తెలంగాణ గవర్నర్‌గా రాధాకృష్ణన్
ABN, Publish Date - Mar 20 , 2024 | 04:25 AM
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
న్యూఢిల్లీ, హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ చేసిన రాజీనామాను ఆమోదించారు. ఆమె స్థానంలో మరొకరిని నియమించే వరకూ తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించాలని జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో బుధవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్న కార్యక్రమంలో రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపడతారు. వెరసి, తెలంగాణకు వరుసగా మూడోసారి కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తే గవర్నర్‌గా రావడం విశేషం. తెలంగాణ తొలి గవర్నర్‌గా నరసింహన్ కొనసాగగా.. ఆ తర్వాత అదే రాష్ట్రానికి చెందిన తమిళిసై వ్యవహరించిన విషయం తెలిసిందే. నిజానికి, తమిళిసై రాజీనామా తర్వాత తెలంగాణకు కొత్త గవర్నర్‌ను నియమించాల్సి ఉంది. కానీ, లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికలు ముగిసే వరకూ ఆయనే గవర్నర్‌గా కొనసాగే అవకాశం ఉంది. ఇక, ఇప్పటి వరకు కొనసాగిన తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు రాధాకృష్ణన్ కూడా అదే నేపథ్యం నుంచి వచ్చారు. బాల్యం నుంచే ఆర్‌ఎ్‌సఎస్ నేపథ్యం కలిగిన రాధాకృష్ణన్.. గతంలో తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడిగా పని చేశారు. తమిళనాట పార్టీ బలోపేతానికి ప్రయత్నించారు. కమ్యూనిస్టుల అడ్డాగా పేరుగాంచిన కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి 1998లో తొలిసారిగా విజయం సాధించారు. మరుసటి ఏడాదే మళ్లీ జరిగిన 1999 ఎన్నికల్లోనూ రెండోసారీ విజయబావుటా ఎగరేశారు. 2014లో అన్నాడీఎంకే అభ్యర్థి, 2019లో సీపీఎం అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇటీవలి వరకూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, కొంతకాలంపాటు కేరళ ఇన్‌చార్జిగానూ వ్యవహరించారు. కొబ్బరి, కొబ్బరి ఉత్పత్తులను ప్రోత్సహించే ఆల్ ఇండియ కాయిర్ బోర్డుకు అధ్యక్షుడిగానూ పని చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి 2004లో డీఎంకే వైదొలగిన తర్వాత కూటమిలోకి అన్నాడీఎంకే రావడంలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతో పలుమార్లు సమావేశమై ఆమెను ఒప్పించారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆయనను జార్ఖండ్ గవర్నర్‌గా నియమించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Mar 20 , 2024 | 04:25 AM