ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కళింగాంధ్రలో నేటికీ వినపడే నన్నయ మాటలు

ABN, Publish Date - Jan 08 , 2024 | 12:33 AM

‘‘మహిమున్‌ వాగనుశాసనుండు సృజియింపన్‌...’’ అంటూ రామరాజ భూషణుడు వసుచరిత్రలో నన్నయభట్టును శ్లేషాలంకారంతో నుతిస్తాడు. ఈ బిరుదు పదాన్నే నన్నయ్య తన భారతంలో ‘తన కులబ్రాహ్మణు..’ అనే పద్యంలో...

‘‘మహిమున్‌ వాగనుశాసనుండు సృజియింపన్‌...’’ అంటూ రామరాజ భూషణుడు వసుచరిత్రలో నన్నయభట్టును శ్లేషాలంకారంతో నుతిస్తాడు. ఈ బిరుదు పదాన్నే నన్నయ్య తన భారతంలో ‘తన కులబ్రాహ్మణు..’ అనే పద్యంలో ‘విపుల శబ్దశాసనుడు’గా రాసుకున్నాడు. అంతేకాదు ఉభయకావ్య రచనాభిశోభితుడనని, బ్రహ్మాండాది పురాణవిజ్ఞాన నిరతుడనని, ఈ విధంగా తనను రాజరాజనరేంద్రుడే ప్రశంసించినట్లు చెప్పుకున్నాడు. నాటి సాహిత్యం మీద సత్సభాంతర సరసీ వనాలలో చర్చలు జరిగేవి. తన భారతానువాదాన్ని కూడ నన్నయ ఆయా సభల్లో చర్చకు పెట్టే ఉంటాడు.

ఇలాంటి నేపథ్యంతో నన్నయ రచనను పరిశీలిస్తే మూడొంతులు సంస్కృత సమాసాలు, ఒకొంతు మాత్రమే తెలుగు పదాలతో భారతానువాదం సాగించడానికి కారణం తెలుస్తూనే ఉంది. ఐతే మానవుడు తన వేషభాషల్తో ఎంత ఉన్నతీకరించుకున్నా సహజలక్షణాలు అంతర్లీనంగా ద్యోతకమౌతూనే ఉంటాయి. సంస్కృతభాషా ప్రభావమెంతున్నా అక్కడక్కడా నాటి జనపదాల్లో వాడుతున్న తెలుగు జాతీయాలు, సామెతలు, క్రియాపదాలు ఆంధ్రభారత విహాయసంలో మిలమిలలాడుతూనే ఉంటాయి. వాటిలో నన్నయవాడిన కొన్ని తెలుగు పదాలు నేటికీ కళింగాంధ్రలో ఎలా సజీవంగా ఉన్నాయో వివరించే ప్రయత్నంచేస్తాను.

ములుకోల: ‘‘ ‘దీనిం జిత్తగింపుము; బలంబు గల బలీవర్దంబులతో బలహీనంబులయిన వానిం బూన్చిన నవి దుర్వహ భారవహన మహాలాంగలా కర్షణంబులయం దసమర్థంబులైన నడిచియుం బొడిచియు ములుకోలలం గుట్టియు దుర్బల బలీవర్దంబుల జనులు బాధింపం జూచి యేను దానికి దుఃఖించెద’ ననిన సురభికి సురపతి యిట్లనియె’’ (అరణ్య-1-84)

అంటే- ‘‘ఓ ఇంద్రా! విను. బలమైన ఎద్దులతో బలంలేని ఎద్దులను పూసి బరువులను లాగిస్తున్నప్పుడు, పొలాల్ని దున్నుతున్నప్పుడు బలంలేని ఎద్దులు వెనుక బడతాయి. వానిని కొట్టి, పొడిచి ములుకోలతో గుచ్చి ప్రజలు బాధించడం చూసిన నేను దుఃఖపడుతున్నాను’’ అని సురభి దేవేంద్రునితో పలికింది. ఈ సందర్భంలో ఈ క్రింది శ్లోకాన్ని సాక్షాత్తు వ్యాసుడే ధృతరాష్ట్రునితో అంటాడు వ్యాసభారతంలో:

‘‘ప్యశ్యైనం కర్షకం క్షుద్రం దుర్బలం మమ పుత్రకమ్‌!

ప్రతోదేనాభినిఘ్నంతం లాంగలేనచ పీడితమ్‌!!’’ (వ్యాసభారతం-వన-9-10)

‘‘క్షుద్రుడైన కర్షకుడు నాగలితో దున్నే సమయంలో బలహీనమైన ఎద్దును బాధిస్తున్నాడు’’ అని ఈ శ్లోకభావం. వ్యాసుని కాలానికే ఎద్దులచేత దున్నించి వ్యవసాయంచేసే వారని, బరువులను లాగించేవారని ఈ శ్లోకాల వలన తెలుస్తోంది.

ఇక్కడ వ్యాసుడు ఐదు అనుష్టుప్‌ శ్లోకాలలో రాసిన సురభి పరితాపాన్ని ఒక పొడవైన వాక్యంలో సరిపెట్టాడు నన్నయ. సంస్కృత ఏకవచన బలీవర్దాన్ని నన్నయ బహువచనంలోకి మార్చి రైతుదౌష్ట్యాన్ని విస్తారం చేశాడు. నడవలేని ఎద్దులను ములుకోలతో పొడిచి నడిపిస్తారని రాశాడు. ఇక్కడ ముల్లుకోల = ములుకోల. కళింగాంధ్రలో అదే మునకాల, మునకాల కర్రగా నేటికీ వాడుతున్నారు. ఎక్కి తోలేటపుడు కొరడాను, వెనుక నడుస్తూ అదిలించడానికి ములుకోలను సాధారణంగా వాడుతుంటారు. అదే వచనంలో నన్నయ ‘దుర్బల బలీవర్దంబుల జనులు బాధింపం జూచి’ అని రాశాడు! ఇక్కడ జనులంటే రైతులే! ఆనాడు కొద్దిమంది తప్ప ప్రజలందరూ వ్యవసాయం చేసేవారు. ఇప్పటికీ రైతుకులాలే కాకుండా ఇతరత్రా వృత్తులు చేస్తున్నవారు కూడ వ్యవసాయం చేస్తుండడం పల్లెల్లో చూస్తుంటాం. నన్నయ నాడు రైతులే జనులు. జనులే రైతులు.

ఈ కోలను నన్నయ్యభట్టు మరోచోట కూడ వాడాడు. ఏకచక్రపురంలో బకాసురుడు వంతులవారీగా మనుషుల్ని తినేస్తుంటాడు. ఒక రోజు ఓ బ్రాహ్మణ బాలుడి వంతు వస్తుంది. ఆ సందర్భంలో ఆ బాలుడి చేష్టలను నన్నయ ఇలా వర్ణించాడు.

‘‘బాలకుండొక కొండుక కోలచేతఁ

బట్టికొని యేన రక్కసుఁ గిట్టి చంపి

చులుక వత్తు మీరేడ్వగా వలవ దనుచుఁ’’ (ఆంధ్ర భారతం-ఆది-6-263)

- బాలుడు ‘ఒక కర్రను పట్టుకొని ఆ రాక్షసుడ్ని చంపి సులువుగా వస్తాను. మీరు ఏడవ వద్దు.’ అని అంటాడు. ఈ పద్యంలోని కోల, చులక రెండు పదాలు నేటికీ వాడుకలో ఉన్నాయి. కోల అంటే కర్ర అని చెప్పుకున్నాం కదా! చేనేత వృత్తిలో కూడ ‘కోల’ వాడుక ఎక్కువ. కోలను ఆయుధంగా కూడ వాడేవారు. ‘చులక’ను చులాగ్గా అని, సులాగ్గా అని నిత్యం ఉపయోగిస్తూనే ఉంటారు కళింగాంధ్రలో.

అవురుగంట వేళ్లు: ‘‘ఏమాతని పితృపితామహులము. మా పట్టిన యవురు గంట వేళ్ళల్లం గాలుండు మూషిక వ్యాజంబునం దరతరంబ కొఱికిన నొక్కవేర తక్కియున్నయది.’’ (ఆది-2-144)

ఇది జరత్కారుని కథలోనిది. జరత్కారుడు పెళ్ళిచేసుకోకపోవటం వల్ల కొడుకులు లేక జరత్కారుని వంశానికి చెందిన పితృపితామహులు ఊర్ధ్వలోకాలు పొందలేక అవురుదుబ్బుల వేళ్ళకు వేలాడుతూ ఉండిపోతారు. ఒక్కటి మినహా అన్ని వేళ్ళనూ ఎలుక రూపంలో యముడు కొరికేశాడు. ఈ విషయాన్ని జరత్కారునికే అతని పితృపితామహులు పై వాక్యంలో చెబుతారు.

ఐతే నన్నయ్య ముందరి వచనంలోనే ‘‘వీరణతృణ స్థంభంబు నవలంబించి..’’ (ఆది-2-141) అని వ్యాసభారతంలో ఉన్న ‘వీరణ’ పదాన్ని వాడుకున్నాడు. ఇక్కడ దానిని మళ్ళీ రాయవలసివచ్చి ‘అవురుగంటలు’ అనే స్థానిక వాడుకపదబంధాన్ని వాడాడు. అవురు గంటలు నేటికీ పొలాల్లో పెరుగుతుంటాయి, రైతులు వాటిని తొలగిస్తుంటారు. రాయలువారు కూడ తన ఆముక్తమాల్యదలో ‘‘గంటలు దున్నక మంటి..’’ (ఆము-4-124) అని రాశారు. గంటలు అంటే దుబ్బులు. ‘అవురుదుబ్బులు’ కళింగాంధ్రవాడుక.

గొడిగ రాళ్లు:

‘‘అరుణ సరోరుహ రమ్య మృదులంబులైన యీ తన్వి

చరణతలంబులు గొడిగరాలపైఁ జనుచున్కిఁ జేసి

పరుసంబులై కడు నెఱ్ఱనైనవి...’’ (అరణ్య-3-299)

పాండవులు గంధమాదన పర్వతానికి వెళుతున్నప్పుడు ద్రౌపది నడవలేక మూర్ఛిల్లింది. ఆ సమయంలో ధర్మరాజు ఆమెను చూచి ‘‘ఎర్రతామర పూలవలె సుకుమారమైన ద్రౌపది పాదాలు గొడిరాళ్ళ మీద నడవడం వలన మరింత ఎర్రబడ్డాయి’’ అంటూ విలపించాడు. ఐతే సంస్కృత భారతంలో వ్యాసుడు ఇలా రాయలేదు.

‘‘సుకుమారౌ కథం పాదౌ ముఖం చ కమలప్రభ!

మత్కృతే ద్య వరార్హాయాః శ్యామతాం సముపాగతమ్‌!!’’

(వన-144-11)

‘‘సుకుమారమైన ఈమె పాదాలూ, పద్మకాంతి కల ఈ ముఖమూ నాకోసం నల్లబడి పోయాయి’’ అని భావం. నన్నయ ఇక్కడ ఆమె ముఖాన్ని వదలి, పాదాలు ఎర్రని గొడిగరాళ్ళపై నడవడం వలన మరింత ఎరుపెక్కా యని చెప్పడం సందర్భో చితంగా ఉంది. తెలుగుతనం ప్రతిబింబిస్తోంది. తరువాతి పద్యంలో ‘పరుసంపు ఱాలపైఁబడి తీవ్రవేదనఁ బొందినయది’ అంటూ ‘ఈ రాజపుత్రిఁ దోడ్కొని దారుణ పాషాణ దుష్పథంబులఁ జనఁగా నేర; మిది నడువ నోపదు..’ (అరణ్య-3-302) అని ధర్మరాజు భీమునితో అనడం కూడా ఈ గొడిగ రాళ్ళ ప్రాధాన్యత తెలియజేస్తుంది.

గొడిగరాళ్ళు = గుండ్రని చిన్న రాళ్ళు. గొడిరాళ్ళు కళింగాంధ్ర జనులవాడుక. వీటిని వడిసెలలో పెట్టి విసిరి కొడతారు. ఆంగ్లంలో గ్రావెల్‌. నేడు ఈ ఆంగ్ల పదమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పర్యాయపదం గులకరాళ్ళు అని పండితాభిప్రాయం.

గొప్పు: గ్రొప్పు = గ్రొచ్చు + గొచ్చు = గొప్పు....

‘‘మిన్న మిడుఁగుఱు లట్టులై మెఱసి రెండు మెఱుఁగు లొక పుట్టలో నున్న నెఱుఁగ కేను బుట్ట గ్రొప్పించి’’ (అరణ్య -3-179)

‘‘పుట్ట కన్నాల్లో రెండు మెఱుపులు కనిపిస్తే అవేంటో తెలియకుండానే పుట్టని తవ్వించాడు.’’ నేటికీ కళింగాంంధ్రలో గొప్పుతవ్వడం రైతులు చేస్తుంటారు. మెరక పొలాల్లో వేరుసెనగ వంటి మొక్కల మధ్య బొరిగలతో గొప్పు తవ్వుతారు. నేలను నీరు కోతపెడితే గొచ్చింది అని అంటారు. శబ్దరత్నాకరంలో గ్రొచ్చు పదానికి ‘గుద్దలి లోనగు వాటిచే పల్లముచేయు’ అని అర్థం ఇచ్చి ‘‘వ్రాత యందిది పరుషాదిగా గానబడుచున్నది’’ అని అన్నారే గాని గ్రొప్పు పదాన్ని స్పృశించలేదు. నన్నయ ప్రయోగాన్ని వారు చూడలేదనిపిస్తోంది.


మొదవు: ‘‘మృదు రోమములును, శంకునిభ కర్ణముల్‌, మెత్తని వలుఁద పొదుఁగును....మొదవిది నిధి సేరినట్లు సేరె నిమ్మునికి.’’ (ఆది-7-99)

మొదవు = పాడియావు. ఈ నాటికీ రైతులు పాడియావును మొదవు అనే పిలుస్తారు. మొదవు లాగున్నాడు అంటూ కళింగాంధ్రలో ఎగతాళిగా తిడతారు.

పొలుసు: ‘‘మీన్పొల వచ్చు జాలరిదాన’’ (ఆది-3-40) ‘‘చేపల కంపు వస్తున్న జాలరి దానను’’ అని అర్థం. ‘పొల’ను కంపు అనే అర్థంలో గ్రంథాలలో వాడినా నేడు చేపలపై నున్న పొట్టు అనే అర్థంలో పొలుసు అనే పదాన్నే విస్తారంగా వాడుతున్నారు. పొల నుండి వచ్చిందే పొలసు, పొలుసు. అప్పటి జాలరులు నేడూ ఉన్నారు. భారతంలోని సత్యవతి కుటుంబం ఎలాగైతే పడవ నడిపి జీవించేదో నేటికీ జాలరులు అలాగే పడవ నడుపుతూ, చేపలు పట్టి, అమ్ముకుంటూ జీవిస్తున్నారు. జాలము అనగా వల. జాలములు కలిగినవారు జాలరులు. జాలారులు.

ఎఱుకు: ‘‘ఏయ రెఱచి యాహారముగ మను నెఱుకు లయిన’’ (ఆది-5-53). ఆంధ్రభాషలో తొలి గ్రంథంలోనే స్థిరపడిన ‘ఎఱుకుల’వారు నేటికీ ఆంధ్రదేశంలో విస్తారంగా ఉన్నారు. వరి వంటి ధాన్యాలను దాచుకోడానికి వెదురుతో గాదెలు, పొడకలు, బుట్టిలు వంటి పెద్ద వస్తువులను తయారు చేస్తారు. పక్షులను వేటాడి అమ్ముకొని, తిని జీవిస్తుంటారు. ఎఱుకులసాని వీరి ఇంట పుట్టినదే కదా!

కోమటి: ‘‘పచరింతు రంగడులఁ గోమటు లప్పురి నిద్ధ రత్నముల్‌’’ (ఆది-8-73) వైదిక సంద్రాయంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చెప్తూవస్తున్న నన్నయభట్టు ఇక్కడ కోమటి అనే వ్యవహారవాచకాన్ని వాడాడు. ఇంద్రప్రస్తపురం లోని కోమటులు అక్కడి అంగడులలో జాతిరత్నాలను ప్రదర్శిస్తున్నారట. నన్నయ ప్రారంభించిన ఈ నగరవర్ణన, నగరిలోని కులాలను వర్ణించడం తరువాతి కవులకు ఆదర్శం అయింది. జైనమతంలోని పశుసంపద కలిగిన గోమఠులే కోమటులయ్యారని, వర్తకం చేస్తూ సంపన్నులుగా స్థిరపడ్డారని చరిత్ర. ఈ పద్యంలోని అంగడి సరుకు నేడూ వాడుకలో ఉంది.

ఈ విధంగా నన్నయ భారతానువాదాన్ని తరచిచూస్తే పైన ఉదాహరించినవే కాకుండా చెఱువులు, నూతులు వంటి నామవాచకాలు, ముండ్లు గండ్లు, ముచ్చుగొఱక వంటి పదబంధాలు, తూనీగల గొఱ్ఱుపెట్టు వంటి నానుడులు, ఎన్నో క్రియాపదాలు ఈనాటికీ కళింగాంధ్రలో వాడుతుండడం గమనించవచ్చు. నన్నయభట్టు కళింగానికి పడమటి సరిహద్దు రాజమహేంద్రవరంలో నివసించడం, మధ్యాంధ్రలో జరిగినంత సాంస్కృతిక పరిణామం ఈ ప్రాంతంలో జరగకపోవడం వలన కూడ ఆయా పదాలు వెయ్యేళ్ళు అయినా కళింగాంధ్రలో ఇంకా నిల్చి ఉన్నాయని చెప్పవచ్చు.

గార రంగనాథం

98857 58123

Updated Date - Jan 08 , 2024 | 12:33 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising