చెత్త పన్ను రద్దు
ABN, Publish Date - Sep 21 , 2024 | 03:59 AM
గత వైసీపీ ప్రభుత్వం విధించిన చెత్త పన్నును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల పురపాలక శాఖపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నిర్ణయం తీసుకొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మరో ఎన్నికల హామీ నెరవేర్చిన టీడీపీ
అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం విధించిన చెత్త పన్నును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల పురపాలక శాఖపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత వైసీపీ ప్రభుత్వం విధించిన చెత్తపన్ను తీవ్ర వివాదాస్పదమైంది. నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటి నుంచీ ప్రతి నెలా ఈ పన్ను వసూలు చేయాలని నిర్ణయించి వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను రంగంలోకి దించారు. అనుకొన్న స్థాయిలో చెత్త పన్ను వసూళ్లు లేవని భావించి ఆస్తి పన్నులో దీనిని కలిపేసి వసూలు చేయాలని కూడా భావించారు. చెత్త పన్నును టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము అధికారంలోకొస్తే దాన్ని రద్దు చేస్తామని కూడా ప్రకటించింది. ఇటీవల పురపాలక శాఖపై సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. ‘‘చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఇకపై వసూలు చేయవద్దు’’ అని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. చెత్త తరలింపునకు అయ్యే ఖర్చును కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు తమ సొంత ఆదాయ వనరుల నుంచి భరించాలని ఆయన సూచించారు.
Updated Date - Sep 21 , 2024 | 03:59 AM