ఆ.. సబ్ రిజిస్ట్రార్ రూటే వేరు !
ABN, Publish Date - Oct 24 , 2024 | 12:12 AM
పాలకొల్లు సబ్ రిజిస్ట్రార్ రూటేవేరని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ నెల 18వ తేదీన పాలకొల్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎస్‌ఏఎస్ ఫుల్ అడిషనల్ చార్జిగా సుధారాణి బాధ్యతలు స్వీకరించారు.
లంచం ఇస్తేనే పని.. మాజీ ప్రజా ప్రతినిధి వద్ద డిమాండ్
లేఖర్లకు వసూళ్ళపై దిశానిర్దేశం
రిజిస్ట్రేషన్‌లకు గంటల కొద్దీ జాప్యం
రిజిస్ట్రార్‌పై గతంలోనూ ఆరోపణలు
అవినీతికి అడ్డా పాలకొల్లు రిజిస్ట్రార్ కార్యాలయం
పాలకొల్లు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పాలకొల్లు సబ్ రిజిస్ట్రార్ రూటేవేరని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ నెల 18వ తేదీన పాలకొల్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎస్‌ఏఎస్ ఫుల్ అడిషనల్ చార్జిగా సుధారాణి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె ఇక్కడ డ్యూటీలో చేరినప్పటి నుంచి వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నట్లు సంబంధిత కార్యాలయంలోనే గుసగుసలు వినిపించాయి. ఇదిలా ఉండగా మంగళవారం స్థానిక మాజీ ప్రజా ప్రతినిధి ఒకరు రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. సంబంధిత రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తి చేయడానికి మాజీ ప్రజా ప్రతినిధిని ఆమె లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. సీఎం చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఉండే ప్రజా ప్రతినిధినే (మాజీ) సబ్ రిజిస్ట్రార్ లంచం అడగటం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయమై మాజీ ప్రజా ప్రతినిధిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా రిజిస్ట్రేషన్‌కు సంబంధిత రిజిస్ట్రార్ తనను లంచం అడగటం వాస్తవమేనన్నారు. అయితే తాను ఇవ్వడానికి నిరాకరించానని పని పూర్తి అయ్యిందని తెలిపారు. విశేషం ఏమిటంటే సదరు ప్రజా ప్రతినిధి స్థిరాస్థి కొనుగోలు చేయలేదు. బ్యాంక్ మార్ట్‌గేజ్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్‌కు వెళ్ళిన సందర్భంలో లంచం అడగడం గమనార్హం. ఇలా ఉండగా సబ్ రిజిస్ర్టార్ సుధారాణి స్థానికంగా ఉండే దస్తావేజు లేఖర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏ పనికి ఎంత వసూలు చేయాలనే అంశంపై దిశా నిర్దేశాలు చేసినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక లేఖరి తెలిపారు. వసూలు విషయంలో క్రమ శిక్షణ పాటించాలని కక్షిదారులు వద్ద తీసుకున్న మొత్తం సొమ్ము కొంత నొక్కేయకుండా నేరుగా ఇవ్వాలని లేఖర్లను ఆదేశించినట్లు తెలిసింది.
రిజిస్ర్టేషన్లలో జాప్యం
పాలకొల్లులో రిజిస్ట్రేషన్ పక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఒక్కొక్క రిజిస్ట్రేషన్‌కు సుమారు 2 గంటలు సమయం పడుతుందని ఆస్తి కొనుగోలు దారులు అమ్మకం దారులు వాపోతున్నారు. మరో వైపు ఈసీలు, నకళ్ళకు దరఖాస్తులు చేసుకుంటే రెండు మూడు రోజులకు గాని ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా సబ్ రిజిస్ట్రార్ సుధారాణి బాధ్యతలు తీసుకున్న తరువాత సైతం పనులు ఏమంత మెరుగుపడలేదని పలువురు లేఖర్లు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ పక్రియలో అంతగా అనుభవం లేకపోవడంతో గంటలు కొద్ది వేచి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈసీలకు రెండు రోజులు, నకళ్ళకు మూడు రోజులు ఆస్తి విలువ సర్టిఫికెట్‌లకు అదే సమయం పడుతుందని కార్యాలయానకి వెళ్ళిన పౌరులు చెబుతున్నారు. ఇదేవిధానం కొనసాగితే తాము రిజిస్ట్రేషన్‌లకు ఇతర ప్రాంత కార్యాలయాలకు వెళతామని పలువురు లేఖర్లు హెచ్చరించడంతో తన పనితీరు మెరుగు పరుచుకుంటానని రిజిస్ట్రార్ హామీ ఇచ్చిందని ఒక లేఖరి తెలిపారు. కాగా ఈ సబ్‌రిజిస్ర్టార్‌పై గతంలోనూ కూడా పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలిసింది.
లంచం ఆరోపణల్లో నిజం లేదు
సబ్ రిజిస్ట్రార్ సుధారాణి
సంబంధిత ఆరోపణలపై సబ్ రిజిస్ర్టార్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా లంచం ఆరోపణలలో నిజంలేదని అన్నారు. తాను ఎవరిని లంచం అడగలేదని రిజిస్ట్రేషన్‌లు వేగవంతంగానే జరుగుతున్నాయని ఈసీలు,నకళ్ళు నిర్ణీత సమయంలోనే ఇస్తున్నామని తెలిపారు. కార్యాలయ సిబ్బందిని సైతం అటువంటి వాటి జోలికి వెళ్ళవద్దని చెప్పానని తెలిపారు.
Updated Date - Oct 24 , 2024 | 12:12 AM