చెన్నైకి ఝలక్
ABN, Publish Date - Apr 01 , 2024 | 01:26 AM
రెండు వరుస విజయాలతో ఊపు మీదున్న పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేసింది. తమ హోమ్ గ్రౌండ్‌లో పేసర్లు ముకేశ్ కుమార్ (3/21), ఖలీల్ అహ్మద్ (2/21) విశేషంగా రాణించడంతో 20 పరుగులతో గెలిచిన ఢిల్లీ తాజా సీజన్‌లో ఎట్టకేలకు బోణీ చేసింది...
నేటి మ్యాచ్
ముంబై X రాజస్థాన్, రా.7.30 నుంచి
ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ
వార్నర్, పంత్ అర్ధసెంచరీలు
ధోనీ మెరుపులు వృధా
విశాఖపట్నం: రెండు వరుస విజయాలతో ఊపు మీదున్న పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేసింది. తమ హోమ్ గ్రౌండ్‌లో పేసర్లు ముకేశ్ కుమార్ (3/21), ఖలీల్ అహ్మద్ (2/21) విశేషంగా రాణించడంతో 20 పరుగులతో గెలిచిన ఢిల్లీ తాజా సీజన్‌లో ఎట్టకేలకు బోణీ చేసింది. అటు ప్రేక్షకుల కేరింతల మధ్య ఏడాది తర్వాత బరిలోకి దిగిన ఎంఎస్ ధోనీ (16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 నాటౌట్) తన పవర్‌హిట్టింగ్‌తో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. వార్నర్ (35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 52), పంత్ (32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51), పృథ్వీ షా (27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) సత్తా చాటారు. పథిరనకు 3 వికెట్లు దక్కాయి. ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 రన్స్ చేసి ఓడింది. రహనె (30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), మిచెల్ (26 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 34) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఖలీల్ నిలిచాడు.
పేసర్ల జోరు: భారీ ఛేదనలో చెన్నైని ఢిల్లీ పేసర్లు హడలెత్తించారు. వారి ధాటికి తొలి 23 బంతుల దాకా ఒక్క ఫోర్ కూడా రాలేదు. అటు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టారు. ఇక ఖలీల్ తన వరుస ఓవర్లలో ఓపెనర్లు రుతురాజ్ (1), రచిన్ (12 బంతుల్లో 2)లను పెవిలియన్ చేర్చాడు. అప్పటికి జట్టు స్కోరు 18 బంతుల్లో 7/2. ఈ దశలో రహానె-మిచెల్ జోడీ ఆదుకునే ప్రయత్నం చేసింది. ఇషాంత్ ఓవర్‌లో రహానె రెండు ఫోర్లు, నోకియా ఓవర్‌లో ఓ సిక్సర్‌తో జట్టు పవర్‌ప్లేలో 32 పరుగులు చేసింది. పదో ఓవర్‌లో చెరో సిక్సర్‌తో 17 రన్స్ సమకూరాయి. ఈ దశలో మిచెల్‌ను అక్షర్ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 68 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఇక 14వ ఓవర్‌లో పేసర్ ముకేశ్ ఝలక్ ఇస్తూ రహానె, రిజ్వీ (0)ల వికెట్లను తీశాడు. అప్పటికి చెన్నై విజయానికి 38 బంతుల్లో 89 రన్స్ కావాలి. ఇక శివమ్ దూబే (18) నిష్క్రమణ తర్వాత అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న ధోనీ క్రీజులోకి రావడంతో విశాఖ స్టేడియం హోరెత్తింది. వీరిని సంతృప్తి పరుస్తూ ధోనీ ఆఖరి ఓవర్‌లో 4,6,4,6తో 20 రన్స్ రాబట్టి జట్టు ఓటమి అంతరాన్ని గణనీయంగా తగ్గించాడు. జడేజా (21 నాటౌట్)తో కలిసి ఏడో వికెట్‌కు అజేయంగా 51 పరుగులు అందించాడు.
వార్నర్, పంత్ అర్ధసెంచరీలు: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు వార్నర్, పృథ్వీ షా శుభారంభాన్ని అందించారు. అయితే మధ్య ఓవర్లలో కాస్త నెమ్మదించినా.. చివర్లో కెప్టెన్ పంత్ బ్యాట్ ఝుళిపిస్తూ ఫామ్‌ను చాటుకున్నాడు. ఆరంభ ఐదో ఓవర్‌లో వార్నర్ 6,4,4.. తర్వాతి ఓవర్‌లో షా 4,4,4 బాదడంతో ఈ 12 బంతుల్లోనే జట్టు 38 రన్స్ రాబట్టింది. అటు పవర్‌ప్లేను జట్టు 62 పరుగులతో ముగించింది. తర్వాత కూడా వార్నర్ జోరు పెంచుతూ 32 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ పదో ఓవర్ నుంచి ఢిల్లీ ఇన్నింగ్స్ నెమ్మదించింది. ఇక, వార్నర్ రివర్స్ స్కూప్‌నకు ప్రయత్నించగా.. థర్డ్‌మ్యాన్‌లో పథిరన డైవ్ చేస్తూ గాల్లోనే బంతిని అందుకున్న తీరు అబ్బురపరిచింది. వార్నర్ అవుట్‌తో తొలి వికెట్‌కు 93 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. వెంటనే జడేజా ఓవర్‌లో ధోనీ మెరుపు క్యాచ్‌తో షా వెనుదిరిగాడు. 15వ ఓవర్‌లో పేసర్ పథిరన 150 కి.మీ వేగంతో రెండు కళ్లు చెదిరే యార్కర్లతో మార్ష్ (18), స్టబ్స్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేయడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ దశలో పరుగులు తగ్గిపోయాయి. అయితే, 18వ ఓవర్‌లో 4,6.. 19వ ఓవర్‌లో 6,4,4 బాదిన పంత్ 31 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ వెంటనే పథిరనకు పంత్ చిక్కాడు. అయితే చివరి 3 ఓవర్లలో ఢిల్లీ 43 రన్స్ సాధించడంతో స్కోరు 190 దాటింది.
స్కోరుబోర్డు
ఢిల్లీ: పృథ్వీ షా (సి) ధోనీ (బి) జడేజా 43, వార్నర్ (సి) పథిరన (బి) ముస్తాఫిజుర్ 52, పంత్ (సి) రుతురాజ్ (బి) పథిరన 51, మార్ష్ (బి) పథిరన 18, స్టబ్స్ (బి) పథిరన 0, అక్షర్ (నాటౌట్) 7, అభిషేక్ పొరెల్ (నాటౌట్) 9, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 191/5; వికెట్ల పతనం: 1-93, 2-103, 3-134, 4-134, 5-178; బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-42-0, తుషార్ దేశ్‌పాండే 4-0-24-0, ముస్తాఫిజుర్ 4-0-47-1, జడేజా 4-0-43-1, పథిరన 4-0-31-3.
చెన్నై: రుతురాజ్ (సి) పంత్ (బి) ఖలీల్ 1, రచిన్ రవీంద్ర (సి) స్టబ్స్ (బి) ఖలీల్ 2, రహానే (సి) వార్నర్ (బి) ముకేశ్ 45, మిచెల్ (సి అండ్ బి) అక్షర్ 34, శివమ్ దూబే (సి) స్టబ్స్ (బి) ముకేశ్ 18, సమీర్ రిజ్వీ (సి) ఖలీల్ (బి) ముకేశ్ 0, జడేజా (నాటౌట్) 21, ధోనీ (నాటౌట్) 37, ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 171/6; వికెట్ల పతనం: 1-3, 2-7, 3-75, 4-102, 5-102, 6-120; బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4-1-21-2, ఇషాంత్ 3-0-23-0, నోకియా 4-0-43-0, అక్షర్ 3-0-20-1, రసిఖ్ 2-0-25-0, మార్ష్ 1-0-14-0, ముకేశ్ కుమార్ 3-0-21-3.
1
టీ20 క్రికెట్‌లో ఎక్కువ (110) సార్లు 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా గేల్‌ను సమం చేసిన వార్నర్.
2
పొట్టి ఫార్మాట్‌లో వికెట్ల వెనకాల 300 మంది బ్యాటర్లను అవుట్ చేసిన తొలి కీపర్‌గా ధోనీ.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
కోల్‌కతా 2 2 0 0 4 1.047
చెన్నై 3 2 1 0 4 0.976
రాజస్థాన్ 2 2 0 0 4 0.800
గుజరాత్ 3 2 1 0 4 -0.738
హైదరాబాద్ 3 1 2 0 2 0.204
లఖ్‌నవూ 2 1 1 0 2 0.025
ఢిల్లీ 3 1 2 0 2 -0.016
పంజాబ్ 3 1 2 0 2 -0.337
బెంగళూరు 3 1 2 0 2 -0.711
ముంబై 2 0 2 0 0 -0.925
Updated Date - Apr 01 , 2024 | 01:26 AM