Maharashtra Politics : ఫడణవీసే సీఎం!
ABN, Publish Date - Dec 05 , 2024 | 05:05 AM
అందరూ ఊహించినట్లుగానే దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌తో కలిసి
మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక
నేడు ప్రమాణ స్వీకారం
ముగ్గురం కలిసి పని చేస్తాం: ఫడణవీస్
ముంబై, డిసెంబరు 4: అందరూ ఊహించినట్లుగానే దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌తో కలిసి ఫడణవీస్ గవర్నర్‌ను కలిశారు. అనంతరం, ముగ్గురు నేతలు మీడియాతో మాట్లాడారు. గురువారం సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో తనతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేస్తారని ఫడణవీస్ తెలిపారు. మంత్రులు ఎంతమంది ప్రమాణం చేస్తారన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ‘ముఖ్యమంత్రి పదవి అనేది ఒక సాంకేతిక ఏర్పాటు మాత్రమే. మేం ముగ్గురం కలిసికట్టుగా పని చేస్తాం. మా బాధ్యత మరింత పెరిగింది. ప్రజల అంచనాలను అందుకోవటానికి కష్టపడతాం’ అని స్పష్టం చేశారు. ఒక సాధారణ పార్టీ కార్యకర్తగా పని చేసిన తనకు మూడుసార్లు సీఎంగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఫడణవీస్ పేర్కొన్నారు. ‘ఏక్ హై తో సేఫ్ హై.. మోదీ హై తో ముంకిన్ హై’ (కలిసి ఉంటేనే సురక్షితంగా ఉంటాం.. మోదీతో ఏదైనా సాధ్యమే) అని చెప్పారు. షిండేను మంగళవారం కలిశానని, ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఆహ్వానించానని ఫడణవీస్ వెల్లడించారు. దీనిపై మీ స్పందన ఏమిటని షిండేను విలేకర్లు ప్రశ్నించగా.. సాయంత్రం వరకు వేచి చూడండి అంటూ ఆయన బదులివ్వటం గమనార్హం. షిండే అలా చెబుతుండగానే.. పక్కనే ఉన్న అజిత్ పవార్ జోక్యం చేసుకుంటూ.. ఆయన కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తారని చెప్పారు. దీంతో అక్కడున్న అందరూ గొల్లుమని నవ్వారు. అజిత్ మాటకు షిండే ప్రతిస్పందిస్తూ.. ‘దాదాకు (అజిత్ పవార్‌కు) ఉదయమేగాక సాయంత్రం కూడా ప్రమాణం చేసిన అనుభవం ఉంది’ అని వ్యాఖ్యానించటంతో మరోసారి నవ్వులు విరిశాయి. 2019లో ఎన్సీపీ చీలికవర్గంతో బీజేపీ ప్రభుత్వంలో కలిసిన అజిత్ పవార్.. వేకువజామునే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. షిండే ఆ సంగతినే పరోక్షంగా ప్రస్తావించారు. తన రెండున్నరేళ్ల పాలనతో సంతృప్తిగా ఉన్నానని, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన భారీ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని, ఒక బృందంగా కలిసి పని చేస్తామని షిండే పేర్కొన్నారు. రెండున్నరేళ్ల క్రితం సీఎంగా తన పేరును ఫడణవీస్ ప్రతిపాదించారని, ఈసారి ఆయన పేరును తాము ప్రతిపాదించామన్నారు. కాగా, డిప్యూటీ సీఎం పదవిని చేపట్టటానికి ఏక్‌నాథ్ షిండే అంగీకరించినట్లుగా సంబంధితవర్గాలు బుధవారం రాత్రి వెల్లడించాయి. అంతకుముందు, ముంబైలోని విధాన్ భవన్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కేంద్ర పరిశీలకులుగా హాజరయ్యారు. ఫడణవీ్‌సను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎంగా ఫడణవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆజాద్ మైదాన్‌లో జరపటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నట్లు సమాచారం.
‘సరిత పుత్ర దేవేంద్ర ఫడణవీస్’
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఫడణవీస్ తన తల్లి సరితా ఫడణవీ్‌సకు ప్రత్యేక కానుక ఇచ్చారు. ఆయన పేరులో తన తల్లి సరిత పేరును జోడిస్తూ ‘దేవేంద్ర సరిత గంగాధర్ రావు ఫడణవీ్‌స’గా మార్చుకున్నారు. మహారాష్ట్రీయులు సాధారణంగా వారి పేర్లకు మధ్యలో తండ్రి పేరును జోడిస్తుంటారు. ఇప్పటి వరకు దేవేంద్ర ఫడణవీస్ పేరు మధ్యలో ఆయన తండ్రి గంగాధర్ రావు పేరు మాత్రమే ఉండేది. తాజాగా ఆయన తల్లి పేరును కూడా జోడించుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ అధికారిక ఆహ్వాన పత్రికలోనూ ‘దేవేంద్ర సరిత గంగాధర్ రావు ఫడణవీ్‌స’గా ముద్రించారు. కాగా, తన కుమారుడి పట్ల ఎంతో గర్వంగా ఉందని సరితా ఫడణవీస్ అన్నారు. మోదీ కూడా తన కొడుకే సీఎం కావాలని కోరుకున్నారని చెప్పారు. శాతవాహన రాజు గౌతమి పుత్ర శాతకర్ణి తన పేరుకు ముందు తల్లి గౌతమి పేరును జోడించుకుని ఈ సంప్రదాయానికి నాంది పలికారు.
ముచ్చటగా మూడోసారి
ముంబై, డిసెంబరు 4: దేవేంద్ర ఫడణవీస్ ముచ్చటగా మూడోసారి మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యారు. క్లిష్ట సమయాల్లో పరిణతితో వ్యవహరించడం, గొప్ప సహనంతో పాటు పార్టీ పెద్దల పట్ల విధేయత 54 ఏళ్ల ఫడణవీ్‌సను ‘మహా’రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగేలా చేశాయి. సామాజిక మాధ్యమాలను ప్రభావవంతంగా వాడటం ద్వారా తన వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. 1989లో ఫడణవీస్ ఏబీవీపీలో చేరారు. 22 ఏళ్లకే నాగపూర్‌లో కార్పొరేటర్ అయ్యారు. 1997లో 27 ఏళ్ల వయసులో నాగపూర్ మేయర్ పదవి చేపట్టారు. నాగపూర్ చరిత్రలో యంగెస్ట్ మేయర్ ఆయనే! 1999లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో వెనుతిరిగి చూడలేదు. నాగపూర్ సౌత్-వె్‌స్ట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే నాలుగుసార్లు 2009, 2014, 2019, 2014లో ఫడణవీసే గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో ‘ఫడణవీ్‌సను నాగపూర్ దేశానికి ఇచ్చిన బహుమతి’ అంటూ మోదీ అభివర్ణించారు. 2014-19 వరకు మహారాష్ట్ర ముఖ్యమత్రిగా పనిచేశారు. మనోహర్ జోషీ తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండో వ్యక్తి ఫడణవీసే! 2019 నవంబరు 23న రెండోసారి సీఎంగా ప్రమాణం చేసినా మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు సంభవించడంతో మూడురోజులే ఆ పదవిలో కొనసాగారు. గత నవంబరు 23న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసి.. మహాయుతి కూటమికి భారీ స్థాయిలో సీట్లు రావడంతో ఫడణవీస్ మూడోసారి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు.
Updated Date - Dec 05 , 2024 | 05:22 AM