ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తమిళం నేర్చుకుంటా.. ఐరాసలో మాట్లాడుతా

ABN, Publish Date - Apr 02 , 2024 | 03:33 AM

తమిళనాడుతో తనకు అయిదు దశాబ్దాల అనుంధం ఉందని, తమిళ భాష అంటే తనకు ఎంతో గౌరవమని ప్రధాని మోదీ అన్నారు.

ఆ ప్రాచీన భాష గొప్పదనాన్ని చాటి చెప్పాలి.. రాజకీయాల వల్లే ఆ భాష విస్తరించలేదు

ఇంకా నయం ఇడ్లీ, దోసెలను రాజకీయం చేయలేదు: మోదీ

తనకు ఉప్మా, పొంగల్‌ ఇష్టమని వ్యాఖ్య

చెన్నై, ఏప్రిల్‌ 1: తమిళనాడుతో తనకు అయిదు దశాబ్దాల అనుంధం ఉందని, తమిళ భాష అంటే తనకు ఎంతో గౌరవమని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికలను పురస్కరించుకొని ఓ తమిళ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను తమిళం నేర్చుకుంటానని, ఐక్య రాజ్యసమితి (ఐరాస)లో ఆ భాషలో ప్రసంగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇంతవరకు తమిళ భాషకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తమిళ భాష భారత దేశంలో ఉందన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పలేకపోయాం. గర్వపడలేకపోయాం. ఈ ఘన వారసత్వాన్ని ప్రపంచమంతా చెప్పుకోవాలి’’ అని అన్నారు. భాషను రాజకీయం చేయడం వల్లనే తమిళం దేశమంతటా విస్తరించలేకపోయిందని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘ఇంకా నయం ఇడ్లీ, దోసెలను కూడా రాజకీయం చేయలేద’’ని చమత్కరించారు. ‘‘ఒకవేళ ఇడ్లీ, దోసెలను కూడా రాజకీయం చేసి ఉంటే అవి తమిళనాడుకే పరిమితమయి ఉండేవి. ఇప్పుడు అన్ని చోట్లా ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి. తమిళ భాష ప్రపంచమంతా విస్తరించాలి. రాజకీయాల వల్ల అది ఒక ప్రాంతానికే పరిమితమయింది. ఇది తమిళ భాషకు, దేశానికి నష్టం కలిగించింది’’ అని అన్నారు. ఇడ్లీ, దోసెల మాదిరిగానే తమిళం కూడా ప్రపంచమంతా విస్తరించాలని ఆకాంక్షించారు. తనకు మాత్రం తమిళ వంటకాలయిన ఉప్మా, పొంగల్‌ అంటే ఇష్టమని చెప్పారు.

తమిళనాడుతో తనకు ఉన్న అనుబంధాన్ని మోదీ వివరించారు. ఎమర్జెన్సీ సమయంలో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయడం కోసం ఇక్కడికి వచ్చానని చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు నిర్వహించిన ఏక్తా యాత్రలో పాల్గొన్నానని తెలిపారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈరోడ్‌లో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కుమరన్‌ కుటుంబానికి చెందిన 90 ఏళ్ల వృద్ధ మహిళ వచ్చి తనను ఆశీర్వదించడం మరుపురాని అనుభూతి అని అన్నారు. రాష్ట్ర రాజకీయాలపై మోదీ తన అభిప్రాయాలు చెబుతూ ఎన్‌డీఏ కూటమిలో లేకపోవడం వల్ల నష్టపోయింది అన్నాడీఎంకే తప్ప బీజేపీ కాదని అన్నారు. ఈసారి ఎన్‌డీఏ కూటమికి ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ‘‘ఈ కూటమి సమాజంలోని వివిధ ఆర్థిక, సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలతో కూడుకున్నది. ఇదొక పూలగుచ్ఛం. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ గుచ్ఛంలో తమ సొంత పుష్పాన్ని చూసుకోవచ్చు. ఇదే మా విజయ రహస్యం’’ అని వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంశాలపై మోదీ తన అభిప్రాయాలు చెబుతూ వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు తమిళనాడు చోదక శక్తిగా మారిందని ప్రశంసించారు. ఇతర చోట్ల ఘన విజయాలను సాధిస్తున్నా ఇక్కడ మాత్రం అడుగు పెట్టలేకపోతుండడంపై మోదీ సమాధానం ఇస్తూ ఎన్నికల్లో గెలవడం అన్నది తన లక్ష్యం కాదని చెప్పారు.

రాహుల్‌ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

మోదీపై ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మీద బీజేపీ ఎన్నికల కమిషన్‌(ఈసీ)కు ఫిర్యాదు చేసింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ప్రధాని మోదీకి, దేశానికి రాహుల్‌ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని ఈసీని బీజేపీ కోరింది. లోక్‌సభ ఎన్నికల్లో ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ ద్వారా మోదీ గెలవాలనుకుంటున్నారని, అందులో భాగంగా ఎన్నికల కమిషనర్లు అనే అంపైర్లను మోదీ ఎంపిక చేశారని, ఎన్నికల అనంతరం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని ఆదివారం ఓ బహిరంగ సభలో రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవని, రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం హర్దీప్‌, అరుణ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌ పదేపదే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఇండియా కూటమి నేతలపైనా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Updated Date - Apr 02 , 2024 | 03:33 AM

Advertising
Advertising