ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dual Degree : ఒకేసారి రెండు డిగ్రీలు

ABN, Publish Date - Dec 06 , 2024 | 05:26 AM

దేశంలో ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన సబ్జెక్టులు

  • ఒకే దఫాలో రెండు పీజీలు కూడా చేసే అవకాశం

  • ఏడాదికి రెండు సార్లు ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు

  • ఏ కోర్సులోనైనా చేరవచ్చు

  • గడువు తగ్గింపు లేదా పొడిగింపునకూ చాన్స్‌

  • ఉన్నత విద్యలో సంస్కరణలు

  • యూజీసీ మార్గదర్శకాల ముసాయిదా విడుదల

  • విద్యాసంస్థల సంసిద్ధత ఆధారంగానే అమలు

  • చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : దేశంలో ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన సబ్జెక్టులు చదువుకునేందుకు వీలుగా పలు ప్రతిపాదనలు చేసింది. ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండుసార్లు ప్రవేశాల ప్రక్రియ, ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చదివే అవకాశం, గత సబ్జెక్టుతో సంబంధం లేకుండా డిగ్రీ లేదా పీజీ కోర్సుల్లో ప్రవేశం ఇందులో ముఖ్యమైనవి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను యూజీసీ చైర్మన్‌ మామిడి జగదీశ్‌ కుమార్‌ గురువారం విడుదల చేశారు. ముసాయిదాలో పేర్కొన్న సంస్కరణలు అమలైతే.. ఓ విద్యార్థి ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు లేదా పీజీ కోర్సులు చేసే అవకాశం లభిస్తుంది. 12వ తరగతిలో చదివిన సబ్జెక్టుతో సంబంధం లేకుండా విద్యార్థి తనకు నచ్చిన సబ్జెక్టులో డిగ్రీ(అండర్‌ గ్రాడ్యుయేషన్‌) చేయవచ్చు. అలాగే, డిగ్రీలో చదువుకున్న సబ్జెక్టుతో నిమిత్తం లేకుండా నచ్చిన సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) చేయవచ్చు. ఉదాహరణకు ఇంటర్మీడియట్‌లో బైపీసీ చదివిన విద్యార్థి డిగ్రీలో బీకామ్‌ చేరవచ్చు. అయితే, ఇలా వేరే కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు సంబంధిత ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వడం తప్పనిసరి. ఇక, ఉన్నత విద్యా సంస్థలు ఏడాదికి రెండు సార్లు.. జూలై-ఆగస్టు లేదా జనవరి- ఫిబ్రవరిలో తాము నిర్వహిస్తున్న కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించవచ్చు. ఈ విధానం వల్ల ఓ విద్యార్థి ఒకేసారి రెండు యూజీ లేదా రెండు పీజీ కోర్సులు చదువుకోవచ్చు. ఒకేసారి రెండు కోర్సులు అభ్యసించే వారి కనీస హాజరు శాతం(అటెండెన్స్‌) లెక్కింపు అంశంపై సంబంధిత ఉన్నత విద్యా సంస్థలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, సంబంధిత అధీకృత సంస్థల ఆమోదంతోనే ఈ విధానాన్ని అమలు చేయాలి. ఇక, ఓ విద్యార్థి యూజీ డిగ్రీ పొందాలంటే సంబంధిత కోర్సులోని ప్రధాన సబ్జెక్టులో కనీసం 50 శాతం క్రెడిట్‌ మార్కులు పొందాలి. మిగిలిన 50 శాతం క్రెడిట్లను విద్యార్థి ఇతర కోర్సుల్లో చూపించిన నైపుణ్యం, అప్రెంటి్‌సషిప్‌ తదితర అంశాల ఆధారంగా కేటాయిస్తారు.

కోర్సు గడువు తగ్గింపు లేదా పొడిగింపు

యూజీ డిగ్రీ విద్యార్థులు తమ కోర్సు కాలాన్ని పొడిగించుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఈ ముసాయిదాలో ఓ కొత్త విధానాన్ని ప్రతిపాదించారు. ఇందుకోసం యాక్సిలరేటెడ్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (ఏడీపీ), ఎక్స్‌టెండెడ్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌(ఈడీపీ) అనే విధానాలను యూజీసీ తీసుకొచ్చింది. ఎవరైనా విద్యార్థి నిర్ణీత సమయం కంటే ముందుగానే తన కోర్సును పూర్తి చేయాలనుకుంటే ఏడీపీని ఎంచుకోవచ్చు. మొదటి లేదా రెండో సెమిస్టర్‌ లోపే ఈ నిర్ణయం తీసుకోవాలి. కోర్సు నిడివిని పొడిగించుకోవాలని అనుకునేవారు ఈడీపీని ఎంచుకోవచ్చు. ఏడీపీ, ఈడీపీలో ఉన్న వారందరికీ పాఠ్య ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే, ఏడీపీ, ఈడీపీలో దేనినైనా విద్యార్థి ఎంచుకుని కోర్సు పూర్తి చేస్తే మాత్రం సర్టిఫికెట్లలో ఆ అంశం ఉంటుంది. ఇక, నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ (హానర్స్‌, రీసెర్చ్‌తో సహా హానర్స్‌) పూర్తి చేసిన వారే ఎంఈ, ఎంటెక్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ పీజీ కోర్సులకు అర్హులవుతారని యూజీసీ ప్రతిపాదించింది. కాగా, ఈ ముసాయిదా అమలు ఉన్నత విద్యాసంస్థల సంసిద్ధతపై ఆధారపడి ఉంటుందని యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ వెల్లడించారు. 2020 జాతీయ విద్యా విధానం సూచనల మేరకు విద్యార్థులు వివిధ రకాల కోర్సులు చదువుకునేందుకు వీలు కల్పించడమే ముసాయిదా ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 05:27 AM