హవాలాపై నిఘా
ABN, Publish Date - Mar 31 , 2024 | 12:10 AM
హవాలా దందాకు నరసాపురం కేరాఫ్‌గా మారింది. ఎన్నికలు వచ్చాయంటే అభ్యర్థులకు, ప్రధానపార్టీలకు ఇక్కడ నుంచే సొమ్ము బట్వాడా జరిగేది. పోలీసు తనిఖీల్లో ఎన్నో సంఘటనలు వెలుగుచూశాయి.
పూర్వపు ఘటనలతో పోలీసులు అప్రమత్తం
నరసాపురంలో ముమ్మర తనిఖీలు
చీకటి వ్యాపారుల కదలికలపై డేగకన్ను
నరసాపురం, మార్చి 30 : హవాలా దందాకు నరసాపురం కేరాఫ్‌గా మారింది. ఎన్నికలు వచ్చాయంటే అభ్యర్థులకు, ప్రధానపార్టీలకు ఇక్కడ నుంచే సొమ్ము బట్వాడా జరిగేది. పోలీసు తనిఖీల్లో ఎన్నో సంఘటనలు వెలుగుచూశాయి. వీటి లింకులన్ని నరసాపురంతోనే ముడిపడి ఉండటంలో ఈసారి పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు నుంచి ఈ ప్రాంతంపై డేగ కన్నేశారు. ఈ చీకటి వ్యాపారం చేసే కేటుగాళ్ళ కదలికలను గమనిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కేటుగాళ్లు రూటు మార్చారు. ఎన్నికల కోడ్ రాకుండానే అప్రమత్తమయ్యారు. రెండు, మూడు సురక్షిత ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. అక్కడి నుంచే హవాలా రూపంలో సొమ్ము తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు డబ్బు తరలింపు సూట్ కేసులు, సంచుల్లో ఉండేది. వీటిని అభ్యర్థులకు అందించేందుకు నానా పాట్లు పడేవారు. కొన్ని సమయాల్లో పోలీసులకు పట్టుబడేవారు. ఈ పని చాలా కష్టంగా ఉండటంతో అభ్యర్థులు రూటు మార్చారు. చేతికి మట్టి అంటకుండా హవాలా రూపంలో తరలిస్తున్నారు. ఈ దందాలో రిస్క్ అంతా హవాలాదారుడిదే. దీనికి కమీషన్ ఎక్కువైనా. లెక్క చేయడం లేదు. ఇది చీకటి వ్యాపారులకు వరంగా మారింది. సాధారణ రోజుల్లో ఐదు శాతం ఉండే కమిషన్ ఎన్నికల సమయాల్లో 8 నుంచి 10 శాతం వరకు పెంచేస్తున్నారు. పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉంటే ఈ కమిషన్ మొత్తాన్ని మరో రెండు శాతం వరకు పెట్టి డీల్‌ను ఖరారు చేసుకుంటున్నారు. అన్ని సక్రమంగా జరిగితే కోట్ల రూపాయల కమీషన్ అర్జిస్తున్నారు. గడిచిన పదేళ్లుగా ఈ చీకటి దందా తెలుగు రాష్ర్టాల్లో జోరందుకుంది. ఈ చీకటి దందాలో చాలా లింకులు నరసాపురంతోనే ముడిపడుతూ వచ్చాయి. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాల్లో డబ్బు తరలిస్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడినప్పుడు నరసాపురం పేరే వినిపించింది. దీంతో ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంపైనే డేగ కన్ను వేశారు. జిల్లా నుంచి వచ్చే వాహనాలు, రైళ్లను హైదరాబాద్‌లో క్షుణ్ణం గా తనిఖీ చేసేవారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో పోలీసు లు నరసాపురంపై నిఘా పెట్టారు. తెలుగు రాష్ర్టాల్లో హవాలా రూపంలో క్షణాల్లో కోరినంత సొమ్మును సమకూర్చ గలిగిన సత్తా ఈ ప్రాంతానికి చెందిన కేటుగాళ్లు దగ్గర ఉందన్న పక్కా సమాచారంతో గట్టి నిఘా పెట్టారు. వీరికి చెక్ పెడితే ఎన్నికల్లో డబ్బు పంపిణీని చాలా వరకు నియంత్రించవచ్చన్న భావన పోలీసు వర్గాల్లో నెలకొంది. ఆ దిశగా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటుచేశారు.
Updated Date - Mar 31 , 2024 | 12:10 AM