సీన్ రివర్సు సిరీస్ గల్లంతు
ABN, Publish Date - Oct 27 , 2024 | 05:15 AM
స్వదేశంలో భారత క్రికెట్ జట్టు తిరుగులేని ఆధిపత్యానికి గండి పడింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో 18 సిరీ్‌సల విజయానికి న్యూజిలాండ్ ఫుల్‌స్టాప్ పెట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో కివీస్ 113 పరుగులతో ఘనవిజయం...
మహిళల రెండో వన్డే నేడు, భారత్ X న్యూజిలాండ్
మ. 1.30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో
12 ఏళ్లలో తొలిసారి సొంతగడ్డపై భారత్‌కు పరాభవం
రెండో టెస్టులోనూ ఓటమి
శాంట్నర్‌కు ఆరు వికెట్లు
పోరాడిన జైస్వాల్
2-0తో కివీస్‌కు తిరుగులేని ఆధిక్యం
12 ఏళ్లు.. 18 వరుస టెస్టు సిరీస్ విజయాలు. ఇదీ సొంత గడ్డపై టీమిండియా ట్రాక్ రికార్డు. 2012 నుంచి ఎంతటి ప్రత్యర్థి వచ్చినా మైదానాల్లో మనోళ్ల ఆటకు బెంబేలెత్తి ‘పోయారు’. కానీ మన ఆధిపత్యానికి చెక్‌పెడుతూ ఈసారి న్యూజిలాండ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇటీవలే శ్రీలంక చేతిలో వైట్‌వాష్, కెప్టెన్ రాజీనామా.. సీనియర్ బ్యాటర్ కేన్ గాయపడడంతో పాటు లాథమ్, సౌథీలకు తప్ప పెద్దగా ఎవరికీ టెస్టు అనుభవమే లేదు. అసలిక్కడ వారు టెస్టు గెలిచే 36 ఏళ్లయ్యింది. ఇన్ని సమస్యలను అధిగమిస్తూ కివీస్ జట్టు సమష్టి ఆటతీరుతో భారత్‌పై విరుచుకుపడింది. స్పిన్నర్ శాంట్నర్ 13 వికెట్లతో భారత పతనాన్ని శాసించిన వేళ.. రెండో టెస్టులో అద్భుత విజయాన్ని దక్కించుకున్న కివీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీ్‌సను దక్కించుకుంది.
పుణె: స్వదేశంలో భారత క్రికెట్ జట్టు తిరుగులేని ఆధిపత్యానికి గండి పడింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో 18 సిరీ్‌సల విజయానికి న్యూజిలాండ్ ఫుల్‌స్టాప్ పెట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో కివీస్ 113 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఇప్పటికే తొలి టెస్టును గెలిచిన ఈ జట్టు మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ దక్కించుకుంది. భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడం కివీ్‌సకిదే తొలిసారి. కాగా, 2012-13లో ఇంగ్లండ్ చేతిలో చివరిసారి భారత్ ధోనీ కెప్టెన్సీలో ఇక్కడ సిరీస్ కోల్పోయింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, స్పిన్నర్ శాంట్నర్ మొత్తంగా 13 వికెట్లతో భారత్‌కు ఓటమి రుచి చూపించాడు. 359 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 245 రన్స్‌కు ఆలౌటైంది. ఓపెనర్ జైస్వాల్ (77), జడేజా (42) మాత్రమే రాణించారు. శాంట్నర్ 6, ఎజాజ్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు శనివారం మూడోరోజు కివీస్ రెండో ఇన్నింగ్స్ గంటలోనే ముగిసింది. జడేజా (3/72) టెయిలెండర్ల పనిబట్టడంతో కివీస్ 255 రన్స్‌కు ఆలౌటైంది. ఫిలిప్స్ (48 నాటౌట్), బ్లండెల్ (41) ఆకట్టుకున్నారు. సుందర్‌కు 4, అశ్విన్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 259, భారత్ 156 రన్స్ చేశాయి. ఆఖరి టెస్టు వచ్చేనెల 1 నుంచి ముంబైలో జరుగుతుంది.
ఆరంభం బాగున్నా..: భారీ ఛేదనను భారత్ దూకుడుగా ఆరంభించింది. తొలి ఓవర్‌లోనే జైస్వాల్ 6,4 బాదాడు. అటు శాంట్నర్ చేతిలో రోహిత్ (8) అవుటైనా.. గిల్ (23), జైస్వాల్ ఎదురుదాడికి దిగారు. వీరి పోటాపోటీ బౌండరీలతో లంచ్ సెషన్ ముగిసేసరికి జట్టు 12 ఓవర్లలోనే 81/1 స్కోరు సాధించింది. కానీ సజావుగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు శాంట్నర్ చెక్ పెడుతూ గిల్ వికెట్ తీయడంతో రెండో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అంతే.. ఇక్కడి నుంచి భారత్ వికెట్ల పతనం సాగింది. జైస్వాల్ అవుటయ్యే దాకా ఓవర్‌కు ఆరు పరుగుల రన్‌రేట్‌తో సాగిన ఛేదన ఆ తర్వాత పూర్తిగా నెమ్మదించింది. రెండో సెషన్‌లోనే ఆరు కీలక వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖర్లో జడేజా, అశ్విన్ (18) పోరాటం కివీస్ బౌలర్లను పరీక్షించింది. అటు భారత్ విజయంపై ఆశలు రేపినా ఫలితం లేకపోయింది. మరోసారి శాంట్నర్ కివీస్‌కు ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తూ అశ్విన్‌ను అవుట్ చేశాడు. ఈ సమయంలో జడ్డూ భారీ షాట్లతో అలరించాడు. అయితే స్పిన్నర్ ఎజాజ్.. ఆకాశ్ (1), జడ్డూ వికెట్లను తీయడంతో కివీస్ విజయం అందుకుంది.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 259; భారత్ తొలి ఇన్నింగ్స్: 156
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) సుందర్ 86; కాన్వే (ఎల్బీ) సుందర్ 17; యంగ్ (ఎల్బీ) అశ్విన్ 23; రచిన్ (బి) సుందర్ 9; మిచెల్ (సి) జైస్వాల్ (బి) సుందర్ 18; బ్లండెల్ (బి) జడేజా 41; ఫిలిప్స్ (నాటౌట్) 48; శాంట్నర్ (సి) బుమ్రా (బి) జడేజా 4; సౌథీ (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; ఎజాజ్ (సి) సుందర్ (బి) జడేజా 1; ఓరోక్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 69.4 ఓవర్లలో 255 ఆలౌట్. వికెట్ల పతనం: 1-36, 2-78, 3-89, 4-123, 5-183, 6-231, 7-237, 8-238, 9-241, 10-255. బౌలింగ్: అశ్విన్ 25-2-97-2; సుందర్ 19-0-56-4; జడేజా 19.4-3-72-3; బుమ్రా 6-1-25-0.
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మిచెల్ (బి) శాంట్నర్ 77; రోహిత్ (సి) యంగ్ (బి) శాంట్నర్ 8; గిల్ (సి) మిచెల్ (బి) శాంట్నర్ 23; కోహ్లీ (ఎల్బీ) శాంట్నర్ 17; పంత్ (రనౌట్) 0; సుందర్ (సి) యంగ్ (బి) ఫిలిప్స్ 21; సర్ఫరాజ్ (బి) శాంట్నర్ 9; జడేజా (సి) సౌథీ (బి) ఎజాజ్ 42; అశ్విన్ (సి) మిచెల్ (బి) శాంట్నర్ 18; ఆకాశ్ (సి) రచిన్ (బి) ఎజాజ్ 1; బుమ్రా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: 60.2 ఓవర్లలో 245 ఆలౌట్. వికెట్ల పతనం: 1-34, 2-96, 3-127, 4-127, 5-147, 6-165, 7-167, 8-206, 9-229, 10-245. బౌలింగ్: సౌథీ 2-0-15-0; ఓరోక్ 1-0-5-0; శాంట్నర్ 29-2-104-6; ఎజాజ్ 12.2-0-43-2; ఫిలిప్స్ 16-0-60-1.
‘పోస్ట్‌మార్టం అవసరం లేదు’
మా ఆటతీరును పోస్ట్‌మార్టం చేయాలనుకోవడం లేదు. ఇదే బ్యాటర్లు గతంలో సిరీస్ విజయాలు అందించిన విషయం గుర్తుంచుకోవాలి. అయితే, 20 వికెట్లు సాధించినా బ్యాటర్లు కూడా పరుగులు చేయాల్సి ఉంది. కానీ అదే జరగలేదు. ఫలితం అనుభవించాం. ఇది సమష్టి వైఫల్యం. - రోహిత్ శర్మ
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
1
సొంతగడ్డపై ఓ క్యాలెండర్ ఏడాదిలో ఎక్కువ టెస్టు పరుగులు (1084), సిక్సర్లు (33) బాదిన భారత బ్యాటర్‌గా జైస్వాల్. గుండప్ప విశ్వనాథ్ (1979లో 1047)ను అధిగమించాడు.
టెస్టులో రెండుసార్లు విరాట్ కోహ్లీని అవుట్ చేసిన తొలి లెఫ్టామ్ స్పిన్నర్‌గా శాంట్నర్.
2
స్వదేశంలో ఎక్కువ టెస్టు ఓటములు (4) పొందిన రెండో కెప్టెన్‌గా కపిల్, అజరుద్దీన్‌తో సమంగా నిలిచిన రోహిత్. మన్సూర్ అలీఖాన్ (9) టాప్‌లో ఉన్నాడు. జట్టు కోహ్లీ కెప్టెన్సీలో రెండుసార్లు ఓడగా.. ధోనీ సారథ్యంలో మూడుసార్లు ఓడింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ కష్టమే..
కివీస్ చేతిలో రెండు టెస్టుల ఓటమితో భారత జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతానికి 62.82 విజయాల శాతంతో జట్టు టాప్‌లోనే ఉన్నా ఫైనల్‌కు చేరాలంటే మాత్రం మిగిలిన ఆరు టెస్టుల్లో ఐదు గెలిచి, ఒకటి డ్రా చేసుకోవాలి. అంటే.. ఆఖరి టెస్టులో కివీ్‌సపైనే కాకుండా ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల్లో నాలుగైనా గెలిస్తే నేరుగా తుది పోరుకు అర్హత సాధిస్తుంది. కానీ అదంత సులువు కాదు, కాబట్టి కనీసం రెండైనా గెలిచి నాలుగు డ్రా చేసుకున్నా, మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడవచ్చు. అటు ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) జట్లు భారత్‌కు సవాల్ విసురుతున్నాయి.
Updated Date - Oct 27 , 2024 | 05:16 AM