గన్ పౌడర్ పేలి అసోం వాసి మృతి
ABN, Publish Date - Jan 25 , 2024 | 12:33 AM
పిట్టలను షూట్ చేసే తుపాకీల్లో వినియోగించే గన్ పౌడర్ పేలి ముదినేపల్లి మండలం చినకామనపూడిలో అసోంకు చెందిన ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలకు గురైన ఘటన మంగళవారం రాత్రి జరిగింది.
మరొకరికి గాయాలు
ముదినేపల్లి, జనవరి 24 : పిట్టలను షూట్ చేసే తుపాకీల్లో వినియోగించే గన్ పౌడర్ పేలి ముదినేపల్లి మండలం చినకామనపూడిలో అసోంకు చెందిన ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలకు గురైన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ వెంకట్ కుమార్ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆళ్ల వీరాంజనేయులు చేపల చెరువుపై అసోంకు చెందిన బికాస్ బరో, రిటూ బరోను పిట్టలను కాల్చేందుకు తుపాకులతో కాపలా ఉంటున్నారు. చెరువుల్లోని చేపలను తినేందుకు నీటిపై వాలే కాకులు, పిట్టలను వారు తుపాకులతో కాల్చి చంపుతుంటారు. ఇందుకు తుపాకుల్లో వినియోగించే గన్ పౌడర్‌ను తయారు చేసుకుంటారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పౌడర్‌ను తయారు చేస్తుండగా, హఠాత్తుగా పేలి భారీ శబ్దంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రిటూ బరో (25) అక్కడికక్కడే మరణించాడు. తలకు తీవ్ర గాయాలైన బికాస్ బరోను వెంటనే గుడివాడ ప్రభుత్వాసుపత్రికి 108లో తరలించి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కైకలూరు సీఐ కృష్ణ కుమార్, ముదినేపల్లి ఎస్‌ఐ వెంకట్ కుమార్ బుధవారం ఉదయం పరిశీలించారు. తుపాకులు సప్లయి చేసి పనులు అప్పగించిన ప్రస్తుతం వరహపట్నంలో ఉంటున్న తమిళనాడుకు చెందిన కంట్రాక్టర్ సతీష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Jan 25 , 2024 | 12:33 AM