విడదీయలేని అనుబంధం
ABN, Publish Date - Feb 02 , 2024 | 12:13 AM
సికింద్రాబాద్–విశాఖపట్నం మద్య నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌తో జిల్లా ప్రయాణికులకు ఎంతో విడదీయరాని అనుభందం ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈఎక్‌ప్రెస్‌కు గురువారంతో 50 ఏళ్ళు పూర్తయ్యాయి.
గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు యాభై ఏళ్లు
నరసాపురం, ఫిబ్రవరి 1: జిల్లా మీదుగా ఎన్నో ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తుంటాయి. వాటిలో కొన్ని రైళ్లలో ప్రయాణించేదుకు చాలామంది ఇష్టపడుతుంటారు. అటువంటి వాటిలో గోదావరి ఎక్స్‌ప్రెస్ ఒకటి. సికింద్రాబాద్–విశాఖపట్నం మద్య నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌తో జిల్లా ప్రయాణికులకు ఎంతో విడదీయరాని అనుభందం ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈఎక్‌ప్రెస్‌కు గురువారంతో 50 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ ఐదు దశాబ్దాల కాలంలో ఈ ఎక్స్‌ప్రెస్ లక్షలాది మంది జిల్లా వాసులను సురక్షితంగా గమ్య స్థానాలకు క్షేమంగా చేర్చింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలో నడిచే ఈ ఎక్స్‌ప్రెస్ 1974 ఫిబ్రవరి 1న పట్టాలెక్కింది. 7007 నంబర్‌తో సికింద్రాబాద్–విశాఖ మధ్య నడిచేది. 2011 వరకూ ఈ రైలు ఎక్స్‌ప్రెస్‌గానే నడుస్తుండటంతో జిల్లాలో ఏలూరు, భీమడోలు, నిడదవోలు, కొవ్వూరు స్టేషన్‌లలో ఆగేది. అయితే దీనిని సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా చేసి నంబర్ 12727గా మార్చారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో ఏలూరు,తాడేపల్లిగూడెం స్టేషన్‌లలో మాత్రమే ఆగుతోంది. దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి ఎసీ ఫస్ట్‌క్లాస్ బోగీలతో నడిచే ఎక్స్‌ప్రెస్ ఇదే కావడం గమనార్హం. అటు సికింద్రాబాద్, ఇటు విశాఖపట్నం వెళ్ళేవారు ముందుగా ఈ రైలులో వెళ్లేందుకు మక్కువ చూపుతారు.షెడ్యూల్ సమయాలకు అనుగుణంగా ఈరైలు నడవటమే దీనికి కారణం. జిల్లా వాసులతో ఎంతో అనుబంధం పెనవేసుకున్న ఈ రైలుకు నేటికి 50 ఏళ్లు నిండటంతో చాలా మంది ప్రయాణికులు తమ అనుభూతులను గుర్తు చేసుకుంటున్నారు.
Updated Date - Feb 02 , 2024 | 12:13 AM