మన ఇల్లు మన గౌరవం
ABN, Publish Date - Sep 23 , 2024 | 12:32 AM
ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పేదల ఇళ్ళు నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చెయ్యాల్సిందే. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. జిల్లా అధికారులకు బాధ్యతలు అప్పగించింది.
28న ప్రతీ లే–అవుట్‌లోను సదస్సులు
మార్చిలోగా పేదల ఇళ్ళు పూర్తి
చెయ్యాల్సిందే.. లేదంటే కేంద్ర నిధులకు అవరోధం
జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం
మార్చి తరువాత పీఎంఎవై 2.0 అమలు
భీమవరం టౌన్, సెప్టెంబరు 22 : ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పేదల ఇళ్ళు నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చెయ్యాల్సిందే. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. జిల్లా అధికారులకు బాధ్యతలు అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజనపఽథకం (పీఎంఎవై–1.0) లో భాగంగా రూ.1.80 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ళ స్థలాలు మంజూరు చేసారు. కేంద్రం ఇచ్చే నిధులనే తమవిగా గొప్పలు చెప్పుకున్నారు. ఇళ్ల నిర్మాణం మాత్రం సకాలంలో పూర్తి చెయ్యలేకపోయారు. ఇప్పటికి జిల్లాలో పూడిక చెయ్యని లే–అవుట్‌లు దర్శనం ఇస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షలకు చెరువులను తలపించాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు పీఎంఏవై పథకంలో పేదల ఇళ్ళపై దృష్టిపెట్టింది. గడువులోగా పూర్తి చెయ్యాలని లక్ష్యాలను నిర్ధేశించింది. జిల్లాలో 625 లే–అవుట్‌లు ఉన్నాయి. ప్రతీ లే–అవుట్‌కు ఒక ఇన్‌ర్జిను నియమించారు అక్కడ సాదకబాధలను తెలుసుకుని జిల్లా కలెక్టర్‌కు నివేదకలు ఇవ్వాలి. ఇప్పటికే ఇన్‌చార్జిలతో సమావేశమై వివరాలను రాబట్టారు. మొత్తంమీద ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా 2025 మార్చినాటికి ఇళ్ళు పూర్తిచెయ్యాలనే లక్ష్యంతో కుస్తీపడుతున్నారు మన ఇల్లు– మన గౌరవం పేరుతో లబ్ధిదారులను అవగాహన కల్పించనున్నారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 28న ప్రతీ లే–అవుట్‌లోను సమావేశం ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు.
నిఽధులకు గండం
ప్రధానమంత్రి ఆవాస యోజనలో పట్టణ పేదలకు గత ప్రభుత్వం సెంటు స్థలం కేటాయించారు. గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర స్థలం కేటాయించారు. ఇళ్ళు పూర్తికాకపోతే నిధులకు అవరోధం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆదేశించినట్లుగా 2025 మార్చిలోగా పూర్తిచెయ్యాలి. ఆ గడువు దాటితే ఎటువంటి ఆర్థిక సాయం ఉండదు. అంటే కేంద్రం ఇచ్చే రూ.1.80 లక్షలు మంజూరు చెయ్యదు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్ట చేసింది. అందుకోసమే మన ఇల్లు– మన గౌరవం పరుతో అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మార్చి తరువాత పీఎంఏవై 2.0
కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి తరువాత పీఎంఏవై 2.0ను అమలు చెయ్యనుంది. అయితే పీఎంఏవై 1.0లో స్థలాలు తీసుకున్న లబ్ధిదారులకు మళ్ళీ కేటాయించే అవకాశం లేదు. ఉన్న స్థలంలోనే ఇల్లు నిర్మాంచుకోవాలి ఈవిషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం కూడా పీఎంఎవై 2.0లో రాయితీ పెంచే అవకాశం లేదు. గతంలో మాదిరిగానే రూ.1.80 లక్షలు మాత్రమే మంజూరు చేస్తుంది. అయితే లబ్ధిదారులకు మరో అవకాశం కల్పించారు. మార్చి తరువాత ఫ్లోరింగ్, విద్యుద్దీకరణ, ప్లాస్టింగ్, మరుగుదొడ్ల నిర్మించుకునే అవకాశం ఇస్తున్నారు. మిగతా నిర్మాణం మార్చి నెలాఖరులోగా పూర్తిచేసుకోవలసి ఉంది. దీనిపై లబ్ధ్దిదారులకు ఈనెల 28న నిర్వహించే సదస్సులో అవగాహన కల్పించనున్నారు.
సదస్సు భాగస్వాములు వీరే..
మనఇల్లు– మన గౌరవం పేరిట ఈనెల28న నిర్వహించే సదస్సుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. అలాగే లే–అవుట్ ఇన్‌ఛార్జులు, హౌసింగ్ ఇంజనీర్లు, సచివాలయ సంక్షేమ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొంటారు. లే–అవుట్‌లో మౌలిక వసతులు కల్పించే విద్యుత్, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులు భాగస్వామలు కానున్నారు. జిల్లాలో ఆదిశగా జిల్లా ప్రణాళిక సిద్ధ్దంచేస్తున్నారు. ఈనెల 24న మండల స్థాయిలో సమావేశం ఉంటుంది. అక్కడే సిబ్బందికి ప్రభుత్వ మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తారు.
పెండింగ్ లే –అవుట్‌లు ఎలా..?
భీమవరం,తణుకు నియోజకవర్గల్లో లే–అవుట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పూడిక చెయ్యలేదు. మళ్ళీ టెండర్లు పిలవనున్నారు. లబ్ధిదారులకు స్థలాలను కేటాయించనున్నారు. తరువాత నిర్మాణాలు చేపడతారు. మరోవైపు వైసీపీ ప్రభుత ్వం కాంట్రాక్టుల ద్వారా నిర్మాణం చేపట్టారు. మధ్యలోనేవారు చేతులు ఎత్తేశారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంది.
మండలం మంజూరైన పూర్తయిన పెండింగ్
ఇళ్లు ఇళ్లు
ఆకివీడురూరల్ 2,199 785 1414
పాలకోడేరు 2585 1104 1481
అత్తిలి 2408 1063 1345
భీమవరంటౌన్ 7297 465 6832
తాడేపల్లిగూడెంటౌన్ 3826 1570 2256
పెంటపాడు 2446 1468 978
వీరవాసరం 1758 913 845
ఆకివీడుటౌన్ 1233 408 825
గణపవరం 1663 1070 593
ఉండి 3040 1505 1535
భీమవరంరూరల్ 1969 1235 734
కాళ్ళ 1265 924 341
తాడేపల్లిగూడెంరూరల్ 3820 2117 1703
పాలకొల్లు అర్బన్ 1101 456 645
నరసాపురంరూరల్ 2778 1023 1755
నరసాపురం అర్బన్ 2811 755 2056
యలమంచిలి 2478 1520 958
ఆచంట 2741 1423 1318
తణుకు అర్బన్ 6383 1275 5108
తణుకు రూరల్ 4075 1545 2530
పోడూరు 2978 1494 1484
పెనుమంట్ర 3243 1551 1692
పెనుగొండ 3593 1506 2087
ఇరగవరం 2503 1503 1000
మొగల్తూరు 2289 1439 850
పాలకొల్లురూరల్ 1310 942 368
73,792 31,059 42,733
Updated Date - Sep 23 , 2024 | 12:32 AM