ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dussehra : చెడు లక్షణాలపై గెలుపే దసరా

ABN, Publish Date - Oct 11 , 2024 | 07:26 AM

దశకంఠుడైన రావణుణ్ణి శ్రీరాముడు సంహరించిన పర్వదినమే ‘దశ-హర’, ‘దశరా’ లేదా ‘దసరా’. ముల్లోకాలనూ జయించిన, తపస్సంపన్నుడైన రావణుడు ఒక్కసారైనా అంతర్ముఖుడై, తనలోని

దశకంఠుడైన రావణుణ్ణి శ్రీరాముడు సంహరించిన పర్వదినమే ‘దశ-హర’, ‘దశరా’ లేదా ‘దసరా’. ముల్లోకాలనూ జయించిన, తపస్సంపన్నుడైన రావణుడు ఒక్కసారైనా అంతర్ముఖుడై, తనలోని పరమాత్మను దర్శించి ఉంటే... బహుశా ఈ రోజు చరిత్ర రావణుణ్ణి మరో విధంగా స్మరించి ఉండేదేమో. ‘జీవన పరమార్థాన్ని గ్రహించకుండా, స్వార్థమనే సారథి నడిపే మనోరథం మీద విహరిస్తే చివరికి ప్రాప్తించేది అనర్థమే’ అని తెలిపేదే శ్రీ రామచంద్ర విజయోత్సవం. మదిలోని అనర్థాల కారణంగా రావణుడు దహనమై యుగాలు గడచినా... రావణకాష్టంలా అనర్థాలనేవి జీవాత్మను నేటికీ పలు విధాలుగా రగులుస్తూనే ఉన్నాయి. ఈ దశరా సందర్భంగా శ్రీరామచంద్రుడి విజయోత్సవంలోని అర్థ, అంతరార్థాలను స్మరించుకుందాం. ఆచార్యులు చూపిన అనర్థ నివృతి మార్గమేమిటో తెలుకుంటాం.

దసరా పండుగ వచ్చిందంటే రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసి, పండుగ చేసుకుంటాం. కారణం... మనకు హాని కలిగించేవాడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. ఇక లోకకంటకుడైన వాడి బాధలు భరించవలసిన అవసరం లేదు. త్రేతాయుగంలోని ప్రజలందరూ ఇలాగే భావించారు. ఆ తరువాత రామరాజ్యంలో సుఖశాంతులతో తులతూగారు. ఇంతలో ద్వాపరయుగం రానే వచ్చింది. సమస్య కూడా మళ్ళీ మొదటికే వచ్చింది. కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన దుష్టులని సంహరించడానికి ఈ సారి శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామమే చెయ్యాల్సి వచ్చింది. పాలన పగ్గాలు అప్పుడప్పుడే ధర్మపరాయణుల హస్తగతం అవుతున్న వేళ... కలియుగం రానే వచ్చింది. ధర్మం అధిక బలంతో విరాజిల్లే గత యుగాల్లోనే అసురుల ఉద్ధృతి అంతలా ఉంటే... ధర్మం ఒంటిపాదం మీద నడుస్తున్న ప్రస్తుత కలియుగం ఏ విధంగా ఉండబోతోంది? అసలు భగవంతుడు ప్రసాదించిన ఈ లోకం, శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లవలసిన ఈ లోకం, భగవంతుడే దిగివచ్చి ధర్మ సంస్థాపన చేస్తున్న ఈ లోకం... కాలక్రమంలో అసుర ప్రవృత్తితో ఎందుకు నిండిపోతోంది? ప్రతి యుగాంతంలో నరకాన్ని ఎందుకు తలపిస్తోంది?

ఈ భగవంతుడే భగవద్గీతలో...

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః

కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్‌

‘‘ఓ అర్జునా! కామం, క్రోధం, లోభం అనేవి మూడు నరకద్వారాలు. అవి ఆత్మ వినాశకరాలు. కాబట్టి బుద్ధిమంతుడైన ప్రతిమనుషుడు వాటిని త్యజించాలి’’ అంటూ ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అసుర ప్రవృత్తికి కారణాన్ని, దానికి పరిష్కారాన్ని ఈ శ్లోకంలో సూచించాడు. కామ, క్రోధ, లోభాలు మనల్ని బానిసలుగా చేసుకొని ఆడిస్తున్నాయి. అరిషడ్వర్గాలకు బానిస కావడమే... ముల్లోకాలను కనుసైగతో శాసించిన రావణుడి పతనానికి దారితీసింది. అతనికి రాముని ఘనతను మండోదరి వివరిస్తూ ‘‘కార్తవీర్యార్జునుడి చేతిలో మీరు ఒకసారి ఓడించి బందీ అయ్యారు. ఆ కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతుల్ని తన గొడ్డలితో ఖండించినవాడు పరశురాముడు, ఆ పరశురాముణ్ణి నిలువరించినవాడు శ్రీరాముడు. మిమల్మి తన తోకతో చుట్టి, సప్తసముద్రాల రుచి చూపించినవాడు వాలి. ఆ వాలిని ఒక్క బాణంతో పడగొట్టినవాడు శ్రీరాముడు. 14 వేల మంది ఖరదూషణుల్ని ఒక్క రాముడే చంపాడు. ఇన్ని తెలిసి కూడా సీతను అపహరించి, కోరి ఆపదను తెచ్చుకోవడం సమంజసమేనా?’’ అని హితవు చెప్పినా... అతని తలకెక్కలేదు.

శ్రీ రామచంద్ర విజయోత్సవాన్ని ఆచార్య శ్రీల ప్రభుపాదులవారు వివరిస్తూ ‘‘ఈ భౌతిక జగత్తులో రావణుడిలాంటి మహాబల సంపన్నులు, ఐశ్వర్యవంతులు ఉన్నప్పటికీ.... వారిది సురక్షితమైన స్థితికాదు. ఎందుకంటే వారు కూడా కర్మ బద్ధులే. తాము ప్రకృతి నియమాలకు పూర్తిగా ఆధీనులమనే సంగతి ఎన్నడూ మరువరాదు. తన మహోన్నత స్థితికి గర్వించి... ప్రకృతి నియమాలకు అతీతుడినని రావణుడిలా భావించడం ఎవరికీ తగదు’’ అని బోధించారు.

గోస్వామి తులసీదాసు ‘రామ చరిత మాన్‌స’లో శ్రీ సీతారామ కథ మధురిమను వర్ణిస్తూ...


‘‘సీతారామ చరిత అతి పావన్‌

మధుర సరసౌరతి మన భావన్‌

పుని పుని కితనే హో సునే సునాయే

ఫిర్‌ బీ ప్యాస్‌ భుజత్‌ న భుజాయే... పరమ పావనమైన సీతారామ చరితం అతి మధురమైనది, సరసమైనది, మనో భావనాతీతమైనది. సీతారామ చరితాన్ని విన్నవారికీ, వినిపించిన వారికీ... వాళ్ళు జన్మ జన్మల నుంచి ఆనందాన్వేషణకోసం తపించినా తీరని హృదయతాపం తీరుతుంది’’ అని తెలిపారు. దాహంతో ఉన్న వ్యక్తి ఒక్క నీటి బిందువుతో సంతృప్తి చెందనట్టే... తాత్కాలికమైన సుఖాలు ఆత్మకు నిజమైన సంతృప్తిని ఎన్నటికీ ఇవ్వలేవు. కేవలం రామనామం అనే చల్లని నీటిని సేవించినప్పుడే జీవాత్మ దాహం పరిపూర్ణంగా తీరుతుందనేది సకల పూర్వాచార్యుల ఉపదేశాల సారాంశం. ‘రామకథ’ అనే అమృతాన్ని సేవిస్తే... ‘భుజత న భుజాయే...’ కేవలం దాహాన్ని తీర్చడమే కాదు, ఇంకా ఇంకా వినాలనే దాహాన్ని కూడా పెంపొందిస్తుందని వివరించారు తులసీదాస్‌.

కలి కల్మష పరిహార మార్గం

ఇదివరకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు తను చూపిన పరిష్కారాన్ని తానే సరళీకృతం చేస్తూ శ్రీ చైతన్య మహాప్రభువుగా లోకంలో అవతరించారు. హరినామ సంకీర్తనామృతాన్ని లోకానికి అందించారు. ‘హరేర్నామైవ కేవలమ్‌, హర్నామైవ కేవలమ్‌, హరేర్నామైవ కేవలమ్‌..’ అంటూ కలియుగానికి శాస్త్రం నిర్దేశించిన హరినామమనే దివ్యౌషధాన్ని ప్రతిఒక్కరూ సేవించేలా రూపకల్పన చేశారు. ఆనాడు లోకంలో అనర్థాలను సృష్టించే రావణాదుల్ని రామబాణం దహించింది. నేడు మనలో అనర్థాలను సృష్టించే కామ, క్రోధ, లోభాదుల్ని రామనామమే దహించివేయగలదు.

దాహంతో ఉన్న వ్యక్తి ఒక్క నీటి బిందువుతో సంతృప్తి చెందనట్టే... తాత్కాలికమైన సుఖాలు ఆత్మకు నిజమైన సంతృప్తిని ఎన్నటికీ ఇవ్వలేవు. కేవలం రామనామం అనే చల్లని నీటిని సేవించినప్పుడే జీవాత్మ దాహం పరిపూర్ణంగా తీరుతుందనేది సకల పూర్వాచార్యుల ఉపదేశాల సారాంశం.

శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ

అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌,

హైదరాబాద్‌, 9396956984

Updated Date - Oct 12 , 2024 | 06:26 AM