ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అటు వర్షం.. ఇటు వికెట్లు

ABN, Publish Date - Dec 17 , 2024 | 06:27 AM

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ మూడో టెస్టును వరుణుడు వదలడం లేదు. సోమవారం మూడో రోజు ఆటలో ఆటగాళ్లు పదేపదే మైదానంలోకి రావడం.. పెవిలియన్‌కు వెళ్లడంతోనే సరిపోయింది. కేవలం 33 ఓవర్ల ఆట మాత్రమే...

కుప్పకూలిన టాపార్డర్‌

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 51/4

  • ఆసీస్‌ మొదటి ఇన్నింగ్స్‌ 445

  • బుమ్రాకు ఆరు వికెట్లు

బ్రిస్బేన్‌: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ మూడో టెస్టును వరుణుడు వదలడం లేదు. సోమవారం మూడో రోజు ఆటలో ఆటగాళ్లు పదేపదే మైదానంలోకి రావడం.. పెవిలియన్‌కు వెళ్లడంతోనే సరిపోయింది. కేవలం 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. ఇందులో భారత్‌ ఆడింది 17 ఓవర్లు. కానీ ఈ కాస్త సమయంలోనే మనోళ్లవి టపటపా నాలుగు వికెట్లు పడిపోయాయి. ఆస్ట్రేలియా బ్యాటర్లు శతకాలతో చెలరేగిన చోట భారత బ్యాటర్లు నానా తంటాలుపడిన తీరు అందరినీ నిరాశపరిచింది. పదేపదే అవే తప్పులు చేస్తూ ఆసీస్‌ బౌలర్లకు అప్పనంగా వికెట్లను సమర్పించుకోవడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 51/4 స్కోరుతో నిలిచింది. రాహుల్‌ (33 బ్యాటింగ్‌) ఒక్కడే ఓపిగ్గా క్రీజులో నిలిచి పరుగులు రాబడుతున్నాడు. అతడికి జతగా రోహిత్‌ పరుగులేమీ చేయకుండా ఉన్నాడు. స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఓ విధంగా భారత్‌ను వర్షమే కాపాడుతోంది. లేకుంటే ఈపాటికి ఫాలోఆన్‌ ఆడే దుస్థితి దాపురించేదేమో. అంతకుముందు ఆసీస్‌ తమ ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 40 పరుగులు జోడించి 445 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. క్యారీ (70) హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. బుమ్రాకు ఆరు, సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి.


రెండో బంతి నుంచే...: ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిశాక వెంటనే వర్షం కురవడంతో అరగంట ఆలస్యంగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించింది. కానీ ఆ తర్వాత కూడా అటు వరుణుడి రాకతో పాటు ఇటు క్రీజులో వికెట్ల పతనం కూడా సాగింది. తొలి బంతినే ఫోర్‌గా మలిచిన ఓపెనర్‌ యశస్వీని రెండో బంతికే స్టార్క్‌ అవుట్‌ చేశాడు. షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చిన తను షాక్‌తో వెనుదిరిగాడు. స్టార్క్‌ తర్వాతి ఓవర్‌లోనూ ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఈసారి గిల్‌ (1)ని దెబ్బతీశాడు. గిల్‌ క్యాచ్‌ను గల్లీలో మార్ష్‌ పట్టేశాడు. అటు రాహుల్‌ మాత్రం ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు సాధించి పరుగుల కోసం ప్రయత్నించాడు. అలాగే హాజెల్‌వుడ్‌ ఓవర్‌లో మణికట్టు వద్ద బంతి బలంగా తాకినా చికిత్స చేయించుకుని మరీ ఆడాడు. మరో ఎండ్‌లో విరాట్‌ (3) 16 బంతులు ఎదుర్కొన్నా ఎప్పటిలాగే ఆఫ్‌సైడ్‌ ఆవలి బంతిని డ్రైవ్‌ చేయబోయి కీపర్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చాడు. 22/3 స్కోరుతో నిలిచిన వేళ వర్షం మొదలైంది. దీంతో లంచ్‌ బ్రేక్‌ను ప్రకటించారు. రెండో సెషన్‌ ఆరంభమైన కాసేపటికే మళ్లీ వర్షంతో 45 నిమిషాల పాటు అంతరాయం కలిగింది. క్రీజులో రాహుల్‌తో పంత్‌ (9) కూడా ఉండడంతో ఆ తర్వాతైనా స్కోరు కుదురుకుంటుందనిపించింది.


కానీ కమిన్స్‌ విసిరిన బంతి పంత్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని క్యారీ చేతుల్లో పడింది. ఆ తర్వాత మరో రెండు బంతులకే భారీ వర్షం పలకరించడంతో ఈసారి రెండు గంటలపాటు ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యారు. తిరిగి ఆసీస్‌ కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఆఖరి సెషన్‌ ఆటను ఆరంభించారు. కేవలం మూడు ఓవర్లు సాగాక మరోసారి వర్షం కురవడంతో చేసేదేమీలేక ఆటను ముగించాల్సి వచ్చింది.


స్కోరుబోర్డు

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌: ఖవాజా (సి) పంత్‌ (బి) బుమ్రా 21; మెక్‌స్వీనే (సి) విరాట్‌ (బి) బుమ్రా 9; లబుషేన్‌ (సి) విరాట్‌ (బి) నితీశ్‌ 12; స్మిత్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 101; హెడ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 152; మార్ష్‌ (సి) విరాట్‌ (బి) బుమ్రా 5; క్యారీ (సి) గిల్‌ (బి) ఆకాశ్‌ 70; కమిన్స్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 20; స్టార్క్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 18; లియోన్‌ (బి) సిరాజ్‌ 2; హాజెల్‌వుడ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 35; మొత్తం: 117.1 ఓవర్లలో 445 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-31, 2-38, 3-75, 4-316, 5-326, 6-327, 7-385, 8-423, 9-445, 10-445; బౌలింగ్‌: బుమ్రా 28-9-76-6; సిరాజ్‌ 23.2-5-97-2; ఆకాశ్‌ 29.5-5-95-1; నితీశ్‌ 13-1-65-1; జడేజా 23-2-95-0.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) మార్ష్‌ (బి) స్టార్క్‌ 4; రాహుల్‌ (బ్యాటింగ్‌) 33; గిల్‌ (సి) మార్ష్‌ (బి) స్టార్క్‌ 1; విరాట్‌ (సి) క్యారీ (బి) హాజెల్‌వుడ్‌ 3; పంత్‌ (సి) క్యారీ (బి) కమిన్స్‌ 9; రోహిత్‌ (బ్యాటింగ్‌) 0; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 17 ఓవర్లలో 51/4. వికెట్ల పతనం: 1-4, 2-6, 3-22, 4-44; బౌలింగ్‌: స్టార్క్‌ 8-1-25-2; హాజెల్‌వుడ్‌ 5-2-17-1; కమిన్స్‌ 2-0-7-1; లియోన్‌ 1-0-1-0; హెడ్‌ 1-0-1-0.

2

ఆసీస్‌ గడ్డపై ఎక్కువ టెస్టు వికెట్లు (50) తీసిన రెండో భారత బౌలర్‌గా బుమ్రా. కపిల్‌ (51) టాప్‌లో ఉన్నాడు.

Updated Date - Dec 17 , 2024 | 06:27 AM