Fashion ; కలంకారికి కొత్త అర్థం!
ABN, Publish Date - Jan 30 , 2024 | 11:25 PM
తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాళహస్తి, పెడన దగ్గర ఎక్కువగా కలంకారి పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. కలంకారి బట్టల తయారీలో ఎక్కువగా నీళ్ల ప్రవాహాల అవసరం ఉంటుంది. అందుకే ఈ పరిశ్రమ గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. అంతే కాకుండా ఒక కలంకారి
తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాళహస్తి, పెడన దగ్గర ఎక్కువగా కలంకారి పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. కలంకారి బట్టల తయారీలో ఎక్కువగా నీళ్ల ప్రవాహాల అవసరం ఉంటుంది. అందుకే ఈ పరిశ్రమ గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. అంతే కాకుండా ఒక కలంకారి వస్త్రం తయారవ్వాలంటే సుమారు 45 రోజులు పడుతుంది. దీనివల్ల ఈ పరిశ్రమకు పరిమితులు ఎక్కువ. ‘‘ఇంతకు ముందు కేవలం కాటన్‌పైనే కలంకారి డిజైన్లు వేసేవారు. ఇప్పుడు తయారీ ప్రక్రియలో కొన్ని మార్పులు చేసి సిల్క్, హోసరీ వస్త్రాలపై డిజైన్లు వేయగలుగుతున్నాం’’ అంటారు కలంకారి వస్త్ర వాణిజ్యవేత్త మనోజ్ఞ. తాజాగా ఆమె మార్కెట్లో విడుదల చేసిన లెగ్గింగ్స్‌కు, రెడీ టూవేర్ జాకెట్స్‌కు విపరీతమైన డిమాండ్ వచ్చింది. దీనితో కేవలం చీరలు మాత్రమే కాకుండా చుడీదార్లు, కుర్తీలు, స్టోల్స్, దుపట్టాలు, దుప్పట్లు మొదలైనవి కూడా తయారు చేస్తున్నామంటున్నారు మనోజ్ఞ. మనకు ప్రకృతిలో దొరికే కరక్కాయ, జాజిఆకు, పసుపు వంటి సేంద్రియ పదార్థాలతో చేసే కలంకారి దుస్తుల తయారీ లైఫ్ సైకిల్‌ను ఆమె ‘నవ్య’కు వివరించారు.
కలంకారి బట్టల తయారీలో మొత్తం 16 స్టెప్స్ ఉంటాయి. దీనిలో ఏ ఒక్కటి తేడా వచ్చినా మొత్తం పాడైపోతుంది. అందువల్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
తయారీ ఇలా...
వీటిలో మొదటిది ఎంచుకున్న కోరా లేదా తెల్ల బట్టను గంజిపోయే వరకూ ఉతికి ఆరబెడతారు. ఇలా ఆరబెట్టిన బట్టను ముందుగా తయారుచేసుకున్న కరక్కాయ రసంలో నానబెడతారు. ఈ రసంలో కొద్దిగా పాలు కూడా కలుపుతారు. ఇలా నానబెట్టిన గుడ్డను ఎండలో ఆరబెడతారు. అందువల్ల చాలా సందర్భాలలో కలంకారి బట్టలు మొదటి సారి వేసుకున్నప్పుడు పాల వాసన వస్తూ ఉంటాయి. ఇలా ఆరబెట్టిన బట్టలపై బ్లాక్‌ల ద్వారా తొలి డిజైన్ వేస్తారు. ఈ బ్లాక్‌లను టీకు చెక్కతో నాలుగు ఇంచుల పొడవు, 9 ఇంచుల వెడల్పు ఉండేలా తయారుచేస్తారు. వీటిని ప్రత్యేకంగా తయారుచేసిన నూనెలలో సీజనింగ్ చేస్తారు. వీటిపై రకరకాల డిజైన్లను చెక్కుతారు. ఈ గుడ్డలపై ప్రకృతిసిద్ధమైన రంగుల డిజైన్లను వేసిన తర్వాత ఆ గుడ్డలను నీటి ప్రవాహం పారే ప్రాంతంలో తాడు కట్టుల మీద వదిలివేస్తారు. ఇలా గుడ్డ నానిన తర్వాత- దానిని పెద్ద పెద్ద రాగి బాండీలలో ఉడకపెడతారు. ఈ సమయంలో జాజి ఆకును తప్పనిసరిగా వాడతారు. దీని వల్ల రంగులు కాంతిమంతంగా తయారవుతాయి. ఆ తర్వాత దానిని సహజసిద్ధమైన ఎండలో ఆరబెడతారు. ఈ విధంగా తయారుచేసిన కలంకారీ గుడ్డలపై రంగులు ఎప్పటికీ నిలిచిఉంటాయి.
కలంకారీ బ్లాక్‌లపై చెక్కే డిజైన్లు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా ఈ బ్లాక్‌లను గుడ్డలపై అద్దేది మహిళలే! అందుకే కలంకారి పరిశ్రమలో 90 శాతం మంది మహిళలే ఉంటారు. కొన్ని పనులకు మాత్రమే పురుషులు కనిపిస్తారు. దీనిలో వాడే కరక్కాయ, జాజిఆకు వంటి వాటిని ఆదివాసులు అడవుల నుంచి సేకరించి తీసుకువస్తారు.
వేటితో రంగులు తయారుచేస్తారు?
దానిమ్మపొడి, ఎర్రకాసు (కిళ్లీల తయారీలో కూడా వాడతారు), అల్థరియన్, ఉల్లిపాయల పొట్టు, బంతిపువ్వుల రేకులు, బెల్లం, అడవుల్లో దొరికే కొన్ని రకాల వేళ్లు.
ఫ్రాక్స్
ఈ ఫ్రాక్‌లు పార్టీలకు వేసుకు వెళ్లటానికి బావుంటాయి. అదే సమయంలో డైలీ వేర్‌కు కూడా పనికొస్తాయి.
లెగ్గింగ్స్
లెగ్గింగ్స్ ఇప్పుడు మహిళల వార్డ్‌రోబ్‌లో ఒక ముఖ్య భాగమయిపోయాయి. కలంకారీ డిజైన్లలో హోసరీ మెటీరియల్ ద్వారా తయారుచేసే లెగ్గింగ్స్‌కు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది.
చీరలు
కాటన్, సిల్క్, కోటా సిల్క్ మొదలైన వాటితో తయారుచేసిన చీరలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఒకప్పుడు కలంకారీలో కాటన్ చీరలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు సిల్క్ చీరలు కూడా లభిస్తున్నాయి.
స్ర్టెచబుల్ జాకెట్లు
హోసరీ మెటీరియల్‌తో వీటిని తయారుచేస్తున్నారు. అన్ని వయసులవారూ వీటిని ధరించవచ్చు.
మనోజ్ఞ
మానవ్ కలంకారి
9666588111
Updated Date - Jan 30 , 2024 | 11:25 PM