త్వరలో యండమూరి అక్షరాలతో చిరంజీవి జీవితం
ABN, Publish Date - Jan 21 , 2024 | 05:43 AM
తెలుగుతెరపై నవలా నాయకుడు అంటే గుర్తొచ్చేపేరు అక్కినేని నాగేశ్వరరావు. అయితే.. ఆయనతోపాటు మరో నవాలానాయకుడున్నాడు ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఏఎన్నార్ తర్వాత ఎక్కువ నవలాచిత్రాల్లో నటించిన ఘనత
తెలుగుతెరపై నవలా నాయకుడు అంటే గుర్తొచ్చేపేరు అక్కినేని నాగేశ్వరరావు. అయితే.. ఆయనతోపాటు మరో నవాలానాయకుడున్నాడు ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఏఎన్నార్ తర్వాత ఎక్కువ నవలాచిత్రాల్లో నటించిన ఘనత చిరంజీవిదే. ఆయన నటించిన ఛాలెంజ్, అభిలాష, మరణమృదంగం, రాక్షసుడు, రుద్రనేత్ర, రక్తసింధూరం.. ఇవన్నీ నవలా చిత్రాలే కావడం విశేషం. పైగా ఇవన్నీ రాసింది ఒక్కరే ఆయనే యండమూరి వీరేంద్రనాథ్. చిరంజీవి అభ్యున్నతిలో యండమూరి పాత్రను తక్కువ చేసి చూడలేం. యండమూరి జీవిత కథలను నవలలుగా రాయడంలో దిట్ట. ఇటీవల ‘మేథా స్పోకెన్ ఇంగ్లిష్’ వ్యవస్థాపకుడైన చిరంజీవి జీవిత కథను నవలగా రాసి పలువురి ప్రశంసలందుకున్నారు యండమూరి. త్వరలో మెగాస్టార్ చిరంజీవి జీవితకథను కూడా ఆయన రాయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే ప్రకటించారు. వైజాగ్‌లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిర్వహించిన ఎన్టీయార్, ఏఎన్నార్‌ల సంస్మరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సత్కారగ్రహీత అయిన యండమూరి గురించి చిరంజీవి ప్రస్తావిస్తూ.. ‘యండమూరి నవలలే నన్ను స్టార్‌ని చేశాయి. ఎన్నో గొప్ప నవలలు రాసిన ఆయన.. త్వరలో నా బయోగ్రఫీ కూడా రాయనున్నారని చెప్పడానికి అనందిస్తున్నాను’ అని తెలిపారు. నిజానికి ఓ నవలకు కావల్సినంత ముడిసరుకు చిరంజీవి కథలో కావల్సినంత ఉంది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం తన విద్వత్తుతో శిఖరాగ్రాన్ని ముద్దాడిన చిరంజీవి జీవితం యండమూరి అక్షరాలతో రూపొందితే అది నిజంగా భావితరాలు చదవాల్సిన పుస్తకమే అవుతుందని చెప్పక తప్పదు.
Updated Date - Jan 21 , 2024 | 05:43 AM