ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇక.. మన చేతుల్లోనే

ABN, Publish Date - Nov 25 , 2024 | 02:51 AM

బ్యాటర్లు భళా అనిపించగా.. బుమ్రా మరోసారి బంతితో చెలరేగడంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో భారత్‌ విజయం దిశగా దూసుకెళ్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ (100 నాటౌట్‌), యువ కెరటం యశస్వి జైస్వాల్‌ (161) శతకాలతో కదం తొక్కడంతో...

విజయానికి ఏడు వికెట్ల దూరంలో భారత్‌

టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ 487/6 డిక్లేర్డ్‌

  • కోహ్లీ, జైస్వాల్‌ శతక మోత

  • ఆసీస్‌ లక్ష్యం 534, ప్రస్తుతం 12/3

ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత్‌.. పెర్త్‌ టెస్ట్‌లో పూర్తిగా పట్టుబిగించింది. కోహ్లీ, జైస్వాల్‌ సెంచరీతో చెలరేగడంతో.. ఆసీస్‌ ముందు భారత్‌ 534 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బుమ్రా బుల్లెట్‌ బంతులకు ఆసీస్‌ 12/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. మొత్తంగా విజయానికి 522 రన్స్‌ దూరంలో ఉన్న ఆస్ట్రేలియా.. పగుళ్లు కనిపిస్తున్న వికెట్‌పై ఏదో అద్భుతం చేస్తే తప్ప ఓటమిని తప్పించుకోలేని పరిస్థితి!


పెర్త్‌: బ్యాటర్లు భళా అనిపించగా.. బుమ్రా మరోసారి బంతితో చెలరేగడంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో భారత్‌ విజయం దిశగా దూసుకెళ్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ (100 నాటౌట్‌), యువ కెరటం యశస్వి జైస్వాల్‌ (161) శతకాలతో కదం తొక్కడంతో.. మూడో రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ప్రత్యర్థి ముందు 534 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 172/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ 487/6 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. రాహుల్‌ (77), నితీశ్‌ (38 నాటౌట్‌) విలువైన సహకారం అందించారు. నాథన్‌ లియోన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆసీస్‌ ఆదివారం ఆట ఆఖరుకు 12/3తో కష్టాల్లో పడింది. ఖవాజా (3 బ్యాటింగ్‌) క్రీజులో ఉండగా.. చివరి ఓవర్‌లో లబుషేన్‌ (3)ను కెప్టెన్‌ బుమ్రా (2/1) ఎల్బీ చేశాడు. మరో రెండు రోజుల ఆట మిగిలున్న నేపథ్యంలో లక్ష్యానికి కంగారూలు ఇంకా 522 పరుగుల దూరంలో ఉండగా.. చేతిలో 7 వికెట్లున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 150, ఆసీస్‌ 104 రన్స్‌కు ఆలౌటయ్యాయి.


ధాటిగా ఆడుతూ..: ముందురోజు సంయమనం పాటించిన ఓవర్‌నైట్‌ బ్యాటర్లు జైస్వాల్‌, రాహుల్‌.. తొలి సెషన్‌ నుంచే దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్టార్క్‌ బౌలింగ్‌లో వీరిద్దరూ చెరో బౌండ్రీతో ఉద్దేశాన్ని చాటారు. కాగా, హాజెల్‌వుడ్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో జైస్వాల్‌ సెంచరీ సాధించి సంబరాలు చేసుకొన్నాడు. కానీ, ఆ తర్వాతి ఓవర్‌లో రాహుల్‌ను స్టార్క్‌ క్యాచవుట్‌ చేయడంతో.. తొలి వికెట్‌కు 201 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌లో వచ్చిన దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (25) కూడా సెటిల్డ్‌ బ్యాటర్‌ జైస్వాల్‌కు చక్కని సహకారం అందిస్తూ స్కోరు బోర్డును నడిపించే ప్రయత్నం చేశాడు. దీంతో లంచ్‌ సమయానికి భారత్‌ 275/1తో నిలిచింది.


వావ్‌.. విరాట్‌..: తిరిగి వచ్చిన తర్వాత రెండో సెషన్‌ తొలి బంతికే పడిక్కళ్‌ను అవుట్‌ చేసిన హాజెల్‌వుడ్‌.. రెండో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఆరంభంలో ఆచితూచి ఆడినా ఆ తర్వాత జోరు పెంచాడు. అనూహ్యంగా బౌన్స్‌ అవుతున్న బంతులను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును దౌడు తీయించాడు. మరోవైపు 150 పరుగులు పూర్తి చేసుకొన్న జైస్వాల్‌ భారీ షాట్‌ ఆడే క్రమంలో మార్ష్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్‌ పంత్‌ (1), ధ్రువ్‌ జురెల్‌ (1) వరుస ఓవర్లలో అవుటయ్యారు. అప్పటికే జట్టు పటిష్ట స్థితిలో అటాకింగ్‌ ఆటను ప్రదర్శించిన కోహ్లీ.. వాషింగ్టన్‌ సుందర్‌ (29)తో కలసి ఆరో వికెట్‌కు 89 రన్స్‌ జోడించాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో గేర్‌ మార్చిన విరాట్‌.. వీలుచిక్కినప్పడల్లా బౌండ్రీలు బాదడంతో టీ సెషన్‌కు టీమిండియా 359/5 స్కోరు చేసింది. ఇక, ఆఖరి సెషన్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న కోహ్లీ.. వీలైనంత వేగంగా సెంచరీ మార్క్‌ చేరేందుకు ప్రయత్నించాడు. సుందర్‌ను లియోన్‌ బౌల్డ్‌ చేసినా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్‌ ఎడాపెడా షాట్లతో కంగారూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. విరాట్‌తో కలసి ఏడో వికెట్‌కు అజేయంగా 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్ష్‌ బౌలింగ్‌లో సిక్స్‌తోపాటు హ్యాట్రిక్‌ ఫోర్లతో నితీశ్‌ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఇక క్రమంగా 90ల్లోకి అడుగుపెట్టిన కోహ్లీ.. బౌండ్రీతో శతకం పూర్తి చేయడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.


దెబ్బకొట్టిన బుమ్రా..: కొండంత లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆసీస్‌ బుమ్రా దెబ్బకు కంగారు పడింది. తొలి ఓవర్‌లోనే మెక్‌స్వీనీ (0)ని డకౌట్‌ చేసిన బుమ్రా జట్టుకు అద్భుత ఆరంభాన్నిచ్చాడు. నైట్‌ వాచ్‌మన్‌ కమిన్స్‌ (2)ను సిరాజ్‌ వెనక్కిపంపాడు. ఇక, ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న లబుషేన్‌ను బుమ్రా వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు.

స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 150.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 104.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) స్మిత్‌ (బి) మార్ష్‌ 161, రాహుల్‌ (సి) క్యారీ (బి) స్టార్క్‌ 77, పడిక్కళ్‌ (సి) స్మిత్‌ (బి) హాజెల్‌వుడ్‌ 25, కోహ్లీ (నాటౌట్‌) 100, పంత్‌ (స్టంప్‌) క్యారీ (బి) లియోన్‌ 1, జురెల్‌ (ఎల్బీ) కమిన్స్‌ 1, సుందర్‌ (బి) లియోన్‌ 29, నితీశ్‌ (నాటౌట్‌) 38; ఎక్స్‌ట్రాలు: 55; మొత్తం: 134.3 ఓవర్లలో 487/6 డిక్లేర్డ్‌; వికెట్ల పతనం: 1-201, 2-275, 3-313, 4-320, 5-321, 6-410; బౌలింగ్‌: స్టార్క్‌ 26-2-111-1, హాజెల్‌వుడ్‌ 21-9-28-1, కమిన్స్‌ 25-5-86-1, మార్ష్‌ 12-0-65-1, లియోన్‌ 39-5-96-2, లబుషేన్‌ 6.3-0-38-0, హెడ్‌ 5-0-26-0.


ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: మెక్‌స్వీనీ (ఎల్బీ) బుమ్రా 0, ఖవాజా (బ్యాటింగ్‌) 3, కమిన్స్‌ (సి) కోహ్లీ (బి) సిరాజ్‌ 2, లబుషేన్‌ (ఎల్బీ) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 4.2 ఓవర్లలో 12/3; వికెట్ల పతనం: 1-0, 2-9, 3-12; బౌలింగ్‌: బుమ్రా 2.2-1-1-2, సిరాజ్‌ 2-0-7-1.

1

కంగారూ గడ్డపై తొలి వికెట్‌కు అత్యధికంగా 201 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడీగా జైస్వాల్‌-రాహుల్‌. 1986లో సిడ్నీ టెస్ట్‌లో గవాస్కర్‌-శ్రీకాంత్‌ (191రన్స్‌) రికార్డు బద్దలైంది.

3

ఆస్ట్రేలియాలో ఆడిన తొలి టెస్ట్‌లోనే సెంచరీ నమోదు చేసిన మూడో భారత బ్యాటర్‌గా జైస్వాల్‌. జయసింహ, గవాస్కర్‌ ఈ ఘనతను అందుకొన్నారు.

4

ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు 150+ స్కోర్లు సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా జైస్వాల్‌. సచిన్‌ టెండూల్కర్‌, సెహ్వాగ్‌, కోహ్లీ గతంలో ఈఫీట్‌ నమోదు చేశారు.

Updated Date - Nov 25 , 2024 | 02:51 AM