ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మేం ఎవరికీ తీసిపోం

ABN, Publish Date - Nov 06 , 2024 | 06:13 AM

ఆమెది పుట్టుకతో వెంట తెచ్చుకున్న అంధత్వం కాదు. బడి ఈడు వరకూ మెరుగ్గా ఉన్న కంటిచూపు క్రమేపీ తగ్గుతూ, అంతిమంగా అంధత్వానికి దారి తీసింది. కానీ ఆ పరిస్థితికి కుంగిపోకుండా గాయనిగా ఎదుగుతూనే, సివిల్‌ సర్వెంట్‌గా

ఆమెది పుట్టుకతో వెంట తెచ్చుకున్న అంధత్వం కాదు. బడి ఈడు వరకూ మెరుగ్గా

ఉన్న కంటిచూపు క్రమేపీ తగ్గుతూ, అంతిమంగా అంధత్వానికి దారి తీసింది.

కానీ ఆ పరిస్థితికి కుంగిపోకుండా గాయనిగా ఎదుగుతూనే, సివిల్‌ సర్వెంట్‌గా

ప్రజలకు సేవలందించాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకుంది హైదరాబాద్‌కు చెందిన

23 ఏళ్ల పొరాల మౌనిక. ఆమె ‘నవ్య’తో పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు...

‘‘భగవంతుడు మన దగ్గరి నుంచి దేన్నైనా తీసేస్తే, అంతకు మించిన ఉత్తమమైనదేదో తిరిగిస్తాడని అర్థం. కాబట్టి ఆ బెస్ట్‌ కోసమే మనం ప్రయత్నించాలి. దాన్నే మన లక్ష్యం చేసుకోవాలి. పుట్టుకతోనే అంధత్వాన్ని వెంటబెట్టుకు రావడం వేరు. క్రమేపీ చూపు కోల్పోయి అంధత్వానికి చేరుకోవడం వేరు. నా విషయంలో అదే జరిగింది. అయినా నేనెప్పుడూ కుంగిపోలేదు. మరింత మెరుగ్గా, చూపున్న పిల్లల కంటే సమర్థంగా, ఉన్నతంగా ఎదగడం కోసం నాలోని నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవడం చిన్నప్పటి నుంచే మొదలుపెట్టాను. పుట్టుకతో నా కంటి చూపు అందరు పిల్లల్లాగే మెరుగ్గానే ఉండేది. బడికి కూడా వెళ్తూ ఉండేదాన్ని. కానీ క్రమేపీ చూపు తగ్గుతూ ఉండడంతో, అమ్మా నాన్నా నన్ను స్థానికంగా కంటి వైద్యులకు చూపించారు. ఎల్వీ ప్రసాద్‌, సరోజినీ దేవి కంటి ఆస్పత్తులకు కూడా తీసుకువెళ్లారు. చూపు మెరుగు కోసం చేసిన మొదటి సర్జరీ విఫలమైపోయింది. విదేశీ వైద్యులు చేసిన రెండో సర్జరీ ఫలితాన్నిచ్చి పదో తరగతి వరకూ కొంతమేరకు చూడగలుగుతూ, నా పనులు నేను చేసుకోగలిగేదాన్ని. అలాగని నేను సాధారణ బడుల్లో చదువుకోలేదు. యుకెజి వరకూ సాధారణ బడిలో చదివినా, పుస్తకాలు చదవడం వల్ల, కంటిచూపు ఇంకా వేగంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో ఒకటో తరగతి నుంచి బ్రెయిలీలో చదువు కొనసాగించాను. పదో తరగతి నుంచి చూపు మరింత దిగజారుతూ, అంతిమంగా అంధత్వానికి దారి తీసింది. నాకున్నది గ్లాకోమా సమస్య కాబట్టి పెరిగే వయసుతో పాటు చూపు తగ్గి అంతిమంగా అంధత్వం వచ్చేస్తుందనే విషయాన్ని నేను అర్థం చేసుకుని మానసికంగా సిద్ధపడిపోయాను. అలా ఇంటర్‌ వరకూ బ్రెయిలీలోనే చదివి, డిగ్రీలో అడుగు పెట్టిన తర్వాత ఉస్మానియా వెబ్‌సైట్‌ ఆధారంగా చదువును కొనసాగించాను. ప్రస్తుతం ఎమ్‌బిఎ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను.

అమ్మానాన్నల ప్రోత్సాహంతో...

ఒకటో తరగతిలో మొదటిసారిగా బ్లైండ్‌ స్కూల్‌కు వెళ్తున్నప్పుడు, అమ్మ నన్ను చూసి విపరీతంగా ఏడ్చింది. అప్పటివరకూ సాధారణ బడికి వెళ్లిన నేను అంధులైన పిల్లలతో కలిసి అంధ పాఠశాలకు వెళ్లడం అమ్మ తట్టుకోలేకపోయింది. నేను కూడా అంధ పిల్లల్లా ఉన్న చోటికే పరిమితమైపోతానేమోనని అమ్మ భయపడింది. కానీ ఎదుగుతున్నకొద్దీ అవన్నీ అర్థం లేని భయాలని ఆమె గ్రహించింది. ఒకవేళ ఎప్పుడైనా కాస్త వెనకబడినట్టు కనిపిస్తే, ‘సాధారణ పిల్లల్లాగే నువ్వు కూడా అన్నీ చేయగలుగుతావు’ అంటూ అమ్మానాన్నలు నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు. వాళ్లు నన్నెప్పుడూ ఒక అంధురాలిగా పరిగణించలేదు.


క్రికెటర్‌గా, కబడ్డీ ప్లేయర్‌గా...

అంధత్వం ఉంది కాబట్టి నేను నా బాల్యాన్ని ఎంజాయ్‌ చేయలేకపోయానని అనుకుంటే పొరపాటు. నేను అంధులైన పిల్లలతోనే కలిసి పెరిగాను. మేమందరం సాధారణ పిల్లలతో సమానంగా చురుగ్గా అన్ని క్రీడల్లో పాల్గొనేవాళ్లం. ప్రత్యేకించి నేను క్రికెట్‌ బాగా ఆడేదాన్ని. తెలంగాణా బ్లైండ్‌ విమెన్‌ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఉండేదాన్ని. నేను జాతీయ కబడ్డీ ప్లేయర్‌ను కూడా! అంధులమైనంత మాత్రాన మేం సాధారణ పిల్లలకు ఏమాత్రం తీసిపోము. నిజానికి వాళ్లకంటే ఇంకాస్త మెరుగ్గా ఆడతామనే అనుకోవచ్చు. ఎందుకంటే చూపున్న వాళ్లు చెవులను అంతగా ఉపయోగించరు. అంధులు విషయాలను త్వరగా గ్రహిస్తారు అని అంటూ ఉంటారు. కానీ నిజానికి ఐక్యు అందరికీ సమానంగానే ఉంటుంది. అయితే మాకు కళ్లు కనిపించవు కాబట్టి వినికిడి శక్తి మీద ఎక్కువగా ఆధారపడతాం. వినికిడి పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటాం! వినికిడి శక్తితో పరిసరాలు, పనులు, నైపుణ్యాల మీద పట్టు పెంచుకోగలుగుతాం!’’

యువతకు చదువుతో పాటు వినోదం కూడా తప్పనిసరి. అయితే ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం వినోదాన్ని ఎంచుకున్నా, దానికీ పరిమితి ఉండాలి. ఎంత చదివినా, ఎంత ఎదిగినా వినోదం పరిమితంగానే ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాం!

మాది ఖమ్మం. నా చదువు కోసం చిన్నప్పుడే హైదరాబాద్‌ వచ్చేసి, ఇక్కడే స్థిరపడిపోయాం. నాన్న కొండలరావు, కారు నడుపుతారు. అమ్మ మాధవి, గృహిణి. సంగీతంలో అమ్మ నన్ను ప్రోత్సహిస్తే, నాన్న నన్ను చదువులో ప్రోత్సహించారు. నా కాళ్ల మీద నేను నిలబడి, ఎవరి మీదా ఆధారపడకుండా స్వతంత్రంగా బతకాలన్నది అమ్మానాన్నల ఆకాంక్ష. ఎదుటివాళ్లకు సహాయపడేలా ఎదగాలనీ, చేయి చాపే పరిస్థితి ఉండకూడదనీ నాన్న అంటూ ఉంటారు. ప్రస్తుతం నేను సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాను. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా ఎదగాలన్నది నా లక్ష్యం.

పాటలు పాడే అభిరుచి చిన్నతనంలోనే ఏర్పడింది. నా ఆసక్తిని గ్రహించిన అమ్మ నన్ను వెంటబెట్టుకుని మ్యూజిక్‌ క్లాస్‌లకు తీసుకువెళ్తూ ఉండేది. ప్రతిమ శశిధర్‌, కొమండూరి రామాచారి గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాను. 2022లో తెలుగు ఇండియన్‌ ఐడిల్‌ సీజన్‌ వన్‌లో పాల్గొని, థియేటర్‌ లెవల్‌ వరకూ చేరుకోగలిగాను. ప్రస్తుతం ప్రతి రోజూ సంగీతం సాధన చేస్తూ ఉంటాను. పాటలు వింటూ, పాడుతూ వేర్వేరు జోనర్స్‌ ప్రయత్నిస్తూ ఉంటాను.

గోగుమళ్ల కవిత

Updated Date - Nov 06 , 2024 | 06:13 AM