ఎక్కువగా తింటే జీడిపప్పు ప్రమాదమే!
ABN, Publish Date - Jan 18 , 2024 | 03:21 AM
కోవిడ్ తర్వాత బలవర్థకమైన ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో అనేక మంది జీడిపప్పులను తినటం ప్రారంభించారు. అయితే ఈ జీడిపప్పు వల్ల కూడా అనేక రకాల దుష్పరిణామాలు ఉన్నాయని పౌష్టికాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోవిడ్ తర్వాత బలవర్థకమైన ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో అనేక మంది జీడిపప్పులను తినటం ప్రారంభించారు. అయితే ఈ జీడిపప్పు వల్ల కూడా అనేక రకాల దుష్పరిణామాలు ఉన్నాయని పౌష్టికాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలర్జీలు
కొందరికి జీడిపప్పు తింటే పడదు. చర్మంపై దద్దుర్లు వస్తాయి. కొందరికైతే కళ్లు తిరిగినట్లు అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ఆధారంగా చూస్తే- మొత్తం జనాభాలో 0.5 నుంచి ఒక శాతం మందికి జీడిపప్పు అలర్జీ ఉంది.
అజీర్తి
జీడిపప్పులో కొవ్వు, ఫైబర్‌లు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల అరుగుదల చాలా కష్టమవుతుంది. జీడిపప్పును ఎక్కువగా తింటే గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అజీర్తి చేస్తుంది.
బరువు పెరుగుతారు
ఒక గుప్పెడు జీడిపప్పులో 160 కేలరీలు ఉంటాయి. ప్రతి రోజు వీటిని ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. బరువు తగ్గాలనుకొనే వారు జీడిపప్పును తినటం పూర్తిగా మానేస్తే మంచిది.
బ్లడ్ సుగర్ పెరుగుతుంది
జీడిపప్పు గ్లైసిమిక్ ఇండెక్స్ విలువలు తక్కువే! దీని ప్రకారం చూస్తే- వీటిని తిన్న వెంటనే బ్లడ్ సుగర్ పెరగకూడదు. అయితే తాజాగా చేసిన అధ్యయనాలలో జీడిపప్పును తిన్న వెంటనే బ్లడ్‌సుగర్ పెరుగుతుందని తేలింది. అందువల్ల మధుమేహం ఉన్నవారు జీడిపప్పును ఎక్కువగా తినకూడదు.
ప్రమాదకరమైన తొక్క
తొక్క తీయని జీడిపప్పులో ఉరిషివోల్ అనే ఒక విష పదార్థం ఉంటుంది. అందువల్ల జీడిపప్పు తొక్క తగిలితే చర్మం ఎర్రబడుతుంది. దురద పెడుతుంది. అందువల్ల జీడిపప్పు తొక్కను వలిచేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి.
పచ్చివి తినవద్దు..
పచ్చి జీడిపప్పులో ఫైటిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థం కాల్షియం, ఐరన్, జింక్ మొదలైనవి శరీరంలోకి చేరకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అందువల్ల పచ్చి జీడిపప్పు తినటం మంచిది కాదు. నానబెట్టిన లేదా వేయించిన జీడిపప్పులో ఇది తక్కువగా ఉంటుంది. అందువల్ల వేయించిన లేదా నానబెట్టిన జీడిపప్పు తినటం మంచిది.
కిడ్నీ స్టోన్స్
జీడిపప్పులో ఆక్సోలేట్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఎక్కువగా చేరితే కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయి.
Updated Date - Jan 18 , 2024 | 03:21 AM