ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వర్రా ఎక్కడ?

ABN, Publish Date - Nov 09 , 2024 | 05:10 AM

కూటమి నేతలపై సోషల్‌ మీడియాలో కాలకూట విషం చిమ్మిన వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త, జగన్‌ సతీమణి భారతి పీఏ, ఎంపీ అవినాశ్‌ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రా రెడ్డి ఎక్కడ? పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారా? లేక...

పట్టుకున్నారా... మళ్లీ పారిపోయాడా?

అరెస్టును ధ్రువీకరించని పోలీసులు

హైదరాబాద్‌ వెళ్తున్నట్లు గుర్తించాం..

అతడి సెల్‌ఫోన్‌ ట్రాక్‌ చేశాం

ఫోన్‌ ఆఫ్‌ చేయడంతో జస్ట్‌ మిస్‌: డీఐజీ

కర్నూలు/కడప/అమరావతి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): కూటమి నేతలపై సోషల్‌ మీడియాలో కాలకూట విషం చిమ్మిన వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త, జగన్‌ సతీమణి భారతి పీఏ, ఎంపీ అవినాశ్‌ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రా రెడ్డి ఎక్కడ? పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారా? లేక... మరోసారి మస్కా కొట్టి తప్పించుకున్నాడా? దీనిపై పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. మంగళవారం అర్ధరాత్రి వర్రా కడపలో పోలీసులను ఏమార్చి తప్పించుకున్నాడు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కడప ఎస్పీని బదిలీ చేయడంతోపాటు... సీఐపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఆ క్షణం నుంచే వర్రా కోసం వేట మొదలైంది. ‘గ్రేట్‌ ఎస్కేప్‌’ తర్వాత అతను బెంగళూరుకు చేరుకున్నటు పోలీసులు అనుమానించారు. కానీ... బెంగళూరు సేఫ్‌ కాదనే ఉద్దేశంతో శుక్రవారం వర్రా కారులో హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలిసింది. కర్నూలు మీదుగా తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రవేశించాక... పోలీసులు వర్రాను అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం సాయంత్రం ప్రచారం జరిగింది. కానీ, పోలీసులు దీనిని ధ్రువీకరించలేదు.


త్రుటిలో తప్పించుకున్నాడు: డీఐజీ

వర్రా రవీంద్రా రెడ్డిని అరెస్టు చేయలేదని, అతని కోసం నాలుగు బృందాలతో గాలింపు కొనసాగుతోందని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ తెలిపారు. ‘‘వర్రా కదలికలపై నిఘా పెట్టాం. అతను కర్నూలు దాటి హైదరాబాద్‌ వెళ్తున్నట్లుగా సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా గుర్తించాం. అయితే... మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వరకు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ట్రాక్‌ అయ్యింది. కొన్ని నిమిషాల్లో అరెస్టు చేయడం ఖాయమని భావించాం. కానీ... ఫోన్‌ ఆఫ్‌ చేయడంతో సిగ్నల్‌ కట్‌ అయింది. వర్రా రవీంద్రా రెడ్డి కోసం గాలిస్తున్నాం. త్వరలోనే అరెస్టు చేస్తాం’’ అని డీఐజీ స్పష్టం చేశారు. జడ్చర్ల సమీపంలో అతని ఫోన్‌ సిగ్నల్‌ మిస్‌ అయ్యిందని, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడో గుర్తించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

బూతు, రోతల వర్రా

వర్రాపై రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కేసులున్నాయి. శ్రుతిమించిన బూతు, రోత భాషతో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. చివరికి... జగన్‌ సోదరి షర్మిలను, వివేకా కుమార్తె సునీతా రెడ్డినీ నీచంగా దూషించాడు. దీనిపై షర్మిల తీవ్ర ఆవేదన చెందారు. ఇక... సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, హోంమంత్రి అనితపై వర్రా దారుణమైన పోస్టులు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వర్రాపై 2018లో విజయవాడ సిటీ, సైబర్‌ క్రైం పోలీసుస్టేషన్‌లో 2 కేసులు, 2022లో తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో 2, పెదనందిపాడు, పొన్నూరు, మదనపల్లె, పోరుమామిళ్ల, రాజంపేట తదితర స్టేషన్లలోనూ అతనిపై కేసులు నమోదయ్యాయి.

Updated Date - Nov 09 , 2024 | 05:13 AM