మురిపించే ముత్యాల సరాలు
ABN, Publish Date - Nov 25 , 2024 | 04:09 AM
మహిళలకు ఎన్ని రకాల నగలున్నా ముత్యాలపై ఉండే ఇష్టం మాత్రం ప్రత్యేకం.
మహిళలకు ఎన్ని రకాల నగలున్నా ముత్యాలపై ఉండే ఇష్టం మాత్రం ప్రత్యేకం. సంప్రదాయకంగా కనిపిస్తూనే ట్రెండీగా ఆకట్టుకుంటాయి ముత్యాల నగలు. చీరలు, లెహంగాలు, డ్రెస్‌లపై అందంగా అమరి అతివల దర్పాన్ని పెంచుతాయి. ప్రతి మహిళ ఎంతో అపురూపంగా ఇష్టంగా ధరించే ముత్యాల చెవిపోగుల వివరాలు మీకోసం.....
స్టడ్స్
పెద్ద సైజు తెల్లని ముత్యం అమర్చిన బంగారు లేదా ప్లాటినం దిద్దులు మధ్య వయసు మహిళలకు చక్కగా నప్పుతాయి. ఒక ముత్యం చుట్టూ చిన్న చిన్న అమెరికన్ డైమండ్స్ లేదా చిన్న చిన్న ముత్యాలు చేర్చిన స్టడ్స్ లేటెస్ట్ ట్రెండ్.
హూప్స్
ఇవి రింగుల మాదిరి ఉంటాయి. అన్ని సైజుల్లో లభ్యమవుతాయి. బంగారు రింగుల మీద వివిధ సైజుల ముత్యాలు కలగలిపి పొదిగిన పెర్ల్ హూప్స్ ఎంతో అందంగా ఉంటాయి. ఇవి ఏ వయసు మహిళలకైనా సూటవుతాయి. పూర్తిగా ముత్యాలతోనే తయారు చేసిన హూప్స్ అమ్మాయిలకు మోడ్రన్ డ్రెస్‌ల మీద ట్రెండీ లుక్‌నిస్తాయి.
జుంకాలు
పెద్ద బుట్టల మీద రకరకాల ముత్యాలు పొదిగిన అందమైన జుంకాలు అమ్మాయిలకు అద్భుతంగా ఉంటాయి. ముఖం ఏ తీరులో ఉన్నా ఈ జుంకాలు చక్కగా నప్పుతాయి. ముత్యాలను గుత్తులుగా గుండ్రంగా పేర్చి పైన పెద్ద ముత్యాన్ని స్టడ్‌గా జతచేసినజుంకాలను మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. జుంకాలకు వ్రేలాడే ముత్యాలు అదనపు సొగసునిస్తాయి.
చాంద్‌బాలియన్లు
గుండ్రని లేదా అర్థచంద్రాకారపు చాంద్‌బాలియన్లకు ముత్యాలు జతచేస్తే ఆ అందమే వేరు. ఇవి చీరలమీద, లెహంగాల మీద గ్రాండ్ లుక్‌నిస్తాయి. చాంద్‌బాలీలకు వాటి ఆకారాన్ని అనుసరించి కొన్ని వరసల్లో ముత్యాలు పొదిగి మరికొన్ని చిన్న ముత్యాలను వ్రేలాడేలా రూపొందిస్తున్నారు. ఇవి ఏ ఛాయలో ఉన్నవారికైనా చక్కగా నప్పుతాయి.
Updated Date - Nov 25 , 2024 | 04:09 AM