ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అయోవా హెచ్చరిక

ABN, Publish Date - Jan 18 , 2024 | 01:58 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థిగా నిలవాలనుకున్న వివేక్‌ రామస్వామి పోటీనుంచి తప్పుకొన్నారు. అయోవా ప్రైమరీలో వివేక్‌కు పెద్ద ఎదురుదెబ్బతగలడంతో ఆయన యుద్ధరంగంనుంచి...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థిగా నిలవాలనుకున్న వివేక్‌ రామస్వామి పోటీనుంచి తప్పుకొన్నారు. అయోవా ప్రైమరీలో వివేక్‌కు పెద్ద ఎదురుదెబ్బతగలడంతో ఆయన యుద్ధరంగంనుంచి నిష్క్రమించి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భారత సంతతికి చెందిన ఈ బయోటెక్‌ వ్యాపారి మూడునెలలకాలంలో రెండువందల మిలియన్‌ డాలర్లు వ్యాపారంలో నష్టపోయి, చివరకు రాజకీయంలోనూ నిలబడలేకపోయారని, ఇలా మెరిసి అలా మాయమైపోయారని అమెరికా పత్రిక ఒకటి ఓ వెటకారపు వ్యాఖ్యచేసింది. కానీ, న్యూహ్యాంప్‌షైర్‌ ప్రచారంలో తనతో వేదిక పంచుకున్న వివేక్‌ను ఉద్దేశించి డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు విన్న చాలామందికి వివేక్‌ రాజకీయభవిష్యత్తు ముగిసిపోలేదని అనిపించింది. వివేక్‌ను ట్రంప్‌ ప్రశంసలతో ముంచెత్తుతూ వేదికమీదకు ఆహ్వానించినప్పుడు కార్యకర్తలు వీపీ (వైస్‌ప్రెసిడెంట్‌) అంటూ నినాదాలు చేశారు. వివేక్‌ మాతోనే ఉంటారు, భవిష్యత్తులో సుదీర్ఘకాలం మాతో కలిసిసాగుతారు అన్న ట్రంప్‌ మాటల్లో తాను దేశాధ్యక్షుడు, వివేక్‌ ఉపాధ్యక్షుడు అన్న అర్థం రాజకీయ విశ్లేషకులకు కూడా గోచరించింది.

వివేక్‌ తన ప్రచారంలో ట్రంప్‌మీద పెద్దగా నోరుపారేసుకోలేదు. 21వ శతాబ్దపు గొప్ప అధ్యక్షుడుగా ఆయనను అభివర్ణించడంతో పాటు, ప్రచారంలో దాదాపుగా ఆయననే అనుకరించారు. ట్రంప్‌ నినాదాన్ని మరింత విస్తరించి అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టడం తనతోనే సాధ్యమని చెప్పుకున్నారు. తనది రాజకీయప్రచారం కాదని, భావితరాల కలలను సాకారం చేయడానికి ఉద్దేశించిన సాంస్కృతిక ఉద్యమం అన్నారాయన. చైనా, వలసల నియంత్రణ, స్థానిక ఉపాధి, అడ్డుగోడలు కట్టడం ఇత్యాది అనేకానేక అంశాల్లో ట్రంప్‌ను ఆవాహన చేసుకొని, ఆయననే అనుకరిస్తూ, మిగతా పోటీదారులను అవమానిస్తూ వివేక్‌ ప్రచారం సాగింది. రిపబ్లికన్‌ పార్టీలో ముందువరుసలో నిలవాలంటే అనుకరణ కంటే, ఇతరత్రా అంశాలు చాలా పనిచేస్తాయి. పుట్టుపూర్వోత్తరాలను దాటి మరింత నికార్సయిన అమెరికన్‌గా నిరూపించుకోవడానికి వివేక్‌ చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. భారత సంతతికి చెందిన నిక్కీహాలీ విషయంలో ప్రదర్శించిన కాఠిన్యం కూడా తగినంత గుర్తింపు తెచ్చినట్టు లేదు. వివేక్‌ అంత దూకుడుగా, వేగంగా ఎదిగిపోవడం తోటి రిపబ్లికన్‌ నేతలకే రుచించలేదనడానికి పాస్టర్లు చేసిన ప్రకటనలే నిదర్శనం. ఆ తరువాత ఎవ్వరు ఎన్ని ఖండనమండనలు చేసినా పార్టీలోని అత్యధికుల మనోభిప్రాయానికి అనుగుణంగానే వివేక్‌ మూలాలకూ, మతానికీ సంబంధించిన ప్రస్తావనలు ముందుకు వచ్చాయన్నది వాస్తవం. అయోవా ప్రైమరీకి రెండురోజుల ముందే వివేక్‌ను అవినీతిపరుడనీ, ఆర్థిక నేరగాడని, ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ లక్ష్యానికి ప్రమాదకారి అనీ ట్రంప్‌ అభివర్ణించారు. ఆ నినాదం లక్ష్యాలు, ఉద్దేశాలు ఏమిటో, అది ఎవరిని శత్రువులుగా చూపుతున్నదో అందరికీ తెలిసిందే కనుక, ట్రంప్‌ వ్యాఖ్యలో అంతర్లీనంగా ఉన్న సందేశాన్నే అయోవా ప్రైమరీ ప్రతిఫలించింది. ట్రంప్‌కూ తనకు మధ్య పోలికకంటే తేడాలే ఎక్కువన్న విషయం రామస్వామికి అర్థమై ఉంటుంది. ఇటీవలే, ‘సేవ్‌ ట్రంప్‌, ఓట్‌ వివేక్‌’ ప్రచారంతో ట్రంప్‌ ఆగ్రహానికి గురై, ఉపాధ్యక్షుడిగా వివేక్‌ పేరు ఆలోచనలోనే లేదని ట్రంప్‌ ప్రతినిధులు వెన్వెంటనే ప్రకటించిన తరువాత కూడా వివేక్‌ రేపు దేశ ఉపాధ్యక్షుడవుతారా?

అయోవాలో ట్రంప్‌ విజయం అమెరికాకు, ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతంగా చాలామంది భయపడుతున్నారు. 88శాతం శ్వేతజాతీయులున్న అయోవా ఫలితాలు దేశమంతా ప్రతిఫలించవని మరికొందరు సర్దిచెప్పుకుంటున్నారు. ట్రంప్‌ను ఇక్కడ అడ్డుకుంటే తన భవిష్యత్తు బాగుంటుందన్న డిశాంటీస్‌ అంచనాలు కూడా తారుమారైనాయి. ట్రంప్‌ మీద ఉన్న కేసులు, నీలిచిత్రాల నటికి ఇచ్చిన ముడుపులు, తన మద్దతుదారులను రెచ్చగొట్టి కేపిటల్‌పై జరిపిన దాడులు, చట్టసభలో ఎదుర్కొన్న అభిశంసనలు ఇత్యాదివి రిపబ్లికన్‌ పార్టీ ఓటర్లను ప్రభావితం చేయలేదని ఈ ఎన్నిక చెబుతోంది. పైమరీల్లో పోటీ చేయకుండా రెండు రాష్ట్రాల న్యాయస్థానాలు ట్రంప్‌ను అనర్హుడుగా ప్రకటించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏమి చెబుతుందన్నది అటుంచితే, ఆయన మీద పెట్టిన కేసులన్నీ బోగస్‌వేనని పార్టీ ఓటర్లు నమ్ముతున్నట్టుంది. రేపు మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందా అన్నది అటుంచితే, ట్రంప్‌ ఆదరణ తగ్గలేదని చెబుతున్న అయోవా నిజంగానే ఒక ప్రమాద హెచ్చరిక.

Updated Date - Jan 18 , 2024 | 01:58 AM

Advertising
Advertising