ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అయోధ్య రాముడితో రాజకీయాలా?

ABN, Publish Date - Jan 18 , 2024 | 02:04 AM

‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని వశిష్ట మహర్షి రాముడి గురించి ఒక్క వాక్యంలో చెప్పారు. ధర్మానికి ప్రతీక శ్రీరాముడు అని దాని అర్థం. అలాంటి ధర్మబద్ధుడైన రాముడి విషయంలోనే కొన్ని శక్తులు అధర్మంతో....

‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని వశిష్ట మహర్షి రాముడి గురించి ఒక్క వాక్యంలో చెప్పారు. ధర్మానికి ప్రతీక శ్రీరాముడు అని దాని అర్థం. అలాంటి ధర్మబద్ధుడైన రాముడి విషయంలోనే కొన్ని శక్తులు అధర్మంతో వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఐదు వందల ఏళ్ల తర్వాత మర్యాద పురుషోత్తముడికి ఒక కోవెలను హిందువులు వారి స్వంత డబ్బులతో నిర్మించి ప్రారంభించుకుంటున్న తరుణంలో ఎక్కడ లేని రాజకీయాలు, శాస్త్రాల పేరుతో కొందరు అపప్రథను మూటగట్టుకుంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏ రోజూ హిందుత్వం, హిందువుల గురించి ఆలోచించని కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీఆర్‌ఎస్ తదితర రాజకీయ పార్టీలు, కుహనా మేధావులు, కొందరు స్వామీజీలు సైతం ఈ రోజు రాముడి పేరుతో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి సహించలేకపోతున్నారు.

కాంగ్రెస్ తదితర విపక్షాలు చెబుతున్నట్లుగా నలుగురు శంకరాచార్యులు అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనోత్సవాల్ని వ్యతిరేకిస్తున్నారన్నది వాస్తవం కాదు. ద్వారకా, శృంగేరీ పీటాధిపతులు తమపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. దేశ ప్రజల ప్రతినిధిగా, దేశ ప్రధాని మోదీ అక్కడి అన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని విధాలా అర్హులని శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి మద్దతిచ్చారు. పూరీ శంకరాచార్యులు తాము తర్వాత వెళ్ళి రామ్ లల్లాను దర్శించుకుంటామన్నారు. ఇక మిగిలిన ఒక శంకరాచార్యులు అవిముక్తేశ్వరానంద సరస్వతి 2019లో జరిగిన లోక్‍సభ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో మోదీకి వ్యతిరేకంగా రామ రాజ్య పరిషత్ తరపున పోటీచేసిన అభ్యర్థికి మద్దతిచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ తదితర పక్షాలు బీజేపీ, వీహెచ్‌పీ, ఆరెస్సెస్‍లను నిందించడం ఎంతవరకు సమంజసం.

వాస్తవానికి అయోధ్యలో రామాలయం నిర్మిస్తోంది బీజేపీ, వీహెచ్‌పీ, ఆరెస్సెస్‌లు కాదు. అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాయి కాబట్టి ఈ సంస్థలు దేవాలయ నిర్మాణానికి సహకరిస్తున్నాయి. ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యలో రామాలయ నిర్మాణ ప్రక్రియ జరగాలన్న సుప్రీంకోర్టు సూచన మేరకు అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటైంది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఆలయ నిర్మాణం జరుగుతోంది. అందుకే ఆ ట్రస్ట్ స్వామీజీలకు, శంకరాచార్యులందరికీ, దేశంలోని వివిధ రంగాల ప్రముఖులకు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులకు గౌరవ పూర్వకంగా ఆహ్వానాలను అందించింది. ఇంత పెద్ద కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథి ఉండాలనే ఉద్దేశంతో దశాబ్దాలుగా రామాలయ ఉద్యమానికి మద్దతిస్తున్న బీజేపీ అగ్రనాయకుడు, దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఈ విగ్రహ ప్రతిష్టాపనోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించింది శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్. దీనిని చిలువలు, పలువలు చేసి రాద్ధాంతం చేసి రాజకీయం చేయాలనుకుంటున్నట్లుంది రాజకీయ పార్టీల వ్యవహార శైలి.

సోనియా గాంధీ క్రిస్టియన్ కాబట్టి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడంలేదనే వాస్తవం చెబితే సరిపోతుంది. కాని అది బీజేపీ, ఆరెస్సెస్ కార్యక్రమం అంటూ ఒక విమర్శ చేసి కాంగ్రెస్ పార్టీ ట్రస్ట్ ఆహ్వానాన్ని తిరస్కరించి, హాజరుకాబోవడంలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆ పార్టీ నాయకులే తప్పుపడుతున్నారు. రాముడు ప్రజలందరి దేవుడని, ఆరాధ్యదైవమని వారు పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేస్తున్నారు. పార్టీ బహిష్కరించినా తాము పాల్గొంటామని ఇప్పటికే గుజరాత్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. రామమందిరం, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఇక్బాల్ అన్సారీ సైతం ఈ ఉత్సవానికి హాజరవుతుంటే కాంగ్రెస్ బహిష్కరించడం సమంజసం కాదని బీజేపీ తప్పు పడుతోంది.

ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకుంటూనే ఉంది. అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా సోమనాథ్ దేవాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. కశ్మీర్‌కు 370 ఆర్టికల్‌తో ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి ముస్లింల దాడులతో అక్కడి నుంచి హిందువులు పారిపోయేలాగా చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో హిందువులకు నష్టం కలిగేలాగా హిందూ వ్యతిరేక చట్టాలు, వక్ఫ్ చట్టం లాంటివి చేయడంతో కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి బహిర్గతమైంది. ఇక కమ్యూనిస్టులు, హేతువాదులు, కుహనా మేధావులు సైతం పక్కా సెక్యులర్ వాదులమంటూ హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటారు. ట్రస్ట్ ఆహ్వానాన్ని అందుకున్న కమ్యూనిస్టు నాయకుడు సీతారామ్ ఏచూరి మాట్లాడుతూ మతం వ్యక్తిగతం కాబట్టి హాజరు కాలేనని ప్రకటించడం శోచనీయం. కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు అధికారికంగా ఇఫ్తార్ విందులిచ్చినపుడు, క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలకు హాజరైనప్పుడు మతం వ్యక్తిగతం అనే విషయం ఆయనకు ఎందుకు గుర్తుకు రాలేదన్నది ప్రశ్న. అలాగే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలోని ముస్లింల ఓట్ల కోసమే రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని వ్యతిరేకిస్తున్నారనే విషయం గ్రహించలేనంత అమాయకులా హిందువులు? ఇక రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ రామాలయ ప్రారంభోత్సవం విషయంలో తమ వైఖరి ప్రకటించకుండా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా తాము అక్షింతలు పంచి ఉంటే గెలిచేవారమని మాట్లాడడం శోచనీయం. గతంలో బీఆర్‌ఎస్ అధినాయకుడు కేసీఆర్ హిందుగాళ్లు, బొందుగాళ్లు అని; రామ జన్మభూమి, రావణ జన్మభూమి, కృష్ణ జన్మభూమి అంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మాట్లాడిన విషయం అందరికీ గుర్తుంటుంది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ రక్షణ రంగంలోనే కాకుండా ఆర్థిక, సామాజిక అంశాలపైనా, దేశ ప్రజలందరి అభివృద్ధి కోసం సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ ధ్యేయంగా కృషి చేస్తోందన్న వాస్తవాన్ని గ్రహించకపోతే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రెస్ గల్లంతు కావడం ఖాయం.

శ్యామ్ సుందర్ వరయోగి

Updated Date - Jan 18 , 2024 | 02:04 AM

Advertising
Advertising