ఆర్కిడ్స్‌తో అందలానికి
ABN, Publish Date - Oct 23 , 2024 | 06:31 AM
కేరళకు చెందిన సబీరా మొహమ్మద్, కాలక్షేపం కోసం మొదలుపెట్టిన పూల మొక్కల పెంపకం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉద్యాన వన శ్రేష్ఠ’ పురస్కారాన్ని
కేరళకు చెందిన సబీరా మొహమ్మద్, కాలక్షేపం కోసం మొదలుపెట్టిన పూల మొక్కల పెంపకం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉద్యాన వన శ్రేష్ఠ’ పురస్కారాన్ని అందుకునే స్థాయికి ఎదిగింది. విదేశాల నుంచి ఆర్కిడ్స్‌ను దిగుమతి చేసుకుంటూ, నెలకు నాలుగు లక్షలు ఆర్జిస్తున్న సబీరా ఆసక్తికరమైన కథనమిది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఏడేళ్ల పాటు జీవించి, స్వస్థలమైన కేరళలోని పాలక్కాడ్‌కు తిరిగొచ్చినప్పుడు సబీనాకు రోజులు గడవడం కష్టంగా మారింది. భర్త పనికీ, పిల్లలు బడికీ వెళ్లిపోయాక, ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో ఆమెకు అర్థమయ్యేది కాదు. దాంతో తనకెంతో ఇష్టమైన గార్డెనింగ్‌తో కాలక్షేపం చేయాలని నిర్ణయించుకుంది సబీరా. అందుకోసం తన టెర్రస్‌నే తగిన ప్రదేశంగా ఎంచుకుంది. అలా 1998లో మల్లె, జాజి పూల మొక్కల పెంపకంతో మొదలైన సబీరా పూల మొక్కల పెంపకం ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ... ‘‘నేను దేశం నలుమూలల నుంచీ పూల మొక్కలను సేకరించేదాన్ని. కొరియర్ ద్వారా కొన్ని మొక్కలనూ, స్వయంగా నర్సరీలను సందర్శించడం ద్వారా ఇంకొన్ని మొక్కలనూ సేకరించేదాన్ని. మొక్కలు దొరకని సందర్భాల్లో విత్తనాలనూ, మొక్కల నమూనాలనూ సేకరించి పెంచుతూ ఉండేదాన్ని. క్రమేపీ నా టెర్రస్ మొత్తం రకరకాల పూల మొక్కలతో నిండిపోయింది. ఆ తర్వాత నా ఆసక్తి అర్కిడ్ ప్లాంటేషన్ మీదకు మళ్లింది.’’ అంటూ పూల మొక్కల పట్ల తన ఆసక్తిని పంచుకుంది సబీరా.
ఉద్యాన శ్రేష్ఠ అవార్డు అందుకుని...
సబీరా, ఆర్కిడ్ ప్లాంటేషన్ కోసం పాలక్కాడ్‌లోని కృష్ణ భవన్ నుంచి శాంప్లింగ్స్‌ను సేకరించింది. ఆర్కిడ్ కల్టివేషన్ గురించి లోతుగా అధ్యయనం చేసి, లెక్కలేనన్ని కొత్త వంగడాలనూ సేకరించింది. అలా ఆర్కిడ్ ప్లాంటేషన్‌లో ప్రత్యేకమైన గుర్తింపు పొందినందుకు గాను, 2006లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ‘ఉద్యాన శ్రేష్ఠ’ పురస్కారంతో సత్కరించడం విశేషం. అ అవార్డుతో సబీరా పూల తోట ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రవ్యాప్త పూల ప్రియులందరూ ఆమె టెర్రస్‌ను సందర్శించడం మొదలుపెట్టారు. ఆమె భర్త మొహమ్మద్ మూసా కూడా భార్యను ప్రోత్సహిస్తూ ఆర్కిడ్స్ పెంపకంలో సహాయపడడం మొదలుపెట్టాడు. అలా సబీరా థాయిల్యాండ్ నుంచి కూడా కొత్త రకం ఆర్కిడ్స్‌ను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆమె దగ్గర 1300 రకాల ఆర్కిడ్స్ ఉన్నాయి.
టెర్రస్ నుంచి నర్సరీ వరకూ...
టెర్రస్ మొత్తం మొక్కలతో నిండిపోవడంతో, సబీరా తన మొట్టమొదటి నర్సరీ కోసం ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసింది. ‘‘నేను మొదట థాయిల్యాండ్ నుంచి, తర్వాత చైనా, తైవాన్, ఆగ్నేయాసియా దేశాల నుంచి ఆర్కిడ్ మొక్కలను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాను’’ అంటూ ఆర్కిడ్ మొక్కల పట్ల తనకున్న ఆసక్తి గురించి వివరించింది. సబీరా ఆ ఒక్క నర్సరీతో ఆగిపోకుండా, పాలక్కాడ్ జిల్లాలోనే రెండో నర్సరీ మొదలుపెట్టి, దానికి పర్ల్ ఆర్కిడ్స్ అనే పేరు పెట్టింది. ‘‘ఆర్కిడ్స్‌ను పెంచడం కాస్త కష్టమైన పనే! అయినా టిష్యూ కల్చర్ ద్వారా నేను వాటిని సమర్థంగా పెంచగలిగాను.
మంచి బ్రీడర్ నుంచి టిష్యూ కల్చర్ సహాయంతో పెరిగిన ఆర్కిడ్స్‌ను కూడా కొనుగోలు చేశాను. వాణిజ్యపరమైన సాగుకు ఇలాంటి మొక్కలే ఉపయోగకరంగా ఉంటాయి’’ అని వివరిస్తున్న సబీరా నాణ్యమైన మొక్కల కోసం పేరున్న బ్రీడర్స్‌నే ఎంచుకుంటూ ఉంటుంది. అలాగే కస్టమర్లకు విక్రయించే ముందు, మొక్కల ఎదుగుదలను పరిశీలిచడానికి వీలుగా 50 వేల మొక్కలు ఉంచే ఒక క్వారంటీన్ ఫెసిలిటీ కేంద్రాన్ని కూడా నెలకొల్పింది.
ఏడాదికి నాలుగు లక్షలు...
ఔషధాల తయారీ కోసం, అలంకరణ ప్రయోజనాల కోసం ఆర్కిడ్స్ వాడకం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. కాబట్టి సబీరా తన పెర్ల్ ఆర్కిడ్స్ నర్సరీ సహాయంతో ఒక్కొక సీడ్లింగ్‌ను రకాన్ని బట్టి, 80 నుంచి 100 రూపాయలకు విక్రయిస్తోంది. ఎదిగిన మొక్కలను 250 నుంచి 350 రూపాయలకు విక్రయిస్తోంది. మొక్కలను సేకరించే అభిరుచి కలిగినవాళ్లు, గార్డెనర్లు, రైతులు, హోల్‌సేల్ నర్సరీలు సబీరా నుంచి ఆర్కిడ్స్‌ను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ మొక్కల పెంపకం గురించి వివరిస్తూ... ‘‘పాటింగ్ మిక్స్‌ను తెప్పించుకుని, హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో దాన్ని శుభ్రపరిచి, వారం రోజుల పాటు నీళ్లతో కడిగి, తర్వాత ఎండలో ఆరబెట్టి వాడుకుంటామనీ, ఆ ప్రక్రియ మొత్తానికీ 8 నుంచి 9 రోజుల సమయం పడుతుంది’’ అంటూ వివరిస్తోంది సబీరా. శుభ్రం చేయని మిక్స్‌ను కిలోకు 100 రూపాయల చొప్పున, శుభ్రం చేసిన మిక్స్‌ను కిలోకు 150 రూపాయల చొప్పున విక్రయుస్తూ అదనపు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తోందామె. ఇలా మొక్కల ద్వారా నెలకు దాదాపు నాలుగు లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్టు కూడా వివరించింది.
Updated Date - Oct 23 , 2024 | 06:31 AM