Hair Care: అలర్ట్! రాత్రిళ్లు తల స్నానం చేస్తున్నారా? అయితే..
ABN, Publish Date - Feb 01 , 2024 | 02:53 PM
రాత్రిళ్లు తలస్నానం చేయకూడదంటున్న నిపుణులు. చిక్కంతా ఆ ఒక్క సమస్యతోనే
ఇంటర్నెట్ డెస్క్: తలస్నానం ఎప్పుడు చేయాలనే అంశంలో అనేక అపోహలు ఉన్నాయి. కొందరు రాత్రిళ్లు తల స్నానం చేయకూడదని చెబుతుంటారు. మరికొందరేమో ఆ వాదనను కొట్టి పారేస్తుంటారు. అయితే, రాత్రిళ్లు తలస్నానం చేసే అలవాటు ఉన్న వాళ్లు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే జుట్టు ఆరోగ్యం దెబ్బతినొచ్చని హెచ్చరిస్తున్నారు (Washing hair at night).
నీళ్లల్లో తడిశాక జట్టు బరువుగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో జుట్టు పూర్తిగా ఆరబెట్టుకోకుండా పడుకుంటే దిండు కారణంగా శిరోజాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల కుదుళ్లు బలహీన పడి జుట్టు ఊడిపోతుంది. కాబట్టి, రాత్రి సమయాల్లో తలస్నానం చేసేవాళ్లు జుట్టు పూర్తిగా ఆరబెట్టుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. తడిగా ఉన్న తలతో నిద్రిస్తే జట్టు డ్యామేజ్ అవ్వడం ఖాయమని చెబుతున్నారు.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు
తడిగా ఉన్న జుట్టు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం మెండుగా ఉంది. ఇలాంటప్పుడు జుట్టుపై ఫంగస్‌తో పాటూ ఇతర సూక్ష్మక్రిములు కూడా చేరతాయి. ఫలితంగా ఇన్‌ఫెక్షన్లు వచ్చి దురదలు మొదలవుతాయి. అంతిమంగా కుదుళ్లు బలహీనపడి జుట్టు ఊడిపోతుంది.
తడి జుట్టుతో యాక్నే వంటి చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
పూర్తిగా ఆరని జుట్టుతో నిద్రిస్తే జుట్టు టెక్స్చర్‌పై ప్రభావం పడుతుంది. పదే పదే ఇలా చేస్తే జుట్టు డ్యామేజ్ అవుతుంది. సహజ సున్నితత్వం కోల్పోతుంది.
కాబట్టి, రాత్రి సమయాల్లో తలస్నానం చేయకుండా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అది కుదరని పక్షంలో తలస్నానం తరువాత జుట్టు పూర్తిగా ఆరిన తరువాత నిద్రకు ఉపక్రమించాలని సూచిస్తున్నారు.
Updated Date - Feb 01 , 2024 | 02:58 PM