విజ్ఞాన వెలుగు సావిత్రిబాయి
ABN, Publish Date - Jan 03 , 2024 | 12:49 AM
అసమానతల సమాజంపై ధిక్కార స్వరాలై... అట్టడుగు వర్గాల జీవితాల్లో విజ్ఞానాన్ని నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన దంపతులు జ్యోతిరావు ఫూలే–సావిత్రిబాయి ఫూలే...
అసమానతల సమాజంపై ధిక్కార స్వరాలై... అట్టడుగు వర్గాల జీవితాల్లో విజ్ఞానాన్ని నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన దంపతులు జ్యోతిరావు ఫూలే–సావిత్రిబాయి ఫూలే. వారి విశేష కృషి వల్లే నేడు ఈ సమాజంలో ప్రతీ ఒక్కరూ అక్షరాలు నేర్చుకోగలుగుతున్నారు. భర్త అడుగుజాడల్లో నడిచి సంఘంలో జరుగుతున్న అనేక అణచివేతలను ఎదురించిన దీశాలి సావిత్రిబాయి.
ఆమె మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో జన్మించింది. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లాలో, అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు. సావిత్రి 1840లో జ్యోతిరావు ఫూలేను వివాహమాడింది. నిరక్షరాస్యురాలైన ఆమెకు భర్తే మొదటి గురువు. ఆయన ప్రోత్సాహంతోనే ఇంట్లోనే విద్యావంతురాలైంది. అహ్మద్‌నగర్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో భర్తతో కలిసి అట్టడుగు కులాల బాలికల కోసం పుణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది. ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో ఆమెపై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేసేవారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. అయినా రోజూ వేధింపులకు విసిగి ఒకరోజు ఒకడి చెంప పగులకొట్టింది. 1849లో ఫూలే, సావిత్రీబాయి దంపతులు గృహ బహిష్కారానికి గురయ్యారు. ఈ దంపతులు వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు.
ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ను కూడా స్థాపించింది. జెండర్ సమస్యలకు తోడుగా, కుల, పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషి చేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873లో భర్తతో కలసి ‘సత్యశోధక్ సమాజ్’ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతువుల పునర్వివాహాల కోసం అసమాన బ్రాహ్మణిజ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దేవదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు. యశ్వంత్‌గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు సావిత్రిబాయి.
1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు కరువు వాతపడిన కుటుంబాలలోని అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. సమాజం కోసం సర్వస్వం త్యాగం చేసి అంధకార జీవితాల్లో అక్షర వెలుగులు పంచిన ఆ జ్ఞానజ్యోతులను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా సమాజం కోసం మన స్థాయిలో కృషి చేయడమే మనం వారికి ఇచ్చే ఘన నివాళి.
సంపత్ గడ్డం
Updated Date - Jan 03 , 2024 | 12:49 AM