అడవుల్లో అన్నల సొరంగాలు
ABN, Publish Date - Feb 01 , 2024 | 03:03 AM
సినిమాల్లో విలన్లు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అడవుల్లో సొరంగాలు, డెన్‌లలో ఉండడం చూసే ఉంటారు. ఇప్పుడు మావోయిస్టులు కూడా అచ్చంగా అలాంటి వ్యూహాన్నే అనుసరిస్తున్నారు.
డ్రోన్ కెమెరాల నుంచి తప్పించుకునే ఎత్తుగడ
దంతేవాడలో 130 మీటర్ల సొరంగం గుర్తింపు
చర్ల, జనవరి 31: సినిమాల్లో విలన్లు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అడవుల్లో సొరంగాలు, డెన్‌లలో ఉండడం చూసే ఉంటారు. ఇప్పుడు మావోయిస్టులు కూడా అచ్చంగా అలాంటి వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. కూంబింగ్ సమయంలో, నిఘాలో భాగంగా పోలీసులు డ్రోన్ కెమెరాలను వాడడం పెరిగినప్పటి నుంచి.. ఛత్తీ్‌సగఢ్-తెలంగాణ సరిహద్దుల్లో ఈ తరహాలో భారీ ఎత్తున టన్నెల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దంతేవాడ జిల్లా భైరంగఢ్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో.. ఇంద్రావతి నది సమీపంలో ఇలాంటి ఓ సొరంగాన్ని సీఆర్పీఎఫ్, డీఆర్జీ జవాన్లు బుధవారం గుర్తించారు. ఆ వివరాలను దంతేవాడ ఎస్పీ గౌరవ్‌రాయ్ వెల్లడించారు. ‘‘బుధవారం ఉదయం దంతేవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేత మల్లేశ్‌తోపాటు.. 25-30 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం అందింది. డీఆర్జీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. పోలీసుల అలజడిని గుర్తించి, వారు పరారైనట్లు తెలుస్తోంది. అయితే.. డీఆర్జీకి చెందిన ఓ జవాను మావోయిస్టుల టన్నెల్‌ను తొలుత గుర్తించాడు’’ అని ఆయన వివరించారు.
ఈ ప్రాంతం తెలంగాణకు సమీపంలో ఉండడం గమనార్హం..! దంతేవాడ పోలీసులు ఆ సొరంగాన్ని ధ్వంసం చేశారు. 10 అడుగుల లోతులో ఉన్న ఆ సొరంగంలో ఏకకాలంలో 100 మంది వరకు మావోయిస్టులు తలదాచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 130 మీటర్ల పొడవున్న ఆ సొరంగంలో.. ప్రతీ ఆరు మీటర్లకు ఒకటి చొప్పున వెంటిలేటర్లు ఉన్నాయి. గతంలోనూ ఈ తరహా సొరంగాలు వెలుగులోకి వచ్చినట్లు విశ్రాంత ఐపీఎస్ అధికారి, యాంటీ-నక్సల్స్ ఆపరేషన్స్ స్పెషల్ డీజీ ఆర్కే విజ్ పేర్కొన్నారు. 2012లో బీజాపూర్‌లో 80 మీటర్ల సొరంగం బయటపడిందని, బీజాపూర్ జిల్లా కేరపర్‌లో బయటపడ్డ మరో టన్నెల్‌లో మావోయిస్టు అగ్రనేత గణపతి తలదాచుకునేవాడని చెప్పారు. అబుజ్‌మడ్ ప్రాంతంలోనూ సొరంగాలు వెలుగు చూశాయని వివరించారు.
Updated Date - Feb 01 , 2024 | 03:03 AM