార్కు కోసం సుమారు 4 వేల చదరపు గజాల స్థలాన్ని వదిలారు. పార్కుగా అభివృద్ధి చేయకపోవడంతో గుట్టలు, కొండలతో నిండిపోయింది. చుట్టుపక్కల వ్యర్థాలన్నీ అందులోనే డంప్‌ చేస్తున్నారు. అయితే ఈ పార్కు స్థలంపై ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేసిన వ్యక్తి కన్నేశారు. పలుమార్లు కబ్జా చేసేందుకు యత్నించగా ప్లాట్ల యజమానులు అడ్డుకున్నారు. ఇప్పటికే ఆ పార్కు స్థలంపై మాజీ డీజీపీ డాక్యుమెంట్లు కూడా సంపాదించినట్లు సమాచారం. దీంతో ఏ క్షణంలో ఆ పార్కు స్థలాన్ని మాయం చేస్తారోనని డైమండ్‌ హిల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేన్‌ ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.

అక్రమంగా కమర్షియల్‌ భవనాల నిర్మాణం..

డైమండ్‌ హిల్స్‌ కోర్టు వివాదంలో ఉన్న లేఅవుట్‌ కావడంతో జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులూ లేవు. కానీ, పాత ముంబై రోడ్డుకు ఆనుకొని భారీ కమర్షియల్‌ భవనాలు ఏర్పాటు చేశారు. ఇంకా నిర్మాణాలు చేస్తూనే ఉన్నారు. అయినా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధాన రోడ్డు వెంటే 18వరకు కమర్షియల్‌ నిర్మాణాలు అక్రమంగా వెలిశాయి. అందులో కార్ల షోరూమ్‌లు, గ్రానైట్‌ షాప్‌లు, కార్‌ లాంజ్‌లు, ఓ మూడు రెస్టారెంట్లు, ఓ బార్‌.. ఇలా పెద్దపెద్ద వ్యాపారాలు సాగుతున్నాయి. ఎవరైనా ప్లాట్‌ యజమాని తన ప్లాట్‌కు ప్రహరీలు ఏర్పాటు చేసుకుంటే వెంటనే జీహెచ్‌ఎంసీ ప్లానింగ్‌ విభాగం అధికారులు వచ్చి, కూల్చేస్తున్నారు. భారీగా షోరూమ్‌లు, షెడ్‌లు ఏర్పాటు చేస్తున్నా పట్టించుకోని అధికారులు.. తమ ప్రహరీలను మా త్రం కూల్చేయడమేంటని ప్లాట్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు.

ఐఏఎస్‌ అధికారి ఆదేశాలనూ పట్టించుకోని అధికారులు..!

డైమండ్‌ హిల్స్‌లో అక్రమంగా సాగుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఇటీవల శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన కమిషనర్‌ స్నేహ శబరీష్‌ మరుసటి రోజే డైమండ్‌ హిల్స్‌ను సందర్శించారు. కబ్జాలు తొలగించి, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ ప్లానింగ్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. కానీ, అధికారులు మాత్రం ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. అసోసియేషన్‌ ప్రతినిధులు వెళ్లి అడిగితే.. ‘ఏ భవనాన్ని కూల్చాలో చెబితే.. కూల్చుతాం’ అని సమాధాం ఇస్తున్నారు. లేఅవుట్‌లోని నిర్మాణాలన్నీ అక్రమమేనని చెబితే.. తమకు సంబంధం లేదంటున్నారని ప్రతినిధులు వాపోతున్నారు.

మరో ధారావి..?

డైమండ్‌ హిల్స్‌ లేఅవుట్‌ కోర్టు వివాదంలో ఉండడంతో మౌలిక సదుపాయాలు లేవు. చాలా ప్లాట్లు ఖాళీగా ఉండడంతో ఇతర రాష్ట్రాల కార్మికులు షెడ్‌లు వేసుకొని నివసిస్తున్నారు. ప్లాట్ల యజమానులు షెడ్‌లు వేయడంతో కూలీలు నివాసం ఉంటున్నారు. డ్రైనేజీ లైన్లు లేకపోవడంతో డైమండ్‌ హిల్స్‌ కాలనీ మురికికూపంగా మారింది. ఐటీ కారిడార్‌లో ఉన్న ఈ కాలనీ ముంబైలోని ధారావి మురుకివాడలా తయారవుతోంది. సాయంత్రమైతే చాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి కూడా సరఫరా అవుతోందని స్థానికులు చెబుతున్నారు.

ఇష్టానుసారంగా హెచ్‌టీ కనెక్షన్లు

డైమండ్‌ హిల్స్‌లో అనధికారికంగా జీ+1 అంతస్తుతో భారీ జిమ్‌ ఏర్పాటు చేశారు. దానికి విద్యుత్తు అధికారులు హైటెన్షన్‌ లైన్‌తో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశారు. ఇలా 10-15 వరకు ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. వివిధ షెడ్లకూ అధికారులు అనుమతి ఇచ్చారు. సాధారణంగా హెచ్‌టీ కనెక్షన్‌ తీసుకునేందుకు అన్ని రకాల అనుమతులున్నా, నెలల తరబడి నాన్చుతారు. కానీ, డైమండ్‌ హిల్స్‌లో ఎలాంటి అనుమతులు లేని భారీ షెడ్‌లకు, కమర్షియల్‌ భవనాలకు హెచ్‌టీ కనెక్షన్లతో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసేస్తున్నారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి.

Updated Date - Mar 18 , 2024 | 05:17 AM

Advertising
Advertising