కొత్త రేషన్ కార్డులెప్పుడు..?
ABN, Publish Date - Oct 03 , 2024 | 12:08 AM
కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అర్జీలు సమర్పిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు దాటినా ఇంకా కొత్త రేషన్ కార్డులు మంజూరు విషయంలో మార్గదర్శకాలు విడుదల కాలేదు.
ఎన్నికల కోడ్ తర్వాత ఆగిన కార్డుల మంజూరు
కూటమి ప్రభుత్వంలో ఇంకా విడుదల కాని మార్గదర్శకాలు
కొత్త రేషన్ కార్డుల కోసం పెరుగుతున్న అర్జీలు
ఏలూరుసిటీ, అక్టోబరు 2 : కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అర్జీలు సమర్పిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు దాటినా ఇంకా కొత్త రేషన్ కార్డులు మంజూరు విషయంలో మార్గదర్శకాలు విడుదల కాలేదు. రేషన్ కార్డులు మంజూరు అనేది విధాన పరమైన నిర్ణయం కావడంతో కొత్త రేషన్ కార్డులు మంజూరుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కోడ్ విడుదల కావడంతో అప్పటి నుంచి కొత్త రేషన్ కార్డుల మంజూరు నిలిచిపోయింది. కొత్తగా రేషన్ కార్డులు కావాలని, పేర్లు మార్పు చేయాలని, అడ్రస్‌లు మార్పు చేయాలని, కార్డులలో పిల్లల పేర్లు యాడ్ చేయాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు. దీని కోసం జిల్లా, మండల, డివిజన్ స్థాయిల్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలోను అర్జీలు చేస్తున్నారు.
జిల్లాలో రేషన్ కార్డులు 6,41,044
జిల్లాలో ప్రస్తుతం 6,41,044 రేషన్ కార్డులు వరకు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో స్ప్లిట్ కార్డులు, రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు, రేషన్ కార్డులలో పేర్లు కలపడం, కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని లబ్ధిదారులు అర్జీలు పెట్టుకుంటున్నారు. జిల్లాలో ప్రతి వారం 100కు పైగానే రేషన్ కార్డుల కోసం అర్జీలు వస్తున్నట్టు తెలుస్తోంది. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు కోసం ఎంతో కాలంగా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.
కార్డుల మంజూరుపై వెలువడని ఆదేశాలు
రేషన్ కార్డుల మంజూరు విషయంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడాల్సి ఉంది. దాదాపుగా ఆరు నెలల నుం,చి రేషన్ కార్డుల లాగిన్ ఓపెన్ కాకపోవడంతో రేషన్ కార్డు లబ్దిదారుల నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి రేషన్ కార్డుల మంజూరు విషయంపై మార్గదర్శకాలు విడుదల అయితేనే రఽగామ/ వార్డు సచివాలయాల్లో లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. గత ప్రభుత్వ హయాంలో కొంతమందికి అర్హత ఉండి రేషన్ కార్డులు వివిధ కారణాలు రద్దు చేయబడ్డాయి. వారు కూడా కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరు విషయంలో త్వరిత గతిన నిర్ణయిం తీసుకోవాలని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు. ‘రేషన్ కార్డులు మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం స్వల్పంగానే రేషన్ కార్డుల కోసం అర్జీలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంటాం’మని డీఎస్‌వో ఆర్‌ఎస్‌ఎస్ రాజు తెలిపారు.
Updated Date - Oct 03 , 2024 | 12:08 AM