పర్యావరణ విజయదశమి!
ABN, Publish Date - Oct 12 , 2024 | 02:38 AM
భారతీయ జీవన విధానం ప్రత్యేకమైనది. ప్రపంచానికి ఆదర్శమైనది. సాటి మానవుల పట్ల సహానుభూతితో పాటు, పశుపక్ష్యాదుల పట్ల ఆదర భావం, పర్యావరణం పట్ల బాధ్యత కలిగి ఉండాలన్నది మన సంస్కృతిలోని సందేశం. అందుకే మన పండుగలు సైతం...
భారతీయ జీవన విధానం ప్రత్యేకమైనది. ప్రపంచానికి ఆదర్శమైనది. సాటి మానవుల పట్ల సహానుభూతితో పాటు, పశుపక్ష్యాదుల పట్ల ఆదర భావం, పర్యావరణం పట్ల బాధ్యత కలిగి ఉండాలన్నది మన సంస్కృతిలోని సందేశం. అందుకే మన పండుగలు సైతం పర్యావరణానికి మేలు చేయమనే సందేశాన్ని ఇస్తూ ఉంటాయి. వీటిలో దసరా పండుగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పండుగ రోజు శమీ వృక్షాన్ని పూజించమని, పాలపిట్టను చూడమని చెప్పటం వెనుక ఇదే సందేశం దాగి ఉంది. దసరా అంటే సరదాల పండుగ మాత్రమే కాదు, సమాజం పట్ల, ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేసే పండుగ కూడా.
అశ్వత్థమేకం పిచుమందమేకం న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|
కపిత్థ బిల్వా మలకత్రయం చ పంచామ్రవాపీ నరకం న పశ్యేత్||
ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక మర్రి చెట్టు, ఒక వెలగ చెట్టు, పది చింత చెట్లు, మూడు మారేడు చెట్లు, మూడు పెద్ద ఉసిరి చెట్లు, ఐదు మామిడి చెట్లను నాటి బావిని ఏర్పాటు చేసిన వారికి నరక బాధలు ఉండవు అని మన పెద్దల మాట. నరకం అంటే నా దృష్టిలో మరణించిన తర్వాత మనం వెళ్ళే లోకం అని కాదు. భూమి మీద మనం అనుభవించే సమస్యలు. ఈరోజు చెట్లు లేకపోవటం వల్ల మనం, మన పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో విస్తారంగా మొక్కలు పెంచండి, వాటి సంరక్షణ కోసం జల వనరులను ఏర్పాటు చేయండి. అప్పుడు మీరు, మీ ముందు తరాలు హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించవచ్చని మన పెద్దలు ఈ శ్లోకం రూపంలో తెలియజేశారు. ఇప్పటి వరకూ ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ గురించి ప్రాచీన భారతీయులు తెలియజేసినంత గొప్పగా ఎవ్వరూ తెలియజేయలేదన్నది నిర్వివాదాంశం.
నవరాత్రులతో ప్రారంభమైన దసరా పండుగ పదవరోజున విజయదశమితో పరిపూర్ణం అవుతుంది. నవరాత్రులు మనిషిలోని ప్రతికూల ఆలోచనలు, విశృంఖలత్వాన్ని నిర్మూలించి శ్రేయస్సు దిశగా మనిషిని నడపటానికి ప్రతీక. ఈ తొమ్మిది రోజులు మూడు రోజుల చొప్పున త్రిగుణాలకు ప్రతీకలు. సత్వరజస్తమో గుణాలకు ప్రతీకగా సరస్వతి, లక్ష్మి, దుర్గలను వివిధ రూపాల్లో పూజిస్తారు. ఈ మూడు గుణాలను జయించి, అందులోని సానుకూల అంశాలను స్వీకరించినప్పుడు విజయాలు వశమౌతాయని చెప్పటమే విజయదశమి సందేశం. శ్రీరామచంద్రుడు రావణుడిపై గెలుపు సాధించటమేగాక, పాండవులు వనవాసం, అజ్ఞాత వాసాలు ముగించుకుని జమ్మిచెట్టు మీద నుంచి తమ ఆయుధాలు స్వీకరించి, విజయం దిశగా ముందుకు నడిచిన రోజు కూడా అని మన పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా జగన్మాత దుర్గాదేవి, లోక కంటకుడైన మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి, వధించిన సందర్భాన్ని పురస్కరించుకుని పదవరోజున పండుగ చేసుకోవటాన్ని కూడా దసరా ప్రాధాన్యతగా పెద్దలు వివరిస్తారు. అందుకే విజయదశమి రోజున ప్రారంభించిన కార్యక్రమాలు, విజయమార్గంలో మనల్ని ముందుకు నడుపుతాయన్నది పెద్దల మాట. ఒక్క మాటలో చెప్పాలంటే చెడు మీద, మంచి సాధించిన విజయమే దసరా. ప్రతికూలత మీద సానుకూల దృక్పథం సాధించిన విజయమే విజయదశమి.
పాలపిట్టను చూడటం, జమ్మిచెట్టును పూజించటం వంటి సంప్రదాయాలను దసరా ఉత్సవాల్లో ప్రధానంగా చూపటం వెనుక పర్యావరణ పరిరక్షణకు మన పెద్దలు ఇచ్చిన ప్రాధాన్యత కనిపిస్తుంది. అలాంటి పర్యావరణాన్ని సంరక్షించుకునే దిశగా ‘‘అమ్మ పేరిట ఒక మొక్క’’ అనే కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీకారం చుట్టారు. భారత సంస్కృతి అమ్మ అనే భావనకు విస్తృతమైన అర్థాన్ని చెప్పింది. అమ్మ అంటే కన్నతల్లితో పాటు మనకు మేలు చేసే ప్రతి స్వరూపం అంటే గోవు, నది, ఆధ్యాత్మిక రూపం... ఇలా అన్ని స్వరూపాలను అమ్మగా చూడటం మనకు మన సంస్కృతి నేర్పింది. ఈ నేపథ్యంలో అమ్మ పేరిట మొక్క నాటటం అంటే సమస్త ప్రకృతిని గౌరవించటం గానే భావించాలి. అమ్మకు మనం ఏ విధమైన గౌరవాన్ని ఇస్తామో, పర్యావరణానికి కూడా అదే గౌరవాన్ని ఇచ్చి ప్రేమించాలన్నది ఇందులోని అంతరార్థం. స్వచ్ఛభారత్ దిశగా దశాబ్ది ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో పరిశుభ్రతతో పాటు, పచ్చదనాన్ని పెంచాలన్న భారత ప్రభుత్వ సంకల్పం ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే స్వచ్ఛభారత్ ప్రజా ఉద్యమంగా మారి, దేశంలో ఓ సానుకూల మార్పునకు బీజం వేసింది. ఇప్పుడు అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమాన్ని కూడా అదే స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన ప్రకృతి విపత్తులు నన్నెంతగానో కలచివేశాయి. పర్యావరణాన్ని మనం రక్షించలేకపోవటం వల్ల, ప్రకృతి విపత్తుల నుంచి బయట పడలేకపోయాం అన్నది నిర్వివాదాంశం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ ఆక్రమణ విషయంలో తీసుకుంటున్న చర్యలు అభినందించదగినవి. దశాబ్దాలుగా అధికారుల అలసత్వం, కొందరి స్వార్థబుద్ధి, మరెంతోమంది పేదరికం కారణంగా మూసీ ఆక్రమణలకు గురైంది. దానితో పాటుగా హైదరాబాద్లో మొత్తం 920 చెరువుల్లో దాదాపు 498 ఆక్రమణల ఊబిలో కూరుకుపోయాయన్న తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 225 చెరువులు పూర్తిగా కనుమరుగు అయ్యాయన్న వాస్తవం జీర్ణించుకోవటం కష్టమే. ఇలాంటి నేపథ్యంలో నీరు పోవటానికి చోటు లేనప్పుడు చిన్నపాటి వర్షాలు కూడా పెనువిపత్తుగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి ఆక్రమణ విషయంలో తెలంగాణ ప్రభుత్వ చేపడుతున్న చర్యలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలి. ప్రభుత్వం ఆక్రమణలను తొలగించటం మంచిదే. అయితే అదే సమయంలో పేదలకు అవసరమైన పూర్తి సహకారం అందించి, వారికి సురక్షితమైన ఆవాసాలను ఏర్పాటు చేసి, ఆర్థికంగానూ దన్నుగా నిలవాలని సూచిస్తున్నాను. ఈ ఆక్రమణలకు అవగాహన లోపం, పేదరికం వంటివి కూడా కారణాలు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకుని పేదలకు అండగా నిలిచినప్పుడు, ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి.
అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది, వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల పరిమాణం పెరుగుతోంది, చెరువులు, నదులు వంటి జలవనరులను ఆక్రమించుకోవడం కారణంగా వరదల ద్వారా ప్రకృతి ప్రకోపాన్ని మనం అనుభవిస్తున్నాం. అభివృద్ధి చెందాలన్న ప్రయత్నంలో పర్యావరణాన్ని ధ్వంసం చేసుకుంటున్నామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పర్యావరణం – ప్రగతి అనేవి రెండు వేరు వేరు అంశాలు కావు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమౌతుంది. ప్రకృతి పరిరక్షణ అనేది వ్యాపారం కాదు. ఈ మహాయజ్ఞంలో మనమంతా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాల్సిన అవసరముంది. ఈ విజయదశమి పండుగను మనమంతా ఆ కోణంలో చూడాలి. ఈరోజు ప్రారంభించిన ఏ పని అయినా విజయవంతం అవుతుంది. అందుకే ఈ నవరాత్రుల సమయంలో అమ్మ పేరిటే కాకుండా, అమ్మవారి పేరిట కూడా మొక్కలు నాటి దేశం పట్ల, సంస్కృతి పట్ల మన గౌరవాన్ని చాటుదాం. పర్యావరణ పరిరక్షణలో విజయం సాధించి, భావితరాలకు ‘విజయ దశ’మి ని అందిద్దాం.
ముప్పవరపు వెంకయ్యనాయుడు
పూర్వ ఉపరాష్ట్రపతి
Updated Date - Oct 12 , 2024 | 02:38 AM