Urvashi Rautela : ఊర్వశివో..!
ABN, Publish Date - Jan 18 , 2024 | 03:33 AM
‘బాసూ వేరీజ్ ద పార్టీ...’ అంటూ మెగాస్టార్‌తో కలిసి ఇచ్చిన డ్యాన్స్ పార్టీతో తొలిసారి తెలుగు తెరపై మెరిసింది ఊర్వశీ రౌతెలా. ఆ ‘ప్రత్యేక పాట’తో టాలీవుడ్‌లో
‘బాసూ వేరీజ్ ద పార్టీ...’ అంటూ మెగాస్టార్‌తో కలిసి
ఇచ్చిన డ్యాన్స్ పార్టీతో తొలిసారి తెలుగు తెరపై మెరిసింది
ఊర్వశీ రౌతెలా. ఆ ‘ప్రత్యేక పాట’తో టాలీవుడ్‌లో
మరికొన్ని అవకాశాలూ దక్కించుకుంది. మోడల్‌గా
మొదలుపెట్టి... అందాల రాణి సింహాసనం అధిష్టించి...
నటిగా అడుగులు వేస్తున్న ఊర్వశి... పేరుకు తగ్గట్టుగానే నవయవ్వనంతో
యువతరాన్ని సమ్మోహితులను చేస్తోంది.
వెండితెర వెలుగులకే పరిమితం కాకుండా...
అభిమానులకు ఫిట్‌నెస్ లక్ష్యాలు నిర్దేశించి...
వారిని ఆరోగ్యకర జీవన విధానం వైపు నడిపిస్తోంది.
పదిహేనేళ్లప్పుడు ‘విల్స్ ఫ్యాషన్ వీక్’లో క్యాట్‌వాక్‌తో అలరించిన ఊర్వశీ రౌతెలా మొట్టమొదటి లక్ష్యం... మోడల్‌గా ఎదగడం. అనుకున్నట్టుగానే ఆ ఫ్యాషన్ షో... ఆమెను తిరుగులేని మోడల్‌ను చేసింది. 2009లో ‘మిస్ టీన్ ఇండియా’ టైటిల్ నెగ్గింది. ప్రతిష్టాత్మక ‘లాక్మే ఫ్యాషన్ వీక్’లో షో స్టాపర్‌గా మురిపించింది. తరువాత జరిగిన అమెజాన్, బాంబే, దుబాయ్ ఫ్యాషన్ వీక్స్‌లోనూ ఆ జోరు కొనసాగింది. 2011లో ‘ఇండియన్ ప్రిన్సెస్’, ‘మిస్ ఏషియన్ సూపర్‌మోడల్’గా నిలిచింది. అదే ఏడాది చైనాలో జరిగిన ‘మిస్ టూరిజమ్ క్వీన్ ఆఫ్ ద ఇయర్’ కిరీటం దక్కించుకుని, ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఇవన్నీ చూసి బాలీవుడ్ పిలిచినా... ‘మిస్ యూనివర్స్’ పోటీల కోసం అవకాశాలను పక్కన పెట్టింది. 2012లో ‘ఐయామ్ షి- మిస్ యూనివర్స్ ఇండియా’ టైటిల్‌తో పాటు ‘మిస్ ఫొటోజనిక్’ అవార్డు కూడా ఊర్వశి గెలుచుకుంది. అయితే అందుకు తగిన వయసు లేకపోవడంవల్ల ఆ కిరీటాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
అయితే ఊర్వశి పట్టు విడవలేదు. 2015లో పోటీపడి విజేతగా నిలిచింది. అదే సంవత్సరం భారత్ తరుఫున ‘మిస్ యూనివర్స్’కు పోటీ పడింది. దీనికి ముందే... అంటే 2013లో మరోసారి బాలీవుడ్ ఊర్వశి తలుపు తట్టింది. సన్నీడియోల్ పక్కన ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో ఓకే చెప్పింది. అలా ‘సింగ్ సాబ్ ద గ్రేట్’ ద్వారా వెండితెరకు పరిచయమైన ఆమె... ఇక అప్పటి నుంచి ఖాళీగా ఉన్నది లేదు. వెంటనే ‘యోయో హనీసింగ్’ ఇంటర్నేషనల్ ఆల్బమ్ ‘లవ్ డోస్’లో ఆడి పాడింది. ఒక్క హిందీ చిత్రాలకే పరిమితం కాకుండా... దక్షిణాది నుంచి వచ్చిన ఆఫర్లకూ ఓకే చెప్పింది. ఇప్పటికి అన్నీ కలిపి ఓ ఇరవై చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇవి కాకుండా ఎన్నో ప్రముఖ బ్రాండ్ల యాడ్ షూటింగ్‌లతో ఎంతో బిజీ అయిపోయింది.
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో పుట్టిన ఊర్వశి సొంత పట్టణం కోట్‌ద్వార్. అక్కడి ‘జోసెఫ్స్ కాన్వెంట్’లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె... ఢిల్లీ ‘గార్గీ కాలేజీ’ నుంచి డిగ్రీ పట్టా పొందింది. ‘హేట్ స్టోరీ-4’లో విభిన్నమైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్న ఈ భామ... ‘వాల్తేరు వీరయ్య’తో ప్రత్యేక పాటల తారగా తెలుగులో అవకాశాలు పట్టేస్తోంది. మోడల్‌గా గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టి... నటిగా వరుస అవకాశాలు దక్కించుకొంటున్న ఊర్వశిని చూడగానే పాలరాతి శిల్పం గుర్తుకువస్తుంది. ఇది ఆమె అభిమానుల మాట. గమ్మత్తయిన చూపు... మైమరిపించే రూపు... మేని మెరుపు... పదిహేనేళ్ల కిందట కెరీర్ ఆరంభంలో ఎంతలా ఆకర్షణీయంగా కనిపించిందో... ఇప్పుడూ అంతే అందంగా... సౌందర్య రాశిలా అలరిస్తోంది. ‘ఏమిటి మీ రహస్యం’ అని అడిగితే... ‘ఆహార నియమాలే నన్ను ఇంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుతున్నాయి’ అంటుంది ఊర్వశి. ఆమె పాటించే ఆహార నియమాలు, చేసే వ్యాయామాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి.
వర్కవుట్ ఇలా...
ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టిన ప్రతిసారీ విభిన్నమైన లుక్స్‌తో ఆశ్చర్యపరుస్తుంది ఊర్వశి. ఆమె శరీరాకృతికి తగిన డ్రెస్సింగ్‌తో... ఎప్పటికప్పుడు ట్రెండీ ఫ్యాషన్ దుస్తుల్లో ఆహా అనిపిస్తుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా... ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ వర్కవుట్ వీడియోలు అప్‌లోడ్ చేస్తూనే ఉంటుంది. దానిద్వారా వ్యాయామాన్ని తమ జీవనశైలిలో భాగం చేసుకొనే దిశగా అభిమానుల్లో ప్రేరణ కలిగిస్తుంది. ఊర్వశికి ఇన్‌స్టాలో డెబ్భై లక్షల మందికి పైగా ఫాలోవర్స్. ఏ పోస్టు పెట్టినా క్షణాల్లో లక్షల్లో లైక్‌లు వచ్చి పడతాయి. వారానికి కనీసం మూడు రోజులు జిమ్‌కు వెళ్లే ఊర్వశి వ్యాయామాల్లో యోగా, నాట్యం కూడా మిళితమై ఉంటాయి.
ఉదయం లేవగానే యోగా, ప్రాణాయామం. యోగావల్ల కండరాలు దృఢంగా మారతాయి. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ధ్యానంతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కుదురుతాయి. ఒత్తిడి మాయమవుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరానికి కావల్సినంత ప్రాణవాయువు అందుతుంది.
20 నిమిషాలపాటు ట్రెడ్‌మిల్ తదితర కార్డియో వ్యాయామాలు
స్ర్టెంత్ ట్రైనింగ్‌లో బెంచ్ ప్రెస్, డంబెల్ ప్రెస్, వెయిట్‌లిఫ్టింగ్, పిలెట్స్, క్రంచెస్, ప్లాంక్స్, పుషప్స్, స్క్వాట్స్, లంగెస్
అదనపు కేలరీలు కరగడానికి డ్యాన్స్
ఇదీ మెనూ...
ప్రొటీన్స్, కార్బొహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్‌తో కూడిన సమతుల ఆహారం తీసుకొంటుంది ఊర్వశి. క్రమం తప్పని వ్యాయామంతో పాటు ఆహార నియమాలను కచ్చితంగా పాటిస్తుంది. ప్రాసె్‌సడ్, జంక్ ఫుడ్స్, షుగర్ ముట్టుకోదు. ఆమె మెనూలో అధికశాతం గుడ్లు, చికెన్, ఫిష్, తాజా కూరగాయలు, పండ్లు, నట్స్ ఉంటాయి. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా... ఆమెకు ఆయుర్వేదంలో సూచించిన ఆహారం అందిస్తారు. ఎంతోమంది బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్లకు న్యూట్రిషనిస్టుగా వ్యవహరిస్తున్నారు శ్వేతా. ‘మూడేళ్ల కిందట మొదటిసారి ఊర్వశిని కలిశాను. తన చర్మం, శిరోజాల ఆరోగ్యం గురించి అప్పట్లో తను ఆందోళన పడుతుండేది. నిజానికి తనది చక్కని చర్మం. అంతకంటే ఆరోగ్యకరమైన జుట్టు. అధిక సమయం ఎండలో తిరగడం, కెమికల్ ట్రీట్‌మెంట్ల వల్ల అవి సహజత్వం కోల్పోయాయి. యాంటీఆక్సిడెంట్స్, సరైన హైడ్రేషన్, డీటాక్సిఫయింగ్ జ్యూస్‌లతో కూడిన ఆయుర్వేద ఆధారిత డైట్ ప్లాన్ సూచించాను’ అని ఓ ఇంటర్వ్యూలో శ్వేత వెల్లడించారు. ఊర్వశి మెనూలో ప్రధానంగా మిల్లెట్స్, నెయ్యి, పండ్ల రసాలు ఉంటాయి.
వర్కవుట్ తరువాత తీసుకొనే బ్రేక్‌ఫా్‌స్టలో అత్యధిక పోషకాలు, శక్తినిచ్చే ఆహారం ఉండేలా డిజైన్ చేశారు శ్వేత. గుడ్లు, ప్రొటీన్ షేక్ లేదంటే మొలకెత్తిన విత్తనాలతో పోహా. ఏదైనా సరే... ఇంటి నుంచి వచ్చిన ఆహారమే తీసుకొంటుంది ఊర్వశి.
భోజనానికి ముందు కొద్దిగా పండ్లు. ద్రాక్ష, స్ర్టాబెర్రీ ఊర్వశికి ఇష్టమైన పండ్లు.
మధ్యాహ్న భోజనంలో ఇంటి నుంచి వచ్చిన రోటీ, సబ్జీ, గ్రీన్ సలాడ్.
రాత్రి భోజనం మాంసకృత్తులతో నిండి ఉంటుంది. దూది ముథియాస్ (గుజరాతీ వంటకం) లేదా పనీర్‌తో గ్రిల్‌డ్ చికెన్ లేదా ఫిష్.
ఊర్వశికి పరాఠా ఎంతో ఇష్టం. అయితే మైదా, గోధుమ పిండి కాకుండా మిల్లెట్స్‌తో చేసిన పరాఠాలను ఊర్వశికి పరిచయం చేసింది శ్వేత. అలాగే అన్నానికి బదులు కాలీఫ్లవర్ రైస్‌ను ఉపయోగిస్తుంది. ఇవి కాకుండా కొరియాండర్ జ్యూస్ వారానికి ఒకసారి. ఇది డీటాక్సిఫై చేస్తుంది.
Updated Date - Jan 18 , 2024 | 03:33 AM