Canada: విదేశీ విద్యార్థులపై పరిమితి! కెనడా ప్రభుత్వం యోచన
ABN, Publish Date - Jan 15 , 2024 | 08:44 AM
కెనడాలో ఇళ్లకు కొరత నేపథ్యంలో విదేశీ విద్యార్థుల రాకపై పరిమితులు విధించాలని ట్రూడో ప్రభుత్వం యోచిస్తోంది. వలసలు, శరణార్థులు, పౌరసత్వ శాఖల మంత్రి మార్క్ మిల్లర్ తాజాగా ఒక టీవీచానల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్య 9లక్షలకు చేరడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఒట్టావా, జనవరి 14: కెనడాలో ఇళ్లకు కొరత నేపథ్యంలో విదేశీ విద్యార్థుల రాకపై పరిమితులు విధించాలని ట్రూడో ప్రభుత్వం యోచిస్తోంది. వలసలు, శరణార్థులు, పౌరసత్వ శాఖల మంత్రి మార్క్ మిల్లర్ తాజాగా ఒక టీవీచానల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్య 9లక్షలకు చేరడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థుల సంఖ్య కలవరపెడుతోందని, దీనికి కళ్లెం వే యాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలతో ఫెడరల్ ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. ఈ ఏడాది 4.85లక్షల మంది వలసదారులను దేశంలోకి అనుమతించాలన్నది అధికార లిబరల్స్ పార్టీ లక్ష్యం. 2025, 26సంవత్సరాల్లో ఐదేసి లక్షల చొప్పున వలసదారులను అనుమతించాలని భావిస్తోంది.
2012లో 2.75 లక్షలున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 2022లో 8లక్షలు దాటింది. కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం గణాంకాల ప్రకారం కెనడాకు వస్తున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య బాగా ఉంది. గతేడాది నవంబరునాటికి కెనడాలో 5,79,075 మంది విదేశీ విద్యార్థులుండగా, వారిలో 2,15,910 మంది(37ు) భారతీయ విద్యార్థులే. 2022ఏప్రిల్ నుంచి 2023మార్చి వరకు 32వేల మంది ఐటీ ఉద్యోగులు కెనడాకు వలస వెళ్లగా వారిలో సగం మంది భారతీయులే. 2018 నుంచి విదేశీ విద్యార్థుల ప్రధాన వనరుగా భారత్ మారింది. ఉన్నత విద్య, ఉద్యో గాల కోసం పెద్ద సంఖ్యలో భారతీయులు కెనడాకు వలస వెళ్తుండటంతో గత రెండు దశాబ్దాల్లోనే కెనడాలోని సిక్కు జనాభా రెండింతలైంది.
Updated Date - Jan 15 , 2024 | 08:44 AM