గాలి జనార్దన్‌రెడ్డికి ఊరట
ABN, Publish Date - Oct 01 , 2024 | 06:01 AM
అక్రమ మైనింగ్ ఆరోపణలతో సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గాలి జనార్దన్‌రెడ్డి ఇక నుంచి బళ్లారి, అనంతపురం, కడప జిల్లాలకూ వెళ్లవచ్చని సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.
బళ్లారి, అనంతపురం, కడప జిల్లాలకూ వెళ్లొచ్చు
సుప్రీం కోర్టు ఉత్తర్వులు
బళ్లారి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): అక్రమ మైనింగ్ ఆరోపణలతో సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గాలి జనార్దన్‌రెడ్డి ఇక నుంచి బళ్లారి, అనంతపురం, కడప జిల్లాలకూ వెళ్లవచ్చని సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. గాలి జనార్దన్‌రెడ్డితో పాటు మరికొందరిపై 2009లో సీబీఐ కేసు నమోదు చేసింది. 2011 సెప్టెంబరు 5న జనార్దన్‌రెడ్డితో పాటు మరి కొందరిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 2015లో గాలి జనార్దన్‌రెడ్డికి కండిషన్ బెయిల్ ఇచ్చారు. కేసు విచారణలో ఉన్నందున ఆయన బళ్లారి, కడప, అనంతపురం జిల్లాల్లో ప్రవేశించరాదని, తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తమ అనుమతి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. 2021లో ఒకసారి, 2022లో ఒకసారి కోర్టు ఆయన్ను బళ్లారిలో ఉండేందుకు అనుమతించింది. కానీ అప్పట్లో సీబీఐ కోర్టులో కేసు విచారణలో ఉన్నందున జనార్దన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారని టపాల గణేశ్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆయన ఆ మూడు జిల్లాలకు రాలేదు. సుప్రీం ఉత్తర్వులతో గాలి జనార్దన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘బళ్లారి నేను పుట్టి పెరిగిన ఊరు. అక్కడ గాలి, నేల, జనాన్ని తాకక చాలా ఏళ్లు గడిచింది. దసరా నవరాత్రి ఉత్సవాలకు ఊరిలోకి అడుగు పెడుతాను. ముందుగా నేను గెలిచిన, నన్ను నమ్ముకున్న గంగావతికి వెళ్లి అక్కడి జనంతో మాట్లాడుతాను. అంజనాద్రి బెట్టను దర్శించుకుని బళ్లారికి వెళ్తాను. అక్కడ దుర్గామాతను దర్శించుకుని ఇంట్లో కాలు పెడతాను’ అని గాలి పేర్కొన్నారు.
Updated Date - Oct 01 , 2024 | 06:01 AM