ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భారత రాజ్యాంగం విప్లవకరమైనదే కానీ...

ABN, First Publish Date - 2024-02-06T02:03:28+05:30

వర్తమాన భారత రాజకీయ రంగంలో రెండు పరస్పర విరుద్ధ వాస్తవాలు ఒకేసారి కొనసాగుతున్నాయి. మొదటిది: ఒక ప్రజాస్వామిక రాజ్యాంగం అమలులో వున్నది. కొందరు దీన్ని లౌకిక, సామ్యవాద రాజ్యాంగం అని కూడ అంటున్నారు...

వర్తమాన భారత రాజకీయ రంగంలో రెండు పరస్పర విరుద్ధ వాస్తవాలు ఒకేసారి కొనసాగుతున్నాయి. మొదటిది: ఒక ప్రజాస్వామిక రాజ్యాంగం అమలులో వున్నది. కొందరు దీన్ని లౌకిక, సామ్యవాద రాజ్యాంగం అని కూడ అంటున్నారు. రెండోది: దేశ పాలన ఫాసిస్టు శక్తుల చేతుల్లోకి పోయింది. ప్రజాస్వామిక రాజ్యాంగం అమలులో ఉన్న కాలంలోనే రాష్ట్రపతి ఉత్తర్వులతో దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడాన్ని మనం చూశాం. ప్రజాస్వామిక, లౌకిక, సామ్య వాద రాజ్యాంగం అమల్లోవున్న కాలంలోనే ఫాసిస్టు శక్తులు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడాన్నీ ఇప్పుడు చూస్తున్నాం.

రాజ్యాంగం అమాయికంగా ఫాసిజాన్ని ప్రమోట్ చేస్తున్నదా? ఫాసిస్టులు రాజ్యాంగాన్ని తెలివిగా వాడుకుంటున్నారా? అనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తడం సహజం. ఎలా చూసినా భారత రాజ్యాంగం విప్లవకరమైనది. మనువు విధించిన సామాజిక నిబంధనలతో, చాణుక్యుడు/ కౌటిల్యుడు / విష్ణుగుప్తుడు రూపొందించిన ఆర్థిక విధానాలతో నడిచే వ్యవస్థలో నలిగిపోతున్న కోట్లాది మంది ప్రజానీకానికి అది కొత్త జీవితాన్ని ఇచ్చింది. మరోమాటలో చెప్పాలంటే, కుల–మత ప్రధాన ఫ్యూడల్ వ్యవస్థను పెట్టుబడీదారీ వ్యవస్థగా మార్చడంలో రాజ్యాంగం కేటలిస్ట్ పాత్రను నిర్వహించింది. సమాజంలో వచ్చిన ఆ గుణాత్మకమార్పును మనం స్పష్టంగా చూస్తున్నాం. అందుకు రాజ్యాంగాన్ని మెచ్చుకోవాలి.

రాజ్యాంగ సభలోని దాదాపు డజను కమిటీల్లో కీలకమైన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన బిఆర్ అంబేడ్కర్ తన చివరి ఉపన్యాసంలో (నవంబరు 25, 1949) రాజ్యాంగం పరిధి–పరిమితుల గురించి ప్రస్తావించాడు. ‘ప్రతి మనిషికీ ఒక ఓటు; ప్రతి ఓటుకూ సమాన విలువ ఇవ్వడం ద్వారా రాజకీయరంగంలో సమానత్వాన్ని సాధించాం. అయితే, ఇది సరిపోదు. సాంఘిక, ఆర్థిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించి తీరాలి. భవిష్యత్తు పాలకులు అందుకు కృషి చేయాలి. వాళ్ళు సాధ్యమైనంత త్వరగా సాంఘిక, ఆర్థిక రంగాల్లో సమానత్వాన్ని సాధించకపోతే ఆ రంగాల్లోని పీడితులకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. అప్పుడు వాళ్ళు తిరగబడి ఇన్నేళ్ళుగా మనం కష్టపడి నిర్మించిన ఈ ప్రజాస్వామిక భవనాన్ని పేల్చి పడేస్తారు’ అని హెచ్చరించాడు. ప్రతిదానికీ వున్నట్టు రాజ్యాంగాలకూ ఒక ఎక్స్‌పైరీ డేట్ వుంటుంది; అది పెట్టుబడిదారుల రాజ్యాంగం కావచ్చు, సోషలిస్టుల రాజ్యాంగం కావచ్చు. దేనికీ మినహాయింపు లేదు. రాజ్యాంగాలు ఎల్లకాలం తొలినాటి ఆదర్శాలతో కొనసాగలేవని వివిధ దేశాల చరిత్ర మనకు చెపుతున్నది.

స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ముస్లింలను ఒక పథకం ప్రకారం ‘నయా అస్పృశ్యులు’గా మార్చారు. 2019 లోక్‍సభ ఎన్నికల్ని పీష్వా బాలాజీ బాజీరావు, అహమద్ షా దుర్రానీ అబ్దాలీల మధ్య పోటీగా జరిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఛత్రపతి శివాజీ, ఔరంగజేబ్‌ల మధ్య పోటీగా జరిగాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రాణి అబ్బక్క, టిప్పూ సుల్తాన్‍ల మధ్య పోటీగా జరిగాయి. రేపు లోక్‍సభ ఎన్నికలు శ్రీరామునికీ శంభూకునికి మధ్య జరపడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నారు.

పోటీలో వున్న ఏ అభ్యర్థీ తమకు నచ్చలేదని చెప్పడానికి పోలింగ్‌లో ‘నోటా’ను వాడడం ఒక ప్రజాస్వామిక హక్కుగా మనం భావిస్తున్నాం. ‘ముస్లింల ఓట్లు మాకు వద్దు’ అనడం కూడా ఎన్నికల్లో ఒక ప్రజాస్వామిక హక్కుగా చెలామణీ అయిపోతున్నది. ఐదేళ్ళకొకసారి ఎన్నికలు జరగడమే కొలమానం కనుక దీన్ని వామపక్షాలు సహితం ప్రజాస్వామ్యం అనక తప్పడంలేదు. పైగా, ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా, దేశ అత్యున్నత న్యాయస్థానం ఆశీస్సులతోనే జరుగుతున్నాయి.

భూస్వామ్య వ్యవస్థ కన్నా పెట్టుబడీదారీ వ్యవస్థ విప్లవకరమైనదని కార్ల్ మార్క్స్ – ఫ్రెడరిక్ ఏంగిల్స్ స్వయంగా మెచ్చుకున్నారు. లెనిన్‌కూ అలాంటి అభిప్రాయమే వుంది. పెట్టుబడీదారీ వ్యవస్థను మించిన సోషలిస్టు, కమ్యూనిస్టు సమాజాలను నిర్మించాలంటే పెట్టుబడీదారీ రాజ్యాంగాన్ని మించిన రాజ్యాంగాలను రూపొందించుకోవాలని వాళ్ళు సమంజసంగానే ఆలోచించారు. మహాత్మా గాంధీజీ మరణం తరువాత 1948 ఫిబ్రవరిలో కలకత్తాలో జరిగిన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభల్లో అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి బిటి రణదివె స్వాతంత్ర్యాన్ని ‘అధికార మార్పిడి’గా పేర్కొన్నాడు. దాదాపు అదే సమయంలో రాజ్యాంగ సభ లక్ష్య ప్రకటన తీర్మానాన్ని (ఆబ్జెక్టివ్ రిజల్యూషన్) ఆమోదించింది. ‘న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం’ వంటి ఆదర్శాలు ఆ తీర్మానంలో వున్నాయి. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ అప్పటికి వాటిని నమ్మలేదు సాయుధ పోరాటానికి పిలుపిచ్చింది. లక్ష్య ప్రకటన తీర్మానమే తరువాత రాజ్యాంగ ప్రవేశిక (preamble)గా మారింది.

రాజ్యాంగం మీద చర్చను ఒక విధంగా అంబేడ్కరే మొదలెట్టాడు అనవచ్చు. రాజ్యాంగం ఒక నిబంధనావళి కనుక అందులో ప్రకటించుకున్న ఆదర్శాలకన్నా వాటిని అమలు చేసేవారే ముఖ్యం. ‘అమలుపరచేవారు చెడ్డవారయితే మంచి రాజ్యాంగం కూడ చెడ్డదయిపోతుంది. అమలుపరచేవారు మంచివారయితే చెడ్డ రాజ్యాంగం కూడ మంచిదయిపోతుంది’ అన్నాడు. అంతటితో ఆగలేదు; ‘గొప్ప ఆదర్శంతో దేవాలయాన్ని నిర్మిస్తే దాన్ని ప్రారంభించడానికి ముందే దెయ్యాలు ఆక్రమించుకున్నాయి’ అన్నాడు. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక కూడా సమాజంలో పీడన కొనసాగుతుంటే దాన్ని ఇతరులకన్నా ముందు తనే తగలబెడతాననీ అన్నాడు.

‘ఆలోచనాపరులు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు; కానీ చెయ్యాల్సిందేమంటే దాన్ని మార్చడం అన్నాడు’ కార్ల్స్ మార్క్స్. లెనిన్ మరింత స్పష్టంగా ‘నిర్దిష్ట పరిస్థితుల, నిర్దిష్ట విశ్లేషణ’ అన్నాడు. విశ్లేషించడం అంటే ఆ వ్యవస్థలో పీడకులు ఎవరో, పీడితులు ఎవరో తేల్చడం. భారత సమాజ నిర్దిష్ట పరిస్థితుల, నిర్దిష్ట విశ్లేషణను భారత కమ్యూనిస్టు పార్టీలు ఏవీ ఇప్పటి వరకు చేయలేదు. ముఖ్యంగా, అప్పట్లో కుల వ్యవస్థనూ, ఇప్పట్లో మత వ్యవస్థను నిర్దిష్టంగా విశ్లేషించలేదు. సాంస్కృతిక మ్యాపింగ్ విధానాలు (Cultural Cartography) అభివృద్ధి చెందిన కాలంలో అలాంటి విశ్లేషణలు చేయకుండా కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన పోరాటాలు లక్ష్యాలను సాధించలేదు. పైగా, పెట్టుబడీదారీ వ్యవస్థ బలపడడానికే అవి దోహదపడ్డాయి. పీడిత ప్రజలు ఆర్థిక ప్రయోజనాలకు ఆశపడేమాట నిజమేగానీ వాళ్ళు అంతకన్నా తమ సాంస్కృతిక ఉనికినే బలంగా కోరుకుంటారు. కమ్యూనిస్టు పార్టీలు ప్రజాదరణను క్రమంగా కోల్పోతుండడానికి ఇది ప్రధాన కారణం.

వ్యవస్థ భూస్వామ్యం నుండి పెట్టుబడీదారీ దిశగా, అక్కడి నుండి కార్పొరేట్ దశగా మారే క్రమంలో ఎస్టీ ఎస్సీ బీసీలకు చాలా మేళ్లు జరిగాయి. పట్టణీకరణ – నగరీకరణ జరిగేకొద్దీ బహుజనుల ఆత్మగౌరవం పెరిగింది. వాళ్ళ ఉనికిని కాపాడే అనేక చట్టాలు వచ్చాయి. కనీసం మనుషులుగానే పరిగణించని సమూహాలకు వ్యక్తిగత ఆస్తిహక్కు వచ్చింది. వ్యక్తిగత ఆస్తిహక్కు వల్ల కార్పొరేట్లకే ఎక్కువ మేలు జరుగుతున్నదనేది నిజమే. సంపద ఒక చోట పోగవుతూ మరోవైపు పేదరికం పెరుగుతున్నదనేదీ వాస్తవమే. అయినప్పటికీ, సాంస్కృతికంగా అణగారిన సమూహాలకు ఇప్పటి స్థితి కొంచెం ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నది. దీనికి కారణం రాజ్యాంగమేనని వాళ్ళు నమ్ముతారు. ఈ ఘనత అంబేడ్కర్‌దేనని వాళ్ళు భావించడమూ సహజం.

మరోపక్క మార్క్సిస్టు – లెనినిస్టు పార్టీలకు పెట్టుబడీదారీ రాజ్యాంగం మీద ఎన్నడూ నమ్మకం లేదు. రాజ్యాంగ ఆదర్శాలను ప్రభుత్వాధినేతలు పాటించరు అనే అభిప్రాయం వారిలో బలంగా వుంటుంది. వాళ్ళే ప్రకటించుకున్న రాజ్యాంగాన్ని వాళ్ళే పాటించడం లేదు అనేది వాళ్ళ ప్రధాన విమర్శ. ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగా కార్పొరేట్లు హైజాక్ చేసినపుడు ప్రత్యామ్నాయం ఏమిటీ? అనేది సమంజసమైన ప్రశ్న. ఇటీవల విజయవాడలో జరిగిన విప్లవ రచయితల సంఘం (విరసం) మహాసభలో ఇదే ప్రధాన చర్చనీయాంశం.

ముస్లిం మతమైనారిటీల ఉనికి అంతరించిపోయే సందర్భం వచ్చినపుడు తలెత్తిన షాహీన్ బాగ్ ఉద్యమం భారత రాజ్యాంగాన్నే ఆశ్రయించింది. నిరాశ్రయులు, నిస్సహాయులకు అది పెద్ద దిక్కుగా కన్పించింది. ‘స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం’ నినాదాలతో ఢిల్లీ నగర శివార్లు ప్రతిధ్వనించాయి. ఆ తరువాత సాగిన రైతాంగ ఉద్యమం షాహీన్ బాగ్ నుండే స్ఫూర్తి పొందింది. ఉమ్మడి పౌరస్మృతి అంశం ముందుకు వచ్చినప్పుడు ఈశాన్య భారతదేశంలోను ఆదివాసులు షాహీన్ బాగ్ మార్గాన్నే అనుసరించారు. రాజ్యాంగాన్ని హృదయాలకు హత్తుకున్నారు.

కార్పొరేట్ వ్యవస్థను, అది రాజ్యాంగ ఆదర్శాలను కాలరాస్తున్న తీరునూ విరసం విమర్శించడంలో తప్పులేదు. విమర్శించాలి కూడా. పనికి రానపుడు రాజ్యాంగాన్నీ తిరస్కరించవచ్చు. కానీ, రాజ్యాంగంవల్ల తమ జీవితాలు బాగుపడ్డాయని నమ్ముతున్న పీడిత సమూహాలతో సున్నితంగా వ్యవహరించాలి. మతోన్మాదాన్ని ఆశ్రయించి బలపడుతున్న కార్పొరేట్ వ్యవస్థలోని పీడితుల్ని, అస్పృశ్యుల్ని, నయా అస్పృశ్యుల్ని ఏకం చేయడానికి ప్రయత్నించాలి. ఇన్ని విశాల సమూహాలు రాజ్యాంగాన్ని నమ్ముతున్నప్పుడు వాళ్ళను కటువుగా ‘రాజ్యాంగవాదులు’ అనడం ఒక చారిత్రక తప్పిదం అవుతుంది. నిస్సందేహంగా భారత రాజ్యాంగం ఒక సామాజిక విప్లవ దస్త్రం. అంతకన్నా మేలైన సమాజాన్ని నిర్మించాలనుకున్నవారు అంతకన్నా మేలైన, ఆచరణ సాధ్యమైన, రాజ్యాంగాన్ని ప్రతిపాదించాలి.

డానీ

సమాజ విశ్లేషకులు

Updated Date - 2024-02-06T02:03:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising