మాగుంట ఊసే వద్దు!
ABN, Publish Date - Jan 18 , 2024 | 03:37 AM
మాగుంట శ్రీనివాసులురెడ్డి మాటే ఎత్తొద్దు. ఆయన రెండు నియోజకవర్గాలను ప్రభావితం చేయగల మొనగాడట కదా? ఎంతటి మొనగాడో చూస్తా! ఎన్నికల్లో ఆయనకే కాదు..
ఎంత మొనగాడో చూస్తా!.. ఆయనకే కాదు, కొడుక్కీ టికెట్ ఇవ్వను
బాలినేనికి జగన్ స్పష్టీకరణ.. సీఎంవోకు పిలిపించి మంతనాలు
ఒంగోలు, గిద్దలూరుల్లో ఎక్కడ పోటీచేస్తావని ప్రశ్న
ఇళ్ల స్థలాలిస్తేనే బరిలోకి దిగుతానన్న మాజీ మంత్రి
ఎంత ఖర్చవుతుందో తెలుసుకుని చెబుతానన్న ముఖ్యమంత్రి
మాగుంటకు చెక్ పెట్టినట్లే!.. టీడీపీ వైపు ఒంగోలు ఎంపీ చూపులు?
అమరావతి/ఒంగోలు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ‘మాగుంట శ్రీనివాసులురెడ్డి మాటే ఎత్తొద్దు. ఆయన రెండు నియోజకవర్గాలను ప్రభావితం చేయగల మొనగాడట కదా? ఎంతటి మొనగాడో చూస్తా! ఎన్నికల్లో ఆయనకే కాదు.. ఆయన కొడుక్కి కూడా టికెట్ ఇవ్వను’ అని సీఎం జగన్మోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ‘నువ్వు ఎక్కడ నుంచి పోటీ చేస్తావ్.. ఒంగోలు నుంచా, గిద్దలూరు నుంచా’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ‘మాగుంట’ అని బాలినేని అనేలోపే.. ఆయన ఊసే ఎత్తవద్దని జగన్ సీరియ్‌సగా చెప్పేశారు. ఒంగోలు లోక్‌సభ.. అసెంబ్లీ టికెట్లపై ముఖ్యమంత్రి స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఒంగోలు లోక్‌సభ స్థానాన్ని మాగుంటకే ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు. ఆయనకు సీటిస్తేనే తాను ఒంగోలు అసెంబ్లీ బరిలో నిలుస్తానని ఇంతకాలం చెబుతూ వచ్చారు. జగన్ అంగీకరించకపోవడంతో అలిగి హైదరాబాద్ వెళ్లి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆయన్ను సీఎంవోకు పిలిచారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలసి బాలినేని, ఆయన కుమారుడు తాడేపల్లి వచ్చారు. ఈ సందర్భంగా బాలినేని, జగన్ చర్చలు పట్టుమని పదినిమిషాలూ జరగలేదని తెలుస్తోంది. మాగుంట పేరెత్తగానే సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు, ఆయన కుమారుడికీ టికెట్లు ఇచ్చేది లేదన్నారు.
ఎట్టకేలకు రాజీ!
మాగుంటకు ఒంగోలు లోక్‌సభ టికెట్ ఇస్తేనే తాను అసెంబ్లీకి పోటీచేస్తానని ప్రకటించిన బాలినేని.. ఇప్పుడు ఒంగోలులో ఇళ్ల పట్టాల సంగతి తేలిస్తేనే పోటీ చేస్తానని జగన్‌కు చెప్పారు. ఈ వ్యవహారంలో ఇద్దరూ రాజీపడినట్లేనని రాజకీయ వర్గాలు తెలిపాయి. ఇళ్ల పట్టాలకు ఎంత ఖర్చవుతుందో అధికారులతో మాట్లాడి తేలుస్తానని, ఖర్చు భరించగలమో లేదో చెబుతానని జగన్ అన్నారు. ఆ నిర్ణయాన్ని బట్టి తాను ఒంగోలు నుంచి పోటీ చేయాలో.. గిద్దలూరుకు వెళ్లాలో నిర్ణయించుకుంటానని బాలినేని చెప్పారు. అయితే మాగుంటకు టికెట్ విషయంలో ఆయన సీఎంతో రాజీపడినట్లు స్పష్టమవుతోంది. బుధవారం సాయంత్రం తొలుత విజయవాడలో ఐ-ప్యాక్ ప్రతినిధులతో.. తర్వాత సీఎంవో అధికారి ధనుంజయరెడ్డిలతో బాలినేని సమావేశమయ్యారు. తన డిమాండ్లు, నియోజకవర్గ అభివృద్ధి వ్యవహారాలపై చర్చించారు. తర్వాత సాయంత్రం 5గంటల సమయంలో ఆయన సీఎంను కలిసినట్లు తెలిసింది. ఒంగోలులో ఆయన డిమాండ్లలో ఒకటైన పేదలకు నివాస స్థల పట్టాలిచ్చే భూములకు సంబంధించి ప్రకాశం జిల్లా కలెక్టరుకు ఆగమేఘాలపై కొన్ని ఉత్తర్వులిచ్చారు. 25 వేల మందికి పట్టాలిచ్చేందుకు భూమి కొనుగోలు, అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి ఇంకా రూ.170 కోట్లు రావలసి ఉంది. అవి వచ్చి పట్టాలిస్తేనే తాను పోటీచేస్తానని.. లేకుంటే లేదని బాలినేని బహిరంగ వ్యాఖ్యలు చేయడంపై జగన్ కస్సుమన్నారు. సీఎంవోకు వచ్చినా అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. తాజా పరిణామాలతో.. ప్రకాశం జిల్లా కొండపి, సంతనూతలపాడుల్లో పోటీచేస్తున్న మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేరుగ నాగార్జునతో పాటు విజయసాయిరెడ్డి, ఇతరుల సూచనలతో జగనే స్వయంగా బాలినేనికి ఫోన్ చేసి పిలిపించుకున్నారు. ఇదే సమయంలో ప్రకాశం కలెక్టరు పేదలకు నివాసస్థలాలు ఇచ్చేందుకు గుర్తించిన భూమి 402 ఎకరాలలో రూ.21 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు. సీఎంవో అధికారి ధనుంజయరెడ్డి కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తాన్ని రెండు వాయిదాల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే బాలినేని రాజకీయ డిమాండ్లలో ప్రధానమైనది ఒంగోలు ఎంపీ స్థానాన్ని మాగుంటకు ఇవ్వడం. ఇందుకు జగన్ ససేమిరా అన్నారు. బాలినేనితోపాటు ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డికి కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బాలినేని ఎక్కడ పోటీచేయాలి.. ఆయన కుమారుడికి ఏ అవకాశమిస్తారో స్పష్టత ఇవ్వలేదని అంటున్నారు. మాగుంట విషయంలో బాలినేని వెనక్కి తగ్గినట్లేనని వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఇంకోవైపు.. మాగుంట ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు లేక ఒంగోలులో పోటీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.
పండగ పోయినా కుస్తీలే!
సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై జగన్ కసరత్తు కొనసాగుతోంది. పండక్కి ముందే అభ్యర్థులను ఖరారు చేయాలన్న ఆయన ఆలోచన నిజం కాలేదు. ఇప్పటిదాకా 3 విడతల్లో 50 మంది అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన ఆయన.. ఇంకెన్ని స్థానాల్లో మార్పులూ చేర్పులూ చేస్తారోనని ఎమ్మెల్యేలకు ఉత్కంఠగా ఉంది. సంక్రాంతి వెళ్లిపోయినా నాలుగో జాబితాపై జగన్ ఎడతెగని కసరత్తు చేస్తున్నారు. బుధవారంనాడు పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, శృంగవరపు కోట, నరసరావుపేట, కమలాపురం, కొత్తపేట ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి సీఎంవోకు వచ్చారు. సలహాదారు సజ్జల, ఽధనుంజయరెడ్డితో చర్చించారు. ఈ కసరత్తు 2-3 రోజులు కొనసాగుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
Updated Date - Jan 18 , 2024 | 06:26 AM