Chennai: మాకు మొత్తం ఏడు సీట్లు ఇవ్వండి.. అన్నాడీఎంకేకు తేల్చిచెప్పిన డీఎండీకే
ABN, Publish Date - Mar 03 , 2024 | 10:45 AM
అన్నాడీఎంకే(AIADMK) కూటమిలో చేరాలంటే తమకు ఏడు లోక్‌సభ స్థానాలు కేటాయించాలని డీఎండీకే(DMDK) తేల్చి చెప్పింది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రధాన పార్టీలు మిత్రపక్షాలకు సీట్ల
- ముగిసిన ఇరుపార్టీల రెండో విడత చర్చలు
చెన్నై: అన్నాడీఎంకే(AIADMK) కూటమిలో చేరాలంటే తమకు ఏడు లోక్‌సభ స్థానాలు కేటాయించాలని డీఎండీకే(DMDK) తేల్చి చెప్పింది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రధాన పార్టీలు మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపులను ఖరారు చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి. బీజేపీ కూటమి నుంచి వైదొలగిన అన్నాడీఎంకే లోక్‌సభ ఎన్నికల్లో మెగా కూటమిని ఏర్పాటు చేసే దిశగా కొత్త పార్టీల కోసం పావులు కదుపుతోంది. పీఎంకే, డీఎండీకేలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే గెలుపు సునాయాసమవుతుందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి భావిస్తున్నారు. ఈ దిశగానే పీఎంకే, డీఎండీకే నేతలతో అన్నాడీఎంకే సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా అన్నాడీఎంకే సీనియర్ నేతలు డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతతో మరోమారు భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం స్థానిక వలసర వాక్కంలోని ప్రేమలత ఇంటికి అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, తంగమణి, కేపీ అన్బళగన్, బెంజమిన్ వెళ్లారు. కెప్టెన్ విజయకాంత్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత ప్రేమలతను సత్కరించి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఆ సందర్భంగా సీట్ల సర్దుబాట్లకు సంబంధించి చర్చించారు. ప్రేమలతతో పాటు ఆ పార్టీ డిప్యూటీ కార్యదర్శి పి.పార్థసారథి ఈ చర్చల్లో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 14 లోక్‌సభ స్థానాలు, ఒక రాజ్యసభ స్థానం ఇచ్చే పార్టీతోనే పొత్తుపెట్టుకుంటామని ప్రేమలత గతంలో ప్రకటించారు.
శుక్రవారం జరిగిన రెండో విడత చర్చల్లో అన్నాడీఎంకే కూటమిలో ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న పీఎంకే కూడా చేరనుండటంతో ఆ పార్టీకి తగినన్ని సీట్లు కేటాయించాల్సి ఉందని, అందువల్ల 14 సీట్లను కేటాయించలేమని మాజీ మంత్రులు వేలుమణి, తంగమణి పేర్కొన్నారు. దీంతో పట్టుసడలించిన ప్రేమలత ఏడు లోక్‌సభ నియోజకవర్గాలు, రాజ్యసభ సీటును కేటాయించాలని కోరారు. ఈ విషయమై పార్టీ నేత ఈపీఎ్‌సతో మాట్లాడాక స్పష్టత ఇస్తామని వేలుమణి పేర్కొన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అన్నాడీఎంకే సీనియర్ నేతలు విలేకరులతో మాట్లాడుతూ... డీఎండీకేతో జరిపిన చర్చలు సంతృప్తికరంగా ముగిశాయన్నారు. మలి విడత చర్చల్లో సీట్ల సర్దుబాట్లు ఖరారవుతాయని తెలిపారు. ఇదిలా ఉండగా సీట్ల సర్దుబాట్లపై అన్నాడీఎంకే అధిష్ఠాంనంతో చర్చలు జరిపేందుకు డీఎండీకే ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రేమలత ప్రకటించారు. డీఎండీకే ఏడు సీట్లడుగుతున్నా అన్నాడీఎంకే అధిష్ఠానం ఐదు సీట్లను ఒక రాజ్యసభ సీటను మాత్రమే కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే మలివిడత చర్చల్లో ఆ సీట్ల సంఖ్య ఆరుకు చేరుకునే అవకాశం ఉందని అన్నాడీఎంకే సీనియర్ నాయకులు చెబుతున్నారు.
Updated Date - Mar 03 , 2024 | 10:45 AM