ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కూలీ కుంచె... దేశాలు దాటింది లాడో బాయ్‌...

ABN, Publish Date - Mar 25 , 2024 | 12:40 AM

మాది మధ్యప్రదేశ్‌లోని ఝబువా దగ్గరలోని బడీ బావడీ అనే చిన్న గ్రామం. రెక్కాడితే కాని డొక్కాడని భిల్ల గిరిజన కుటుంబం.

ఒకప్పుడు అయిదు రూపాయల కూలీ...

ఇప్పుడు ఆమె పెయింటింగ్స్‌ పికాసో చిత్రాల సరసన సగర్వంగా నిలిచాయి.

పిథోరా చిత్రకళకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన మహిళల్లో ఆమె ఒకరు.

సంప్రదాయానికి ఆధునికతను మేళవించి వర్ణవిన్యాసం చేస్తున్న లాడో బాయ్‌ కథ ఇది...

‘‘మాది మధ్యప్రదేశ్‌లోని ఝబువా దగ్గరలోని బడీ బావడీ అనే చిన్న గ్రామం. రెక్కాడితే కాని డొక్కాడని భిల్ల గిరిజన కుటుంబం. రాయడం, చదవడం వచ్చు... అదే నా చదువు. బొమ్మలు వెయ్యడంలో నైపుణ్యం మాత్రం చిన్న వయసునుంచే వచ్చింది. దానికి కారణం... చిత్రలేఖనం మా జీవితాలతో విడదీయలేని భాగం. నేను 1954లో పుట్టాను. అప్పట్లో మా గ్రామంలో రంగులు, బ్రెష్‌లు ఉండేవి కావు. చెక్కని కుంచెగా రూపొందించుకొనేవాళ్ళం. బొగ్గు, ఎర్ర మట్టి, ఆకులు, బియ్యపు పిండితో రకరకాల రంగులు తయారు చేసేవాళ్ళం. పెళ్ళిళ్ళయినా, పండుగలైనా ఇంటి గోడల మీద బొమ్మలు వేయడం, వస్త్రాల మీద వేసిన చిత్రాలను తుమ్మ జిగురుతో గోడలపై అంటించడం మా ప్రాంతంలో సర్వసాధారణం. ఈ కళలో మా నాయనమ్మ దగ్గర ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను. నాకు పన్నెండేళ్ళు వచ్చేసరికి ఇంటి పరిస్థితి మరింత దిగజారింది. గత్యంతరం లేక ఏదైనా పని చూసుకుందామని మా అన్నయ్య, వదిన భోపాల్‌కు వలస వచ్చారు. వాళ్ళ వెనుకే నేను కూడా. కూరగాయలు అమ్మడం, అడవి నుంచి కట్టెలు తెచ్చి విక్రయించడం... ఇలా చాలా పనులు చేశాం. చివరకు ఒక చోట భవన నిర్మాణ కూలీలుగా కుదిరాం. ఆ కట్టడం... భోపాల్‌లో సుప్రసిద్ధమైన భారతీయ భవన్‌. సకల కళలకూ కేంద్రంగా రూపుదిద్దుకున్న భవన నిర్మాణంలో ప్రముఖ కళాకారుడు, రచయిత అయిన జగదీశ్‌ స్వామినాథన్‌ కీలకపాత్ర పోషించారు. మా అన్నయ్యకు ఇరవై రూపాయలు, మా వదినకు పది రూపాయలు, నాకు అయిదు రూపాయలు కూలీగా దొరికేది.

స్వామినాథన్‌ ప్రోత్సాహంతో...

ఊరుకాని ఆ ఊర్లో నాకు ఏమీ తోచేది కాదు. ఖాళీ సమయాల్లో కాగితాలు, పెన్సిల్‌ తీసుకొని బొమ్మలేస్తూ ఉండేదాన్ని. అది ఒక రోజు స్వామినాథన్‌ కంట పడింది. ఆయన నా వివరాలు తెలుసుకున్నారు. మర్నాడు కొన్ని కాగితాలు, రంగులు తీసుకొచ్చి ఇచ్చారు. ‘‘నీకు తోచిన బొమ్మలు వెయ్యి. బాగా వెయ్యి’’ అని ప్రోత్సహించారు. నా చిత్రాలను పరిశీలించి, సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ‘‘నీలో మంచి నైపుణ్యం ఉంది. మరింత సాధన చేస్తే మంచి చిత్రకారిణివి అవుతావు’’ అని చెప్పేవారు. కొన్నాళ్ళకు భారతీయ భవన్‌ నిర్మాణం పూర్తయింది. వేరే చోట పనిలో చేరాం. అప్పుడు కూడా బొమ్మలు వెయ్యడం, స్వామినాథన్‌కు చూపించడం కొనసాగించాను. కొన్నాళ్ళ తరువాత భోపాల్‌లోని ఆదివాసీ లోక్‌ కళా అకాడమీలో ఆయన నన్ను చేర్పించారు. అక్కడ నాకు భూరీబాయ్‌ పరిచయం అయ్యారు. గిరిజనులకు ప్రత్యేకమైన పిథోరా కళాకృతులను కాగితం మీద గీసి, ప్రాచుర్యంలోకి తెచ్చిన మొదటి వ్యక్తి ఆమె. పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. భూరీ సహచర్యం నాకు చిత్రకళలో కొత్త విషయాలెన్నో నేర్పింది. మా భిల్ల గిరిజనుల సంప్రదాయ రీతి అయిన పిథోరా చిత్ర కళ మీదే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాను. నా చిత్రాలతో మనదేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఎగ్జిబిషన్లు నిర్వహించాను. ఈ ఏడాది జనవరి 20 నుంచి మార్చి మూడు వరకూ ఇటలీ మిలాన్‌ నగరంలోని పలాజ్జినా ట్రోంబినీ మ్యూజియంలో విశ్వవిఖ్యాత చిత్రకారులైన పికాసో తదితరుల చిత్రాల సరసన పద్మశ్రీ జోధియాబాయ్‌, పద్మశ్రీ భూరీ బాయ్‌లతో పాటు నా పెయింటింగ్స్‌ కూడా చోటు చేసుకోవడం మాటల్లో వివరించలేని అనుభూతి. మన దేశ గిరిజన చిత్రకారులకు తొలిసారిగా దక్కిన అరుదైన గౌరవం ఇది.

ఎన్నడూ ఊహించలేదు...

నా వ్యక్తిగత విషయాలకు వస్తే... మా భిల్ల గిరిజన తెగకు చెందిన పెయింటర్‌ తెరూ తహెద్‌ను వివాహం చేసుకున్నాను. కొన్నేళ్ళ క్రితం ఆయన మరణించారు. అది నాకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. నలుగురు పిల్లల భారం నా మీద పడింది. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అయినప్పటికీ ధైర్యంతో ముందుకు సాగాను. నా నలుగురు పిల్లలకు, కోడలికి కూడా ఈ కళను నేర్పాను. పిథోరా చిత్రకళకు కొత్త గుర్తింపును, అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన చిత్రకారిణుల్లో ఒకరిగా నన్ను పలు సంస్థలు గుర్తించి పురస్కారాలను అందజేశాయి, సత్కారాలు చేశాయి. పెద్దగా చదువుకోని, సాధారణ మహిళనైన నాకు ఎందరో ప్రముఖుల నుంచి ఇన్ని ప్రశంసలు దక్కుతాయని, అయిదు రూపాయల కూలీగా మొదలై లక్షల్లో అమ్ముడయ్యే పెయింటింగ్స్‌ వేసే స్థాయికి చేరుతాననీ ఏమాత్రం ఊహించలేదు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలుసుకోవడం నేను ఎన్నడూ మరచిపోలేని అనుభవం. ఒకప్పుడు ఇల్లు వదిలి వెళ్ళాలంటే భయపడేదాన్ని. ఇప్పుడు ప్రపంచమంతా ఒంటరిగానే వెళ్తున్నాను. ప్రకృతి, ఆధ్యాత్మికత, చుట్టూ ఉన్న జీవజాలం... ఇవన్నీ గిరిజనుల జీవితాల్లో, కళల్లో అంతర్భాగం. సంప్రదాయికమైన పిథోరా చిత్ర శైలిలో ఆధునికమైన, సమకాలీనమైన సామాజిక అంశాలను చిత్రించడం నాకు ఇష్టం. నేను గీసే చిత్రాల్లో జంతుప్రపంచం, భిల్లుల ఆచార వ్యవహారాలు, పండుగలు ప్రధానంగా ఉంటాయి. చిన్నప్పుడు మా పెద్దల నుంచి విన్న జానపద కథలను కూడా వివరంగా పెయింటింగ్స్‌ వేశాను. నాకు దైవభక్తి ఎక్కువ. నేను గీసే చిత్రాలు దైవానికి ప్రీతిపాత్రంగా ఉండాలనేది నా తపన. అందుకే పెయింటింగ్స్‌ వేసేటప్పుడు చాలా నిష్టగా ఉంటాను. నా చిత్రాల ద్వారా పిథోరా కళనూ, సంస్కృతి సంప్రదాయాలను, భిల్లుల జీవన శైలిపై అవగాహనను భావి తరాలకు అందించాలనేది నా కోరిక.’’

Updated Date - Mar 25 , 2024 | 12:40 AM

Advertising
Advertising