Inspiration : సాధికారమైన భవిష్యత్తు కోసం...
ABN, Publish Date - Dec 11 , 2024 | 05:06 AM
హర్షిత ప్రియదర్శిని వయసు చిన్నదే కానీ ఆశయం పెద్దది. పద్మశ్రీ పురస్కార గ్రహీత కమలా పూజారి స్ఫూర్తితో రెండువందలకు పైగా అరుదైన దేశీయ విత్తనాలను సేకరించి... ‘సీడ్‌బ్యాంక్’ను ఏర్పాటు చేసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ళ ఈ ఒడిశా అమ్మాయి సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతను,
హర్షిత ప్రియదర్శిని వయసు చిన్నదే కానీ ఆశయం పెద్దది. పద్మశ్రీ పురస్కార గ్రహీత కమలా పూజారి స్ఫూర్తితో రెండువందలకు పైగా అరుదైన దేశీయ విత్తనాలను సేకరించి... ‘సీడ్‌బ్యాంక్’ను ఏర్పాటు చేసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ళ ఈ ఒడిశా అమ్మాయి సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతను, అంతరించిపోతున్న ధాన్యాల పరిరక్షణ ఆవశ్యకతను ప్రచారం చేస్తోంది.
ఒడిశాలోని కొరాపుట్‌కు చెందిన హర్షిత ప్రియదర్శిని మహంతి జీవితం రెండేళ్ళ క్రితం వరకూ అందరు బడి పిల్లల్లాగానే ఆడుతూ, పాడుతూ గడిచింది. ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలో చేర్చడానికి హర్షితను తీసుకొని ఆమె తండ్రి బాలకృష్ణ మహంతి బయలుదేరారు. దారిలో కమలా పూజారి ఎదురయ్యారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి, దేశీయ విత్తనాలను పరిరక్షించినందుకు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న కమలను హర్షితకు ఆయన పరిచయం చేశారు. ‘‘దేశీయమైన ఎన్నో ధాన్యం రకాలు మాయమైపోతున్నాయి. వాటిని రాబోయే తరాల కోసం భద్రపరచవలసిన బాధ్యత పిల్లలదేనని కమలా పూజారి నాకు చెప్పారు. అంతేకాదు... నాలుగు రకాల వరి విత్తనాలను నాకు కానుకగా ఇచ్చారు. ఆమె మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆ తరువాత కొరాపుట్‌లోని గిరిజన మ్యూజియంలో... పర్యావరణ వైవిధ్యంపై ‘ఏక్తా’ అనే సంస్థ ఒక ఉత్సవం ఏర్పాటు చేసింది. అక్కడ అనేక రకాల ధాన్యం, కూరగాయలు, చిరుధాన్యాలను ప్రదర్శించారు. వాటిని చూశాక... అరుదైన విత్తనాలను సంరక్షించాలనే కోరిక నాలో మరింత బలపడింది’’ అని గుర్తు చేసుకుంటుంది హర్షిత. కమలాపూజారి మార్గదర్శకత్వంలోనే దేశీయ విత్తనాల సేకరణను ఆమె ప్రారంభించింది.
10 వేల మందిలో మొదటి స్థానం...
ఆ తరువాత... బడి లేని రోజుల్లో తండ్రి సాయంతో పొలాల్లోకి వెళ్ళడం, రైతులతో మాట్లాడడం, విత్తనాల గురించి తెలుసుకోవడం, అరుదైన వాటిని సేకరించడం ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ‘‘ఒక్కొక్క రకాన్ని సేకరిస్తున్నప్పుడు అంతులేని సంతోషం కలిగేది. వాటి ప్రత్యేకతల గురించి రైతులు చెబుతూ ఉంటే నమోదు చేస్తున్నప్పుడు... ఇతరులకు కూడా ఈ అంశం మీద ఆసక్తి పెంచితే మంచిదని భావించాను. ‘హర్షిత ప్రియదర్శిని సైన్స్ క్లబ్’ పేరిట ఒక సంస్థను, సీడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశాను. అప్పటి నుంచి నా పని ప్రణాళికాబద్ధంగా సాగుతూ వచ్చింది అని చెప్పింది హర్షిత. ప్రతి రకం విత్తనాన్ని 100 నుంచి 250 గ్రాముల వరకూ సేకరిస్తుంది. అంతకన్నా ఎక్కువ దొరికితే రైతులకు వాటిని ఉచితంగా పంచుతుంది. కిందటి ఏడాది 20మందికి, ఈ ఏడాది 50 మందికి విత్తనాలు అందించింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘ఐడియా యంగ్‌స్టర్స్’ అనే జాతీయ స్థాయి పోటీలో ఆమె పాల్గొంది. 12-17 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం, సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు ఆచరణలోకి తెచ్చేందుకు సాయపడడం ఈ పోటీల లక్ష్యం. పలు దశల్లో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సుమారు 10 వేలమంది పాల్గొన్న ఈ పోటీలో హర్షిత మొదటి స్థానంలో నిలిచింది. సేంద్రియ సాగు, సంప్రదాయ విత్తనాల ప్రాధాన్యం గురించి న్యాయమూర్తులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానాలు న్యాయమూర్తులను ఆకట్టుకున్నాయి. విజేతగా తనకు లభించిన రూ. రెండున్నర లక్షల నగదుతో విత్తన సంరక్షణ కోసం ఒక మూల నిధిని హర్షిత ఏర్పాటు చేసింది.
ఆ సదస్సుతో జాతీయ గుర్తింపు...
‘‘కిందటి ఏడాది సెప్టెంబర్‌లో రైతుల హక్కులపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు ప్రతినిధిగా హాజరై, వేదిక నుంచి నా అభిప్రాయాలను ఆహూతులతో పంచుకున్నాను. ఆ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ కుమార్తె, ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ను కలుసుకొనే అవకాశం అక్కడ దొరికింది. నేను చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకొని, వాటిని కొనసాగించాలని ప్రోత్సహించారు. ఆమె మాటలు నాలో ఎంతో ఉత్తేజాన్ని నింపాయి. అలాగే నా పేరు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ఆ సదస్సు దోహదపడింది’’ అని చెబుతోంది హర్షిత. ఢిల్లీలో జరిగిన ‘జి-20’ సదస్సు, భువనేశ్వర్‌లో నిర్వహించిన ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు’... ఇలా అనేక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్లో తన సేకరణలను ఆమె ప్రదర్శింది. హర్షిత కృషికి గుర్తింపుగా పారాదీప్ ఫాస్సేట్స్, ‘శిక్ష ఓ అనుస్థాన్’ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ‘కృషిక్ రత్న’ బిరుదుతో సత్కరించాయి. అలాగే ‘స్టూడెంట్ ఆఫ్ ఇండియా’ అవార్డును ‘వార్ ఇండియా’ సంస్థ నుంచి ‘జ్యూవెల్ ఆఫ్ ఇండియా’ పురస్కారాన్ని... ఇలా పలు గౌరవాలను ఆమె అందుకుంది.
వాటి ప్రాధాన్యతను వివరిస్తూ...
ఇప్పటివరకూ 180కి పైగా దేశీయ వరి విత్తనాలను, 80కి పైగా చిరుధాన్యాల రకాలను హర్షిత సేకరించింది. వాటిని గాజు, ప్లాస్టిక్ సీసాల్లో, మట్టి కుండలలో భద్రపరుస్తుంది, అవి పాడవకుండా ఉండడం కోసం వేప మాత్రలను ఉపయోగిస్తుంది. ‘‘వేప సహజమైన క్రిమి సంహారిణి. విత్తనాలు, ధాన్యం సంరక్షణ కోసం వందల ఏళ్ళ నుంచి వాటిని మన దేశంలో వినియోగిస్తున్నాం. అందుకే వాటిని వాడాలని నేను అందరికీ చెబుతున్నాను. అలాగే ఎక్కడికి వెళ్ళినా దేశీయమైన విత్తనాల ప్రాధాన్యాన్ని వివరిస్తున్నాను. అవి మన పరిస్థితులకు అనుకూలమైనవి. మన వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకోగలవు. వాటి సాగుకు నీటి అవసరం తక్కువ. అదే విధంగా వాటిలో పోషక విలువలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి దేశీయ విత్తనాలను సంరక్షించుకొనేలా రైతులను ప్రోత్సహించాలి. దీనివల్ల ప్రతి సీజన్‌లో విత్తనాలు కొనడానికి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రైతుల సాధికారమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుంది. అదే నా లక్ష్యం’’ అని చెబుతున్న హర్షితకు విత్తనాలతో పాటు విదేశీ కరెన్సీని, స్టాంపులను సేకరించడం కూడా హాబీ. 80 దేశాలకు చెందిన 2వేల నాణేలు, 40 దేశాలకు చెందిన 1,500కు పైగా స్టాంపులు ఆమె సేకరణలో ఉన్నాయి. తోటి విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఒక బృందంతో తను నివసించే బోయ్‌పరిగూడ పరిధిలోని అయిదు గ్రామాలను ఆమె తరచూ సందర్శించి, సేంద్రియ వ్యవసాయం గురించి రైతులకు వివరిస్తూ ఉంటుంది. ‘‘అరుదైన అనేక వరి, చిరుధాన్యాల విత్తనాలు నా సేకరణలో ఉన్నాయి. వాటిని సాగు చేసేందుకు రైతులకు సాయపడాలనేదే నా కోరిక’’ అంటున్న హర్షిత భవిష్యత్తులో వ్యవసాయ శాస్త్రవేత్త అవుతానంటోంది.
Updated Date - Dec 11 , 2024 | 05:06 AM